హిట్లర్‌ ఆరాధనలో మునిగితేలిన హిందూ మహిళ

సావిత్రి దేవి

ఫొటో సోర్స్, Savitri Devi Archive

ఫొటో క్యాప్షన్,

సావిత్రి దేవి

ఐరోపా దేశమైన గ్రీస్‌‌‌లోని ఒక రాజకీయ పార్టీ వెబ్‌సైట్‌లో చీర కట్టుకున్న హిందూ మహిళ ఫొటో కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం. 2012లో 'గోల్డెన్ డాన్ పార్టీ' వెబ్‌సైట్‌లో నీలం రంగు చీరలో ఉన్న మహిళ ఫొటోను చూసినప్పుడు పాత్రికేయురాలు మారియా మార్గరోనిస్‌కూ అలాంటి అనుభవమే కలిగింది.

అంతేకాదు, ఆ చిత్రంలో సావిత్రి దేవి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను ఆరాధనగా చూస్తూ ఉండడం ఆమెను మరింత ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ నీలిరంగు చీరలోని మహిళ ఎవరు..? 'మారియా మార్గరోనిస్' అందిస్తున్న కథనం ఇది.

నియంత హిట్లర్‌ను ఆరాధించిన ఆ హిందూ మహిళ సావిత్రిదేవి. పాతికేళ్ల కిందట మరణించిన ఆమె ఫొటోలు, ఇతర విశేషాలు కొన్నాళ్లుగా ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి.

సావిత్రిదేవి అన్న పేరున్నప్పటికీ ఆమె భారతీయురాలు కాదు. ఫ్రెంచ్ వనిత. అసలు పేరు మ్యాక్స్‌మియానీ పోర్తాస్. భారతీయుడిని పెళ్లాడి హిందూమతం స్వీకరించి సావిత్రిదేవిగా పేరు మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, Savitri Devi Archive

ఫొటో క్యాప్షన్,

సావిత్రి దేవి హిట్లర్‌ను ఆరాధనగా చూస్తున్నట్లున్న ఈ చిత్రం గ్రీస్‌లోని రాజకీయ పార్టీ ‘గోల్డెన్ డాన్’ వెబ్‌సైట్‌లో ఉండేది.

తాను రాసిన 'ది లైట్నింగ్ అండ్ ది సన్' అనే పుస్తకంలో ఆమె హిట్లర్‌ను విష్ణుమూర్తి అవతారంగా అభివర్ణించారు. అంతేకాదు, ఆమె తన పుస్తకంలో జాతీయవాద సామ్యవాదం మళ్లీ ఉద్భవిస్తుందని బలంగా చెప్పుకొచ్చారు.

ఇక 'గోల్డెన్ డాన్' విషయానికొస్తే దానికి గ్రీస్‌లో జాత్యాహంకార పార్టీ అన్న ముద్ర ఉంది. మరి అలాంటి పార్టీ వెబ్‌సైట్లో ఈ హిందూ మహిళ చిత్రం ఎందుకు ఉంది? ఐరోపాలోని కొన్ని దేశాలు, అమెరికాలో కొద్దికాలంగా మితవాద (రైట్ వింగ్) శక్తులు బలం పెంచుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే సావిత్రిదేవి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన రైట్ వింగ్ నేతలు రిచర్డ్ స్పెన్సర్, స్టీవ్ బానన్‌లు తిరిగి ఆమె రచనలను ప్రాచుర్యంలోకి తెస్తున్నారు.

సమానత్వ భావనలకు దూరంగా..

సావిత్రి దేవి అన్న పేరు, భారతీయ వస్త్రధారణ లేకుంటే ఆమె అచ్చమైన ఐరోపా వనితే. 1905లో ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఆమె జన్మించారు.

తల్లి బ్రిటిష్ దేశస్థురాలు, తండ్రి గ్రీక్ ఇటాలియన్. సావిత్రిదేవి తొలినాళ్ల నుంచి సమానత్వ ఆలోచనలకు దూరంగా ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1923లో సావిత్రిదేవి కుటుంబం గ్రీస్‌లోని ఏథెన్స్‌కు వచ్చింది.

జర్మనీ, గ్రీస్‌లను అణగదొక్కుతున్నారని ఆమె బలంగా నమ్మేవారు. ఆర్యులే గొప్పవారన్న భావనతో ఉండేవారు.

యూదులకు వ్యతిరేకంగా హిట్లర్ తీరును ఆమె బలపర్చేవారు. హిట్లర్‌ను ఆమె తనకు మార్గదర్శిగా, నడిపించే నాయకుడిగా నమ్మేవారు.

భారత్‌కు ఎందుకు వచ్చారు?

భారత్‌లో బలమైన కుల వ్యవస్థ కారణంగా కులాంతర వివాహాలు లేవని, అందువల్ల ఇక్కడ స్వచ్ఛమైన ఆర్యులు ఉండొచ్చన్న ఆలోచనతో పరిశోధన కోసం 1930లో ఆమె భారత్‌కు వచ్చారు.

భారత్‌కు వచ్చాక విస్తృతంగా తిరుగుతూ పలు భారతీయ భాషలనూ నేర్చుకున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన అసిత్ ముఖర్జీని పెళ్లాడారు. హిందూ పురాణాలను, ఫాసిజాన్ని మేళవిస్తూ ఆమె తన అభిప్రాయాలు వ్యక్తంచేసేవారు.

కలియుగం అంతమయ్యాక ఆర్యుల ఆధిపత్యం ఉన్న స్వర్ణయుగం ప్రారంభమవుతుందని నమ్మేవారు. కోల్‌కతా కేంద్రంగా హిందూ జాతీయవాదాన్నీ ప్రచారం చేశారు. భారత్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసే పాశ్చాత్య ప్రయత్నాల కారణంగా సావిత్రిదేవి హిందూత్వ ప్రచారానికి కొంత మద్దతు లభించింది.

హిందువులు అసలుసిసలైన ఆర్యులని ఆమె బలంగా నమ్మేవారు.

ఐరోపాకు తిరుగు ప్రయాణం

1945లో జర్మనీలో నాజీయిజం కుప్పకూలాక సావిత్రిదేవి మళ్లీ ఐరోపా వెళ్లిపోయారు. ఇంగ్లండ్‌లో కొన్నాళ్లున్నారు. హిట్లర్‌లాగే ఆమె కూడా పూర్తి శాకాహారి.

ఐస్‌లాండ్‌లో ఆమె ఉన్నప్పుడు అక్కడ బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతానికి అత్యంత సమీపంలో రెండు రాత్రులు గడిపారు.

ఆ తరువాత తన రచనల్లో ఆ అనుభవాన్ని ప్రస్తావిస్తూ ''సృష్టి యొక్క అసలైన శబ్దం ఓం. ప్రతి రెండు, మూడు సెకన్లకు ఆ అగ్నిపర్వత పాదాల నుంచి ఓం.. ఓం.. ఓం.. అన్న శబ్దం నిరంతరంగా వినిపించింది'' అని రాశారు.

అనంతరం 1948లో ఆమె జర్మనీకి చేరుకుని నాజీ భావజాల వ్యాప్తికి యత్నించారు. కొంతకాలం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను జైలులో పెట్టింది.

అయితే, భారత ప్రభుత్వ సహాయంతో ఆమె భర్త శిక్షాకాలం తగ్గేలా చేయగలిగారు.

ఫొటో సోర్స్, Savitri Devi Archive

ఫొటో క్యాప్షన్,

సావిత్రి దేవి

మళ్లీ భారత్‌కు

సావిత్రిదేవిని ప్రస్తుతం భారతదేశం మర్చిపోయింది. కానీ హిందూ జాతీయవాదానికి ఆమె చేసిన దోహదం ఏమిటో ఆమె మేనల్లుడు, పాత్రికేయుడు సుమంతా బెనర్జీ గుర్తుచేసుకున్నారు.

1939లో సావిత్రిదేవి 'ఏ వార్నింగ్ టు ది హిందూస్' అనే పుస్తకం రాశారు. ఇందులో హిందువులకు ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ఆయన చెప్పారు. ముస్లింల నుంచి హిందువులకు పెద్ద ప్రమాదం ఉందనీ, దీన్ని సంఘటితంగా ప్రతిఘటించాలని ఆనాడే ఆమె అభిప్రాయపడ్డారనీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అదే దిశలో ఉన్నాయనీ సుమంతా అన్నారు.

హిందుత్వమే భారతీయ జనతా పార్టీ భావజాలం. ముస్లింలు, లౌకికవాదులు దేశాన్ని తక్కువ చేసి చూపారని బీజేపీ తరచూ చెప్తూ ఉంటుంది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ సందర్భంగా జరిగిన హింసను బీజేపీ నాయకులు ఖండించినప్పటికీ గోరక్షక దళాల పేరుతో ముస్లింలపై జరుగుతున్న దాడులు, తమ విధానాలను వ్యతిరేకించిన వారిపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు దానికి భిన్నమైన చిత్రాన్ని కళ్లకు గడతాయని సుమంతా అంటారు.

సావిత్రి మరణించడానికి కొన్నేళ్ల ముందు తిరిగి భారత్ చేరుకున్నారు. భర్తతో కలిసి దిల్లీలో నివసించారు.

హిందూ వివాహిత మహిళల లాగే ఆమె బంగారు ఆభరణాలు ధరించేవారు. తన ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లులకు ఆహారం అందిస్తూ వాటితో గడపడంలో ఆనందం పొందేవారు. 1982లో ఇంగ్లండ్‌లో తన స్నేహితురాలి ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)