ఇరాన్‌లో బీబీసీ జర్నలిస్టులపై వేధింపులు ఆపాలన్న ఐరాస

  • 26 అక్టోబర్ 2017
బీబీసీ కార్యాలయం

బీబీసీ పర్షియన్ సర్వీస్ ఉద్యోగులపై, వారి కుటుంబాలపై వేధింపులను వెంటనే నిలిపివెయ్యాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విషయమై తమకు బీబీసీ నుంచి ఫిర్యాదు అందిందని భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ప్రత్యేక రాయబారి ధ్రువీకరించారు.

'జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్ర' పన్నారన్న ఆరోపణపై బీబీసీకి చెందిన 152 మంది ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, వారి సహచరులపై ఇరాన్ ప్రభుత్వం క్రిమినల్ విచారణ ప్రారంభించింది.

కోర్టు ఆదేశాలతో 150 మంది ఉద్యోగుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. అంటే ఉద్యోగులెవరూ తమ ఆస్తులను, కార్లను అమ్ముకోలేరు. వీరి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను సైతం విక్రయించరాదని కోర్టు ఆదేశించింది.

ఈ అంశంపై తమ సిబ్బందికి బీబీసీ అండగా నిలిచింది. ఇరాన్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించాలని బీబీసీ ఐక్యరాజ్య సమితిని కోరింది.

ఇరాన్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఆస్మా జహంగీర్‌కు కూడా ఈ విషయంపై బీబీసీ ఫిర్యాదు చేసింది. బుధవారం ఐక్యరాజ్యసమితికి పంపిన నివేదికలో పర్షియాలోని బీబీసీ జర్నలిస్టులు, వారి కుటుంబాలపై జరుగుతున్న వేధింపుల గురించి ఆమె ప్రస్తావించారు. ఈ వేధింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రిమినల్ విచారణలో ప్రస్తుత ఉద్యోగులతోపాటు కాంట్రిబ్యూటర్లు, బీబీసీ మాజీ సిబ్బంది కూడా ఉన్నారు. జాతీయ భద్రతపై కుట్రపన్నుతున్నారన్నది వీరిపై ప్రధాన అభియోగం.

"ఇరాన్ ప్రభుత్వం వివిధ రకాలుగా పర్షియా బీబీసీ జర్నలిస్టులను వేధిస్తోంది. జర్నలిస్టులను అకారణంగా అరెస్టు చేయడం, వారి కుటుంబ సభ్యులను నిర్బంధించడం, వారి పాస్‌పోర్టులను స్తంభింపచేయడమే కాకుండా జర్నలిస్టుల కుటుంబ సభ్యులు తమ బంధుమిత్రుల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. వీరి పరువుకు భంగం కలిగేలా రకరకాల పుకార్లు పుట్టించి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. వీరిపై నిరంతరాయంగా పోలీసు నిఘా ఏర్పాటు చేశారు" అని బీబీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం శీర్షిక బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్

బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ఇరాన్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. బీబీసీ మాజీ ఉద్యోగులతోపాటు ప్రస్తుత ఉద్యోగులు, కాంట్రిబ్యూటర్లపై జరుగుతున్న దర్యాప్తు ఏకపక్షంగా ఉందన్నారు. దర్యాప్తులో రాజకీయ కోణం, రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కన్పిస్తున్నాయన్నారు. ఇది కేవలం బీబీసీ సిబ్బందిని వేధించడం మాత్రమే కాదని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని టోనీ హాల్ అభిప్రాయపడ్డారు. తమ సిబ్బందిపై వేధింపులను ఆపాలని, చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకోవాలని బీబీసీ కోరింది.

''బీబీసీ పర్షియా సర్వీస్ నిష్పాక్షిమైన, పారదర్శకమైన వార్తలను ఇరాన్ ప్రజలకు అందిస్తోంది. బీబీసీ జర్నలిస్టుల నిబద్దతకు, వారి అంకితభావానికి ధన్యవాదాలు. ఇరాన్ ప్రభుత్వ వేధింపులను భరిస్తున్న వీరి ఆత్మస్థైర్యం గొప్పది. వీరికి అభినందనలు తెలుపుతున్నాను'' అని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ అన్నారు.

''తన సిబ్బంది తరఫున ఎంతవరకైనా పోరాడేందుకు బీబీసీ సిద్ధంగా ఉంది. చట్టపరమైన అన్ని మార్గాలనూ, అవకాశాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. అంతర్జాతీయ జర్నలిస్టుల మద్దతు కోరి, తన నిరంకుశ వైఖరిని ఉపసంహరించుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తెస్తాం'' అని టోనీ హాల్ పేర్కొన్నారు.

2009 లో జరిగిన ఇరాన్ ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఇరాన్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచీ బీబీసీ జర్నలిస్టులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇరాన్ ప్రభుత్వం వేధింపులకు గురవుతున్నారు.

తోబుట్టువులను సైతం వదల్లేదు

ఓ జర్నలిస్ట్ సోదరిని ఇరాన్‌లోని ఎవిన్ జైలులో 17 రోజులపాటు నిర్బంధించారు. జైలు నుండే తన సోదరుడికి స్కైప్ ద్వారా వీడియోకాల్ చేయించారు. బీబీసీలో ఉద్యోగం మానేయాలని, తోటి ఉద్యోగులపై గూఢచర్యం చేయాలని ఆయనకు ఆమె ద్వారా బలవంతంగా చెప్పించారు.

వయసు పైబడిన జర్నలిస్టుల తల్లిదండ్రులను అర్ధరాత్రి సమయాల్లో విచారణ పేరిట వేధింపులకు గురిచేశారు.

జర్నలిస్టుల పిల్లలనూ వదల్లేదు. ఓ చిన్నారిని పిలిపించుకుని విచారించారు.

బీబీసీ సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం చావుబతుకుల్లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు కూడా రావడంలేదు. అరెస్టుల భయం వారిని వెంటాడుతోంది.

స్థానిక మీడియా, సోషల్ మీడియాలలో అసత్య వార్తలతో వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. బీబీసీ జర్నలిస్టులపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఇరాన్ చట్టాల ప్రకారం మరణ శిక్ష విధించదగ్గ నేరారోపణలు చేస్తున్నారు.

బీబీసీ ఫిర్యాదుతో ఇరాన్ ఉల్లంఘించిన అంతర్జాతీయ ఒప్పందాలు వెలుగుచూశాయి.

బీబీసీ పర్షియా, బీబీసీ రేడియో, బీబీసీ ఆన్‌లైన్‌లకు ప్రేక్షకుల సంఖ్య వారానికి ఒక కోటి ఎనభై లక్షలు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)