పెళ్లితో డెమెన్షియా తగ్గుతుందట

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లి చేసుకోవడం.. మంచి స్నేహితులను కలిగి ఉండటం వల్ల మనకు మతిమరుపు, చిత్తవైకల్యం (డెమెన్షియా) సమస్యలు తగ్గుతాయట. లాబరో విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
వీరు 6677 మందిపై అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించారు. సామాజిక సంబంధాలు చాలా రుగ్మతలను నివారిస్తాయని తెలిపారు.
ద అల్జీమర్స్ సొసైటీ కూడా ఇటీవల అల్జీమర్స్ బాధితులు అర్థవంతమైన సామాజిక సంబంధాలను కలిగి ఉండాలని పేర్కొంది.
తాజాగా అధ్యయనం చేసినవారిలో మొదట ఎవరికీ డెమెన్షియా సమస్య లేదు. కానీ తర్వాత 220 మందికి ఈ సమస్య వచ్చింది.
వీరిని అధ్యయనం చేసిన పరిశోధకులు మతిమరుపు సమస్యకు పెళ్లి, స్నేహం, ఇతర సామాజిక అనుబంధాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
వీటితో డెమెన్షియా రిస్క్ పెరుగుతుంది
- చెవుడు - 9 శాతం
- టెన్త్ ఫెయిలవడం - 8 శాతం
- ధూమపానం - 5 శాతం
- కుంగుబాటుకు చికిత్స తీసుకోకపోవడం - 4 శాతం
- శారీరక శ్రమ లేకపోవడం - 3 శాతం
- ఒంటరితనం - 2 శాతం
- అధిక రక్తపోటు - 2 శాతం
- స్థూల కాయం - 2 శాతం
- మధుమేహం - 1 శాతం
పెళ్లయిన వారితో పోల్చితే ఒంటరిగా ఉన్నవారికి డెమెన్షియా ముప్పు రెట్టింపు ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.
అల్జీమర్స్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డగ్ బ్రౌన్ మాట్లాడుతూ.. పెళ్లయిన వారితో పోల్చితే పెళ్లికాని ప్రతి 100 మందిలో ఒకరు అదనంగా డెమెన్షియా బాధితులుంటారని తెలిపారు.
అయితే ఈ అధ్యయం డెమెన్షియాకు దారి తీసే అసలైన కారణాలను గుర్తించలేదు.
ఒంటరితనమే డెమెన్షియాకు మూలమని బ్రౌన్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)