మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు

  • 30 అక్టోబర్ 2017
షార్లెట్ కూపర్, మొదటి మహిళా ఒలింపిక్ ఛాంపియన్ Image copyright Getty Images

20వ శతాబ్దం తొలినాళ్లలో మహిళల క్రీడా దుస్తులకు సంబంధించి ఎటువంటి డిజైన్లూ ఉండేవి కావు. వారు వేసుకునే దుస్తులపై ఎన్నో పరిమితులుండేవి. అలా దాని ప్రభావం క్రీడలపై కూడా ఉండేది. పొడవాటి దుస్తులతో మహిళలు క్రీడల్లో పాల్గొనడం వల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా, వారి ఆటపై కూడా ప్రభావం చూపింది.

గత కొన్నేళ్లుగా క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళలు మరింత చురుకుగా ఆటల్లో పాల్గొంటున్నారు. క్రీడా దుస్తులలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మార్పులొచ్చాయి. కానీ కొన్ని చోట్ల పరిస్థితులు ఇంకా పూర్తిగా మారలేదు.

బీబీసీ న్యూస్ '100 మంది మహిళలు' కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో లింగవివక్ష గురించీ, గత కొన్ని దశాబ్దాలుగా మహిళల క్రీడా దుస్తులలో వచ్చిన పరిణామాల గురించీ చర్చిస్తోంది.

టెన్నిస్

మొట్టమొదటిసారిగా మహిళలు 1900లో ఒలంపిక్స్‌లో పాల్గొన్నారు. అప్పట్లో మహిళలు టెన్ని‌స్‌తో పాటు ఐదు రకాల ఆటల్లోనే పాలుపంచుకునేవారు. ఒలంపిక్స్‌లో మహిళల భాగస్వామ్యం ఆనాటికి 2 శాతం మాత్రమే. వారు పొడవాటి స్కర్టులు వేసుకునేవారు. ఎంత పొడవంటే మోకాళ్లు కూడా కనబడేవి కావు. పొడవాటి స్లీవ్‌లుండేవి.

ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారిణి సుజానే లెంగ్‌లెన్ టెన్నిస్ ఆటలో సంచలంగా నిలిచారు. ఆమె విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్రకెక్కారు. ఆమె తన కాలంలోనే మొట్టమొదటిసారిగా మహిళల క్రీడా దుస్తులలో మార్పు తెచ్చారు. పొడవాటి స్కర్టులను టెన్నిస్ ఆటకు అనుకూలంగా ఉండే విధంగా లెంగ్‌లెన్ మార్చారు.

పొడవుగా ఉండే స్లీవ్‌లను కాస్త తగ్గించారు. బండవ్ అనే డ్రెస్సును కూడా వేసుకునేవారు. చివరికి ఆమె వేసుకునే డ్రెస్సే ఆమె ట్రేడ్ మార్క్ అయ్యింది.

"మహిళలందరూ మహిళల క్రీడా దుస్తులలో మార్పు తెచ్చినందుకు ముందుగా సుజానేకు కృతఙ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మహిళల దుస్తులను క్రీడలకు అనుగుణంగా మార్చిన ఘనత ఆమెకే దక్కుతుంది" అని అమెరికన్ టెన్నిస్ చాంపియన్ ఎలిజబెత్ ర్యాన్ అన్నారు.

Image copyright Getty Images

ప్రస్తుతం టెన్నిస్‌లో మహిళలు వేసుకునే దుస్తులు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు క్రీడాకారులు మైదానంలో స్టైలిష్‌గా కూడా కనబడతారు. టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను 2007లో ప్రారంభించారు.

Image copyright Getty Images

స్విమ్మింగ్‌

ప్రస్తుతం స్విమ్మింగ్ క్రీడకు వేసుకునే దుస్తులు వివిధ రంగులలో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఇవి కూడా ఒకప్పుడు మరోలా ఉండేవి. 1984లో స్మిమ్మింగ్ ఒలంపిక్స్‌లో భాగమయ్యింది.

Image copyright Getty Images

"స్విమ్మింగ్ కళాత్మక క్రీడ. ఇందులో ఎలా కనిపిస్తారనేది కూడా ముఖ్యమే. మీ జుట్టు, వేసుకునే దుస్తులు, శరీరం ఇవన్నీ అద్భుతంగా ఉండాలి" అని ఎరిన్ విల్‌సన్ తెలిపారు.

Image copyright Getty Images

హ్యాండ్‌బాల్

హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఇసబెలా ఫ్లూరీ ఈ ఏడాది బీబీసీ 100 మహిళల్లో ఒకరు. ఆమె రియో డీ జనీరియో టీం సభ్యురాలు. ఇటీవల ఆమె మహిళల హ్యాండ్‌బాల్ బికినీ దుస్తులకు సంబంధించి నిరసన గళం విప్పి వార్తల్లోకెక్కారు.

"క్రితం సారి షార్ట్స్ వేసుకొని ఆడాలనుకున్నాం. కానీ వారు షార్ట్స్ కి బదులు స్పీడోస్ (బికినీ లాంటి డ్రెస్) వేసుకోమన్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని బెదిరించారు. దీంతో మేము షార్ట్స్‌కి బదులు బికినీలు వేసుకొని పోటీల్లో పాల్గొన్నాం. ఇప్పుడు వారు నియమాలను మార్చుతున్నారు " అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

2014లో స్పెయిన్ మహిళా బీచ్ హ్యాండ్‌బాల్ క్రీడాకారిణుల దుస్తులు వారిని నగ్నంగా చూపించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. పురుషులకు షార్ట్స్ వేసుకొని పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని, కానీ వారిని మాత్రం బికినీ వేసుకొని ఆడమంటున్నారని నిరసన వ్యక్తం చేశారు.

ఫుట్‌బాల్

బ్రిటన్‌లో ఫుట్‌బాల్ ఆటలో ప్రవేశం కోసం మహిళలు సాగించిన ఉద్యమానికి, మహిళల ఓటు హక్కు కోసం జరిగిన సఫ్రాగెట్టే ఉద్యమంతో సంబంధాలున్నాయని అంటారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకురాలు ఫ్లోరెన్స్ డిక్సీ బ్రిటిష్ లేడీస్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షురాలు. ఆమె ఫుట్ బాల్ ద్వారా, క్రీడా దుస్తుల ద్వారా మహిళల అణచివేతను అంతం చేయొచ్చని అనుకున్నారు.

Image copyright Getty Images

1921లో యూకే ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎఫ్ఏ అనుబంధ మైదానాలపై మహిళలు ఫుట్‌బాల్ ఆడటాన్ని నిషేధించింది. "ఫుట్‌బాల్ మహిళలకు అనువైన ఆట కాదని, ఫుట్‌బాల్ ఆడేందుకు మహిళలను ప్రోత్సహించకూడదు" అని యూకే ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది. చివరకు 1971లో ఈ నిషేధం ఎత్తివేశారు.

Image copyright Getty Images

2014లో ఫీఫా మతపరమైన కారణాలతో హిజాబ్ ధరించి ఫుట్ బాల్ ఆడేందుకు క్రీడాకారిణులను అనుమతించింది. గతంలో తలకు, మెడకు గాయం కావొచ్చని అంటూ వరల్డ్ ఫుట్‌బాల్ సంస్థ హిజాబ్ ధరించి ఫుట్ బాల్ ఆడటాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)