సౌదీ మహిళలకు మరింత స్వేచ్ఛ.. ఇకపై క్రీడా మైదానాలకూ వెళ్లొచ్చు!

  • 30 అక్టోబర్ 2017
సౌదీ మహిళలు Image copyright AFP
చిత్రం శీర్షిక మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడంపై సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మహిళలకు సౌదీ అరేబియా మరింత స్వేచ్ఛ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి స్టేడియాల్లో జరిగే క్రీడా పోటీలను మహిళలు వీక్షించొచ్చు. అమ్మాయిలు స్టేడియాలకు వెళ్లేందుకు అనుమతించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

రియాద్, జెడ్డా, డామన్ నగరాల్లోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియాలకు వెళ్లొచ్చు. ఇటీవలే మహిళల డ్రైవింగ్‌పై అక్కడ నిషేధం ఎత్తివేశారు. ఇప్పుడు సౌదీ మహిళలకు మరింత స్వేచ్ఛ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సౌదీ సమాజాన్ని మార్చాలని, ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించాలని యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ చర్యలు తీసుకుంటున్నారు.

మా ఇతర కథనాలు:

మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చునేందుకు వీలుగా 3 స్టేడియాల్లో త్వరలోనే మార్పు-చేర్పులు చేస్తామని సౌదీ క్రీడాధికారులు చెబుతున్నారు. 2018 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.

స్టేడియాల్లో కొత్తగా రెస్టారెంట్లు, కేఫ్‌లు, స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే మగవాళ్లకు మాత్రమే స్టేడియాల్లోకి ప్రవేశం ఉంది.

చమురుపై ఆధారపడిన సౌదీ అరేబియాలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకొచ్చేందుకు 32 ఏళ్ల యువరాజు మొహమ్మద్ ఎన్నో సంస్కరణలు ప్రకటించారు. దీన్ని విజన్ 2030గా కూడా పిలుస్తున్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక సౌదీ అరేబియాలో మహిళలపై ఇప్పటికీ ఎన్నో ఆంక్షలు ఉన్నాయి

సౌదీ మహిళలు కారు నడపొచ్చని గత నెల్లోనే ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జూన్ నుంచి మహిళలు స్టీరింగ్ పట్టుకోవచ్చు. మహిళల కోసం కచేరీలు, సినిమాలు మళ్లీ ప్రదర్శించే అవకాశాలూ ఉన్నట్లు తెలుస్తోంది.

దేశాన్ని మార్చాలంటే ముందు ఇస్లాం సంప్రదాయాలను మార్చాలని యువరాజు మొహమ్మద్ అంటున్నారు. సౌదీ జనాభాలో 70శాతం మంది 30ఏళ్ల లోపు వాళ్లే. వాళ్లందరూ తమ జీవితాన్ని ఆనందంగా, మత సహనంతో గడపాలని భావిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

అయితే, విజన్ 2030అమలుతో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సౌదీ అరేబియా నిర్ణయాన్ని సాంప్రదాయవాదులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. గత నెలలో రియాద్‌ జాతీయ దినోత్సవాల్లో మహిళలు పాల్గొనేందుకు అనుమతించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.

అయితే, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సౌదీలో మహిళలపై తీవ్రమైన ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి.

సున్నీ సంప్రదాయం ప్రకారం మహిళలు కచ్చితంగా బురఖా ధరించాలి. పరాయి వ్యక్తిని కలవకూడదు. మహిళలు ఎక్కడికైనా వెళ్లాలంటే మగవాళ్ల నుంచి లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చివరికి ఉద్యోగానికి వెళ్లాలన్నా, ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇంటిపెద్ద పర్మిషన్ ఉండాలి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు