ఉత్తరకొరియా నుంచి అణు ముప్పు పెరుగుతోంది: అమెరికా

  • 28 అక్టోబర్ 2017
సరిహద్దుల్లో ఉత్తర కొరియా సైనికులు Image copyright AFP/Getty
చిత్రం శీర్షిక ఉత్తరకొరియా చట్టవిరుద్ధంగా అణ్వస్త్ర పరీక్షలు చేస్తోందని అమెరికా రక్షణ మంత్రి అన్నారు.

అణ్వాయుధాలను వాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఉత్తరకొరియాను హెచ్చరించారు.

అణుదాడులకు పాల్పడితే భారీ ఎత్తున సైనిక చర్యకు దిగుతామని అన్నారు.

వార్షిక రక్షణ చర్చల కోసం దక్షిణకొరియాకు వచ్చిన ఆయన ఆ దేశ రక్షణ మంత్రి సాంగ్ యంగ్ మూతో కలిసి మాట్లాడుతూ ఉత్తరకొరియా తీరుపై మండిపడ్డారు.

ఉత్తరకొరియా చట్టవిరుద్ధంగా క్షిపణి, అణ్వాయుధ పరీక్షలు చేస్తూ తన పొరుగు దేశాలను, ప్రపంచాన్ని భయపెడుతోందని మాటిస్ అన్నారు.

ఇలాంటి చర్యలను అమెరికా ఏమాత్రం సహించబోదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Image copyright AFP/Getty
చిత్రం శీర్షిక ట్రంప్ పర్యటనకు ముందుగా దక్షిణకొరియాకు వచ్చిన మాటిస్ ఉత్తరకొరియాను తీవ్రంగా హెచ్చరించారు.

కాగా నవంబరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించడానికి ముందుగా అమెరికా రక్షణ మంత్రి ఉత్తరకొరియాకు ఈ స్థాయిలో హెచ్చరికలు జారీచేయడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఉత్తరకొరియా గత నెలలో ఏకంగా ఆరు సార్లు అణ్వస్త్ర పరీక్షలు చేసింది. క్షిపణి పరీక్షలను కూడా వరుసగా జరుపుతున్న ఉత్తరకొరియా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జపాన్ మీదుగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామల నేపథ్యంలోనే దక్షిణ కొరియా తన క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరిస్తూ జాగ్రత్త పడుతోంది.

అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి అక్టోబరు ప్రారంభంలో విమానవాహక నౌకలు, డిస్ట్రోయర్లు, ఫైటర్ జెట్‌లతో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో భారీఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టాయి.

ఇది ఉత్తరకొరియాకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అమెరికా, దక్షిణ కొరియాలు తమపై యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయంటూ ఆ దేశం ఆరోపించింది కూడా.

ఈ ఉద్రిక్తతలు ఇలా కొనసాగుతుండగానే శుక్రవారం దక్షిణ కొరియాకు చెందిన పదిమంది జాలర్లను ఉత్తరకొరియా విడిచిపెట్టింది.

తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా బోటుతో ప్రవేశించారన్న కారణంతో కొద్దిరోజుల కిందట వారిని ఉత్తరకొరియా అదుపులోకి తీసుకుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు