భారత్‌లో తొలిసారి వెలుగు చూసిన 15.2 కోట్ల ఏళ్ల నాటి అరుదైన ఇచ్‌త్యోసార్ శిలాజాలు

  • 27 అక్టోబర్ 2017
ఇచ్‌త్యోసార్ శిలాజం Image copyright Courtesy G Prasad
చిత్రం శీర్షిక ఇచ్‌త్యోసార్ శిలాజాలను భారత్‌లో గుర్తించడం ఇదే మొదటిసారి.

భారతీయ శాస్త్రవేత్తలు అరుదైన శిలాజాలను గుర్తించారు. ఇవి 15.2 కోట్ల సంవత్సరాల నాటివి. గుజరాత్‌లోని పశ్చిమ కనుమల్లో వీటిని కనుగొన్నారు.

వీటిని ఇచ్‌త్యోసార్ శిలాజాలు అంటారు. ఈ శిలాజాలు అంతరించి పోయిన సముద్ర జీవులవి. ఈ జీవులు సరీసృపాలు.

ఇటువంటి శిలాజాలు బయటపడటం భారతదేశంలో ఇదే మొదటిసారి.

ఈ శిలాజాలు మెసోజాయిక్.. అంటే డైనోసార్ల యుగం నాటివి. ఈ యుగం దాదాపు 25.2-6.6 కోట్ల సంవత్సరాల మధ్య నేటి కచ్ ఎడారిలో గడిచింది.

గుజరాత్‌లో గుర్తించిన శిలాజం 18 అడుగులు పొడవు ఉన్నట్లు ప్రొఫెసర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ పరిశోధన ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది.

పుర్రె, తోకకు సంబంధించిన ఎముకలు కనిపించలేదు.

ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్లాస్ వన్ సైన్స్ జర్నల్ ప్రచురించింది.

"ఈ ఆవిష్కరణ ఎంతో ప్రత్యేకమైనది" అని ప్రసాద్ చెప్పారు.

"ఇది భారతదేశంలో డైనోసార్ల యుగం నాటి తొలి ఇచ్‌త్యోసార్ శిలాజం. అంతేకాదు ఇండో-మడగాస్కర్ ప్రాంతంలో సముద్ర సరీసృపాల జీవన వైవిధ్యం, పరిణామంపై ఈ పరిశోధన మరిన్ని విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది" అని ఆయన తెలిపారు.

"జురాసిక్ కాలంలో జీవన వైవిధ్యానికి సంబంధించి ఇతర ఖండాలతో భారత్‌కు గల సంబంధాలను తెలుసుకోవడానికి కూడా ఈ పరిశోధన ఎంతో ముఖ్యం" అని ఆయన వెల్లడించారు.

ఈ పరిశోధన బృందంలో భారత, జర్మనీ శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో దొరికిన శిలాజం చాలా పురాతనమైనది.

అవి 16.5-9 కోట్ల ఏళ్ల మధ్య జీవించిన సముద్ర జీవులు ఆప్తల్మోసార్స్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ఇవి ఇచ్‌త్యోసార్ కుటుంబానికి చెందినవి.

ఇచ్‌త్యోసార్లు

Image copyright James McKay
  • వీటిని అప్పుడప్పుడు ఈతకొట్టే డైనోసార్లుగా పొరబడతుంటారు. 25.10-19.90 కోట్ల ఏళ్ల నాటి ట్రయాసిక్ యుగంలో ఇచ్‌త్యోసార్లు తొలిసారిగా కనిపించాయి.
  • ఇచ్‌త్యోసార్ అంటే చేప-బల్లి అని అర్థం. 19వ శతాబ్దం నుంచి వీటిని సరీసృపాలుగా వర్గీకరించారు.
  • వీటి పొడవు 1-14 మీటర్లు. అయితే వీటి సగటు పొడవు 2-3 మీటర్లు.
  • వీటి దంతాలు ఎంతో పదునైనవి.
  • ఇచ్‌త్యోసార్లు దాదాపు 9 కోట్ల సంవత్సరాల క్రితం జీవించాయి.

ఆధారం: ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ పాలెంటాలజీ

ఈ పరిశోధన ద్వారా మరెన్నో కొత్త విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం భారత్, దక్షిణ అమెరికా మధ్య ఏమైనా సముద్ర మార్గం ఉండేదో లేదో తెలుసుకునేందుకు గుజరాత్‌లో దొరికిన శిలాజాలు ఉపయోగపడొచ్చని పరిశోధన బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

పళ్లను పరిశీలిస్తే ఈ జీవి వేటకు పెట్టింది పేరులా కనిపిస్తోంది.

Image copyright University of Delhi

ప్రొఫెసర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ గుంటూరు జిల్లాలోని శేకూరు గ్రామంలో గుంటుపల్లి హనుమంతరావు, హైమావతి దంపతులకు జన్మించారు.

ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా స్వీకరించారు.

ప్రస్తుతం ఢిల్లీ యూనివర్శిటీలో జియాలజీ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు