ఉత్కంఠ భరితంగా రష్యా-ట్రంప్ రాజకీయ డ్రామా

డొనాల్డ్ ట్రంప్ - పుతిన్
ఫొటో క్యాప్షన్,

డొనాల్డ్ ట్రంప్ - వ్లాదిమిర్ పుతిన్ డ్రామాకు ముగింపు ఎప్పుడు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం మీద దర్యాప్తులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. ట్రంప్ ప్రచార బృందం రష్యా ప్రభుత్వంతో కుమ్మక్కయిందా అనే అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవి అమెరికాలో ప్రసారమయ్యే ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ రాజకీయ డ్రామాకు దీటుగా ఉన్నాయి.

రష్యా ప్రభుత్వానికి - ట్రంప్ బృందానికి మధ్య ఆరోపిత సంబంధాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తుల మీద అభియోగాలు మోపారు.

అతి ముఖ్యమైన ఈ రాజకీయ డ్రామాలో మూడు అంకాల్లోని ముఖ్య పాత్రలు ఏవి, ఎవరు అనే వివవరాలివీ...

మొదటి అంకం - ఎన్నికలు

రియాలిటీ టీవీ స్టార్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ప్రచారం ప్రారంభించడం ద్వారా తన సొంత రాజకీయ డ్రామాలో కీలక పాత్రగా మారిన మొదటి అంకమిది. ఆయనకు ఆయన కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. ఆయన పట్ల రష్యన్లు ఆసక్తి చూపారు. బయటి వ్యక్తి అయిన ట్రంప్ అసలు గెలవగలరా? అనే నరాలు తెగే ఉత్కంఠతో ఈ మొదటి అంకం ముగుస్తుంది.

ఇదంతా జరిగి కొంత కాలం గడచిపోయింది. ఈ అంకంలోని ముఖ్య పాత్రలను గుర్తు చేసుకుందాం.

ఫొటో క్యాప్షన్,

డానాల్డ్ ట్రంప్ - ద బాస్

ఈయన ఎవరు?: డొనాల్డ్ ట్రంప్ బిలియనీర్ అభ్యర్థి. (ఈ డ్రామా మూడో అంకంలో అమెరికా 45వ అధ్యక్షుడయ్యారు.)

ప్రధాన కథాంశం: ట్రంప్ ఓట్ల కోసం ప్రచారం చేస్తూ దేశంలో పర్యటిస్తూ ఉంటే.. ఆయన ప్రత్యర్థులైన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల ఈమెయిళ్లను రష్యా హ్యాక్ చేసిందని అమెరికా నిఘా అధికారులు చెప్తున్నారు.

ఎందుకు? ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని అప్పుడు రష్యా ప్రయత్నిస్తోందా? దాని గురించి ట్రంప్‌కు, ఆయన ప్రచార బృందానికి ఏం తెలుసు?

రష్యా జోక్యంపై ఇప్పుడు కొనసాగుతున్న పరిశోధనలో ఏవైనా అంశాలు బయటపడకుండా దాచేసేందుకు ట్రంప్ ఏమైనా ప్రయత్నించారా? అలా చేస్తే ఆ అంశాలు ఏమిటి?

ఫొటో క్యాప్షన్,

పాల్ మానాఫోర్ట్ - నిర్వాహకుడు

ఈయన ఎవరు?: ట్రంప్ ప్రచార బృందానికి చైర్మన్‌గా పనిచేశారు. కానీ రష్యా రాజకీయ ప్రముఖులు, ఉక్రెయిన్‌తో ఆయనకు గల సంబంధాల వల్ల ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రధాన కథాంశం: పాల్ మానాఫోర్ట్ దశాబ్ద కాలానికి పైగా ఉక్రెయిన్‌లో రాజకీయ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో.. ట్రంప్ ప్రచార బృందం చైర్మన్ పదవికి 2016 ఆగస్టులో పాల్ రాజీనామా చేశారు.

నాడు ట్రంప్ బృందానికి రహస్య సమాచారం అందించేందుకు ప్రయత్నించారని భావిస్తున్న ఒక రష్యా లాయర్‌తో కలిసి కీలక సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన మీద 2016 అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేని 12 అభియోగాలు నమోదవగా వాటిలో తాను దోషిని కాదని కోర్టులో పేర్కొన్నారు. ఆ అభియోగాల్లో మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది.

ఈ నాటకం మూడో అంకంలో.. ఎఫ్‌బీఐ తన దర్యాప్తులో భాగంగా ఈయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుంది.

ఫొటో క్యాప్షన్,

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ - బాస్ కుమారుడు

ఈయన ఎవరు?: అధ్యక్షుడు ట్రంప్ కొడుకు. ఈయన రష్యా పెద్దలను నిజంగా కలిశారు. కానీ ఎందుకు? అనేదే పెద్ద ప్రశ్న.

ప్రధాన కథాంశం: ఈ నాటకం కొనసాగే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పాత్ర ఒక రష్యా లాయర్‌తో సమావేశమవుతుంది. ఈ సమావేశాన్ని ఒక పాప్ స్టార్ ఏర్పాటు చేశారు.

హిల్లరీ క్లింటన్ మీద ఆరోపణలకు సంబంధించిన వివరాలు లభిస్తాయన్న హామీతో.. నటాలియా వెసెల్నిట్స్కయా అనే లాయర్‌తో ట్రంప్ జూనియర్ భేటీని ఏర్పాటు చేశారు సంగీత వ్యాపారి రాబ్ గోల్డ్‌స్టోన్. ‘‘ఇది నిజంగా చాలా ఉన్నత స్థాయి, కీలక సమాచారం. కానీ ట్రంప్‌కు రష్యా, ఆ దేశ ప్రభుత్వం అందిస్తున్న మద్దతులో భాగం’’ అని గోల్డ్‌స్టోన్ రాశారు. ‘‘ఐ లవ్ ఇట్’’ (ఇది చాలా బాగుంది) అని బదులిచ్చిన ట్రంప్ జూనియర్.. వారిద్దరినీ ట్రంప్ టవర్‌కి ఆహ్వానించారు. అక్కడికొచ్చిన వారిద్దరూ ట్రంప్ సిబ్బంది జారెడ్ కుష్నర్, పాల్ మానాఫోర్ట్‌లను కూడా కలిశారు.

ఈ నాటక ఇతివృత్తంలో ఈ భేటీ చాలా కీలకమైనది. ఎందుకంటే దీనిమీద చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భేటీ అర్థం.. ట్రంప్ ప్రచార బృందం ఒక విదేశీ ప్రభుత్వంతో కుమ్మక్కయినట్లా? ఆయన ఈ సమావేశానికి ఎందుకు అంగీకరించారు? రష్యా దత్తత విధానం విషయమై ఆ భేటీ జరిగిందని ట్రంప్ జూనియర్ చెప్తున్నారు. తాను రష్యా ప్రభుత్వ ఏజెంటును కానని వెసెల్నిట్స్కయా అంటున్నారు. కానీ ఆ భేటీలో ఏదైనా జరగరానిది జరిగిందా అనేది తెలుసుకోవాలని దర్యాప్తు అధికారులు ఈ సీన్‌ని పదే పదే పరీక్షిస్తున్నారు.

రెండో అంకం - అధికార మార్పిడి

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం ద్వారా తన విమర్శకుల్లో గుబులు రేకెత్తించారు. అయితే ఈ అధికార మార్పడి కూడా మొదటి అంకం స్థాయిలోనే చాలా ఉత్కంఠగా సాగింది. ట్రంప్ మరికొన్ని కీలక పాత్రలను ప్రవేశపెడుతూ తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. జనవరిలో ఒక చలికాలపు ఉదయాన ట్రంప్ ప్రమాణంతో ఈ అంకం ముగుస్తుంది. కానీ అందులో చాలా మలుపులున్నాయి.

ఫొటో క్యాప్షన్,

మైఖేల్ ఫ్లిన్ - సేనాని

ఈయన ఎవరు? మాజీ సైనికాధికారి. డొనాల్డ్ ట్రంప్‌ మంత్రివర్గంలో అతి తక్కువ కాలం పనిచేసిన సభ్యుడు. ఒక రష్యా అధికారితో తన మంతనాల గురించి నిజాయితీగా వ్యవహరించనందున ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనకు ఏం తెలుసు? అది ఎవరికి చెప్పాడు?

ప్రధాన కథాంశం: ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల తర్వాతే మైఖేల్ ఫ్లిన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనను తీసుకోవద్దని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన సలహానూ ట్రంప్ పక్కన పెట్టారు. 2016 డిసెంబర్‌లో ఫ్లిన్ రష్యా రాయబారి సెర్గీ కిస్లియాక్‌తో మాట్లాడినపుడు.. ఈ డ్రామాలో ఆయన పాత్ర కీలకంగా మారింది.

రష్యా ఆంక్షల గురించి వీరు మంతనాలు జరిపారని, ఆ తర్వాత ఈ చర్చల విషయమై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు అబద్ధం చెప్పారని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు పేర్కొన్నాయి. తాము ‘చిన్న విషయాలు’ మాట్లాడుకున్నామని కిస్లియాక్ చెప్పారు.

ఇప్పుడు ఫ్లిన్ పాత్ర మీద ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. ఇక్కడే అధ్యక్షుడి పాత్ర రంగంలోకి వస్తుంది. ఈ దర్యాప్తు నుంచి వెనక్కు తగ్గాలని ట్రంప్ ప్రయత్నించారా అనే అంశం మీద కూడా ఎఫ్‌బీఐ దృష్టి సారించింది.

ఫొటో క్యాప్షన్,

సెర్గీ కిస్లియాక్ - రాయబారి

ఈయన ఎవరు?: ఈ నాటకంలో చాలా దారులు సెర్గీ కస్లియాక్ దగ్గరకే వెళుతున్నాయి. ఆయన 2017 జూలై వరకూ అమెరికాలో రష్యా రాయబారిగా ఉన్నారు.

ప్రధాన కథాంశం: ఈ డ్రామాలో కిస్లియాక్ పాత్ర ఏమిటనేది అస్పష్టం. కానీ ఆయన పాత్ర చాలాసార్లు తెరమీద కనిపిస్తుంది. ఎందుకంటే నాటకంలోని చాలా పాత్రలు ఆయనతో సమావేశమయ్యాయి. వారందరూ ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు? ఏం మాట్లాడారు? అనేది దర్యాప్తు సంస్థ ముందున్న కీలక ప్రశ్నలు. మైఖేల్ ఫ్లిన్‌తోనూ, జెఫ్ సెషన్స్‌తోనూ ఈ రష్యా రాయబారి భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలు జరగలేదని ట్రంప్ అధికారులు తొలుత నిరాకరించారు.

ఇంకా ఏమైనా తెలుసుకోవాలా? కిస్లియాక్ ఒక ఉన్నతస్థాయి గూఢచారి అని, గూఢచారులను నియమించుకునే వారని వచ్చిన ఆరోపణలను రష్యా ప్రభుత్వం సీఎన్‌ఎన్ టీవీ చానల్‌లో తీవ్రంగా ఖండించింది.

ఫొటో క్యాప్షన్,

జెఫ్ సెషన్స్ - అమెరికా టాప్ లాయర్

ఈయన ఎవరు?: ఈ డ్రామా తొలి అంకంలో జెఫర్సన్ బ్యూరెగార్డ్ సెషన్స్ - 3 తెరవెనుకే కదలాడారు. అప్పుడు ఆయన అలబామా సెనేటర్. ట్రంప్‌కు విశ్వసనీయమైన సలహాదారు. రెండో అంకంలో ట్రంప్ ఈయనను అటార్నీ జనరల్ పదవికి నామినేట్ చేసినపుడు సెషన్స్ గురించి తెలిసివచ్చింది.

ప్రధాన కథాంశం: రష్యా రాయబారి సెర్గీ కిస్లియాక్‌ను కలిసిన చాలా మంది ట్రంప్ బృంద సభ్యుల్లో సెషన్స్ ఒకరు. ఆ సమావేశాల స్వభావం మీద సందేహాలున్నాయి.

ట్రంప్ ఎన్నికల ప్రచారం మీద ఎఫ్‌బీఐ దృష్టి కేంద్రీకరించినందున ఈ దర్యాప్తు నుంచి జెఫ్ సెషన్స్ వైదొలగారు. ఈ నిర్ణయం చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. సెషన్స్ మీద ట్రంప్ ట్విటర్‌లోవరుసపెట్టి విమర్శలు సంధించారు.

ఇక సెషన్స్ అయితే తాను రష్యాతో కుమ్మక్యయ్యానన్న మాట ‘‘ఘోరమైన, గర్హనీయమైన అబద్ధం’’ అని అభివర్ణించారు.

మూడో అంకం - అధ్యక్ష పదవి

ఈ ఉత్కంఠభరిత నాటకంలో వేగం పెరిగి ప్రధాన కథాంశాలన్నీ కలుసుకుంది ఇక్కడే. తొలి అంకంలో మనం చూసిన తెరవెనుక పాత్రలు పగతో రగిలిపోతూ మూడో అంకంలో తెరపైకి వచ్చాయి. అంతర్గత కుమ్ములాటలు ముదిరిపాకాన పడ్డాయి. ఇప్పుడు పోలీసులు చుట్టుముడుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

నటాలియా వెసెల్నిట్స్కయా - మధ్యవర్తి

ఈమె ఎవరు?: రష్యా మీద అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడిన రష్యా న్యాయవాది. భీకరమైన ప్రతిష్ఠ ఉంది. నాటకీయత ఆమె సహజ స్వభావం. మరి ఆమె రష్యా ఏజెంటా? కాదని ఆమె అంటారు.

ప్రధాన కథాంశం: ఈమె పాత్ర చిన్నదే అయినా చాలా కీలకమైనది. ట్రంప్ జూనియర్, కుష్నర్, మానాఫోర్ట్‌లు 2016 జూన్‌లో కలిసింది ఈమెనే. ఆ భేటీ వివరాలు ఏడాది తర్వాత, ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక బహిర్గతమయ్యాయి. పిల్లల దత్తత విషయమై ఆ సమావేశం జరిగిందని ఈమె చెప్తారు. కానీ ఆ సమావేశం జరిగేలా సాయం చేసిన వారు మాత్రం.. డెమొక్రటిక్ పార్టీ, ఆ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ మీద కీలకమైన ఆరోపణలను అందిస్తానని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అగలారావోలు లేకుండా ఆ సమావేశం జరిగి ఉండేది కాదు.

ఫొటో క్యాప్షన్,

అగలారావోలు - పాప్ స్టార్.. ఆయన తండ్రి

వీరు ఎవరు?: అజర్‌బైజాన్‌లో పెద్ద పాప్ స్టార్ ఎమిన్ అగలారోవ్. ‘లవ్ ఈజ్ ఎ డెడ్లీ గేమ్‘ అనే పాట వినలేదా? డొనాల్డ్ ట్రంప్ నిర్వహించే ‘మిస్ యూనివర్స్’ అందాల పోటీలను రష్యాకు తుసుకెళ్లడానికి ఎమిన్ సాయం చేశారు. ట్రంప్, ఎమిలిన్‌ల మధ్య జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకునే స్థాయిలో సాన్నిహిత్యముంది. ఎమిన్ తండ్రి అరస్ అగలారోవ్ ఒక బిలియనీర్. మాస్కోలో ఉన్నతస్థాయి అధికార కేంద్రాల్లో ఆయనకు చాలా పలుకుబడి ఉంది.

ప్రధాన కథాంశం: తొలి అంకంలో ట్రంప్ జూనియర్ సమావేశం జరగడానికి చోదకశక్తిగా పనిచేసింది ఎమిన్. డెమొక్రాట్లకు సంబంధించి కీలక సమాచారాన్ని ఎమిన్ ఇవ్వజూపుతున్నట్లు ట్రంప్ జూనియర్‌కు పంపిన ఒక ఈమెయిల్ సూచిస్తోంది. కానీ తాను అలాంటిదేమీ ప్రతిపాదించలేదని ఎమిన్ నిరాకరిస్తున్నారు. రష్యాలో ‘అగ్రస్థాయి ప్రాసిక్యూటర్’ను అరస్ అగలారోవ్ కలిసినట్లుగా, హిల్లరీ క్లింటన్ మీద సమాచారం సంపాదించినట్లుగా కూడా ఆ ఈమెయిల్ చెప్తుంది.

ఫొటో క్యాప్షన్,

సాలీ యేట్స్ - ధిక్కార స్వరం

ఈమె ఎవరు?: నాటకంలో సహాయ పాత్రల్లో ఒకరు. మూడో అంకంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చి భారీ పాత్ర పోషించారు. జెఫ్ సెషన్స్‌ను నియమించేవరకూ అమెరికా అటార్నీ జనరల్‌గా ఆమె వ్యవహరించారు. ఆయన నియామకం తర్వాత సాలీని పదవి నుంచి తొలగించారు...

ప్రధాన కథాంశం: రష్యా ప్రముఖులతో భేటీ విషయమై మైఖేల్ ఫ్లిన్ నిజం చెప్పడం లేదని శ్వేత సౌధానికి సమాచారం ఇచ్చింది ఈమే. ఈ భేటీ గురించి రష్యా వారికి తెలుసు కానీ.. అమెరికా అధ్యక్ష భవనానికి తెలియదని.. దీనివల్ల ఫ్లిన్‌కు బ్లాక్‌మెయిల్‌ ముప్పు ఉంటుందని ఆమె వాదించారు. అందుకు ఆమెకు లభించిన బహుమతి? కొన్ని వారాల తర్వాత ఈ విషయానికి సంబంధం లేని ఒక సాకుతో ఆమెను పదవి నుంచి తొలగించారు డొనాల్డ్ ట్రంప్. అప్పటి నుంచీ అధ్యక్షుడిపై ఆమె తరచుగా విమర్శలు సంధిస్తూనే ఉన్నారు.

ఫొటో క్యాప్షన్,

రాడ్ రోసెన్‌స్టీన్ - డిప్యూటీ అటార్నీ జనరల్

ఈయన ఎవరు?: జెఫ్ సెషన్స్ కింద డిప్యూటీ అటార్నీ జనరల్ అయ్యారు. ఈ రష్యా కుంభకోణం టీవీ డ్రామాలో ఒక నిఖార్సయిన బ్రాడ్‌వే నటుడికి ఈ పాత్ర లభిస్తుంది. ఈ పాత్రను మనం గుర్తించగలం కానీ పేరు పెట్టలేం.

ప్రధాన కథాంశం: ట్రంప్ - రష్యా సంబంధాల మీద దర్యాప్తు నుంచి సెషన్స్ తప్పుకున్న నేపథ్యంలో ఆ పని చేయాల్సిన బాధ్యత రోసెన్‌స్టీన్ మీద పడింది. కథలో కీలక పరిణామం ఏమిటంటే ఆయన ఒక ప్రత్యేక పరిశోధనాధికారిని నియమించారు. అది అధ్యక్ష భవనానికి అంతగా రుచించలేదు. ఎఫ్‌బీఐ చీఫ్ కోమీని తొలగించాలని ఒక లేఖలో సిఫారసు చేసింది కూడా ఈయనే. ఆ సలహా అధ్యక్షుడికి బాగా నచ్చినట్లు రుజువయింది.

ఫొటో క్యాప్షన్,

జారెడ్ కుష్నర్ - అధ్యక్షుడి అల్లుడు

ఈయన ఎవరు?: ట్రంప్ కుమార్తె ఇవాంకా భర్త. కుష్నర్ పాత్ర తెర మీద కనిపించడం కన్నా వినిపించడం తక్కువ.

ప్రధాన కథాంశం: బంధుప్రీతి ఆరోపణల మధ్య అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా విస్తృత అధికారాలతో ఈయనకు పదవి కట్టబెట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆ తర్వాత రష్యన్లతో ఈయనకు గల సంబంధాల వల్ల దర్యాప్తు అధికారులు కుష్నర్ మీద దృష్టి సారించారు. 2016 జూన్‌లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, రష్యా న్యాయవాది భేటీకి ఈయన కూడా హాజరయ్యారు. ఆ సమావేశం తనకు చాలా బోర్ కొట్టిందని.. అక్కడి నుంచి లేచిరావడానికి తనకు ఫోన్ చేయాలంటూ తన అసిస్టెంట్‌కి మెసేజ్ పంపానని కుష్నర్ చెప్తారు.

అలాగే రష్యా రాయబారి సెర్గీ కిస్లియాక్‌తో సంబంధమున్న మరొక పాత్ర కుష్నర్. ఆయనతో ఈయన పలుమార్లు ఫోన్‌లో కూడా మాట్లాడినట్లు చెప్తారు. అలాగే 2016 డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో రష్యా ప్రభుత్వంతో రహస్య సంబంధాలు నెలకొల్పే అంశం మీద ఈయన చర్చించినట్లు కూడా ఆరోపణలున్నాయి. వీటిని కుష్నర్ నిరాకరిస్తున్నారు. కానీ ఈ సమావేశాల గురించి ముందుగా బహిర్గతం చేయడంలో ఎందుకు విఫలమయ్యారనేది తెలుసుకోవాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

జే సెకులోవ్ - అధ్యక్షుడి న్యాయవాది

ఈయన ఎవరు?: ‘‘మీ ప్రశ్నలన్నిటినీ ట్రంప్ గారి న్యాయవాదికి పంపిస్తాం’’ అని అధ్యక్ష భవనం చెప్పిందంటే.. వారు చెప్తున్నది ఈయన గురించే.

ప్రధాన కథాంశం: వాషింగ్టన్ డీసీ నగరం నిండా న్యాయవాదులున్నారు. వారిలో.. అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది జే సెకులోవ్ అంతటి ముఖ్యమైన వారు ఎవరూ లేరు. చాలా రాజకీయ న్యాయవాదుల తరహాలోనే ఆయన కూడా ఎక్కువగా మాటల ప్రదర్శనలోనే ఉంటారు. అయితే ప్రస్తుత దర్యాప్తులో బయటపడుతున్న అంశాల మీద ఎప్పటికప్పుడు అధ్యక్ష భవనాన్ని సమర్థిస్తూ ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు.

ఫొటో క్యాప్షన్,

రాబ్ గోల్డ్‌స్టోన్

ఈయన ఎవరు?: బ్రిటిష్ మాజీ టాబ్లాయిడ్ జర్నలిస్ట్. రకరకాల టోపీలు పెట్టుకుని సెల్ఫీలు దిగడం ఇష్టం. ఈ నాటకంలో పాత్రధారుల్లో అసంబద్ధంగా కనిపించొచ్చు. కానీ మంచి నాటకాలు చాలా వాటిలో కొంత వింతైన పాత్రలకు ఎప్పుడూ చోటు ఉంటుంది.

ప్రధాన కథాంశం: డొనాల్డ్ ట్రంప్‌కు విశ్వసనీయమైన బృందంలో రాబ్ గోల్డ్‌స్టోన్ చోటు సంపాదించుకోగలిగారు. ఇందుకు.. రష్యా పాప్ స్టార్ ఎమిన్ అగలారోవ్‌తో తనకున్న సంబంధాలు సాయపడ్డాయి.

పాప్ స్టార్ ఎమిన్‌కు గోల్డ్‌స్టోన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ టవర్‌లో 2016 జూన్‌లో జరిగిన ఆ వివాదాస్పద సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఎమిన్ తరఫున ట్రంప్ జూనియర్‌ను సంప్రదించింది ఈయనే. హిల్లరీ క్లింటన్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే సమాచారం ఇస్తామన్న హామీతో ట్రంప్ జూనియర్‌కు ఈమెయిల్ పంపించింది గోల్డ్‌స్టోనే. ఆ ఈమెయిల్ సంప్రదింపులు ఈ దర్యాప్తులో ఒక కీలక సాక్ష్యం.

అలాగే.. మిస్ యూనివర్స్ పోటీలను రష్యాకు తీసుకెళ్లడంలోనూ ఆయన కృషి చేశారు. ఆ విధంగా ఆయన ఒకసారి స్వయంగా డొనాల్డ్ ట్రంప్‌ను కూడా కలిశారు.

ఫొటో క్యాప్షన్,

జేమ్స్ కోమీ - ఎఫ్‌బీఐ బాస్

ఈయన ఎవరు?: ఆరడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తుండే జేమ్స్ కోమీ.. ఈ కథలో భారీ పాత్ర పోషిస్తున్నారు.

ప్రధాన కథాంశం: నాటకం తొలి అంకంలో తాను ఎఫ్‌బీఐ అధిపతిగా ఉండగా.. ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు.. హిల్లరీ క్లింటన్ ఈమెయిళ్లపై దర్యాప్తును పున:ప్రారంభించడం ద్వారా కోమీ ఈ డ్రామాలో ప్రవేశించారు. ఆమె ఓటమికి ఈయనే కారణమని డెమొక్రాట్లు నిందిస్తే.. ఈయన హీరో అని రిపబ్లికన్లు కీర్తించారు. ఇక అక్కడితో ఆయన పాత్ర ముగిసిందని మనం అనుకున్నాం.

కానీ మూడో అంకం మొదలయ్యాక.. ట్రంప్ అధ్యక్షుడైన మూడు నెలల తర్వాత.. కోమీని పదవి నుంచి తొలగించారు కొత్త అధ్యక్షుడు. అచ్చంగా నిజమైన టెలివిజన్ డ్రామా తరహాలోనే ఆయన లాస్ ఏంజెలెస్ పర్యటనలో టీవీ న్యూస్ చూస్తూ తనను పదవి నుంచి తొలగించిన విషయం తెలుసుకున్నారు. ఉద్వాసనకు గురయ్యే సమయానికి.. ట్రంప్ ప్రచార బృందానికి - రష్యాకు మధ్య ఏవైనా సంబంధాలున్నాయా అనే అంశం మీద దర్యాప్తు చేపట్టడానికి కోమీ సంసిద్ధమవుతున్నారు. అందుకే ఆయనను గెంటేశారా?

ఈ డ్రామాలో ఇప్పటివరకూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన సన్నివేశాల్లో.. సెనేట్‌లో ఆయన చెప్పిన సాక్ష్యం ఒకటి. అధ్యక్షుడికి విధేయంగా ఉండాలని తనకు చెప్పారని.. అందుకు తాను నిరాకరించానని ఆయన ప్రమాణం చేసి చెప్పారు. మైఖేల్ ఫ్లిన్ విషయంలో దర్యాప్తును వదిలివేయాలని ట్రంప్ తనకు చెప్పారని కూడా ఆయన తెలిపారు. ఈయన పోషించాల్సిన పాత్ర ఇంకా చాలా ఉంది. కానీ మళ్లీ తెరమీదకి ఎప్పుడు ప్రవేశిస్తారన్నది ఇంకా తెలీదు.

ఫొటో క్యాప్షన్,

రాబర్ట్ ముల్లర్ - పరిశోధకుడు

ఈయన ఎవరు?: ట్రంప్ అధ్యక్ష పదవి భవిష్యత్తును నిర్ణయించగల వ్యక్తి.

ప్రధాన కథాంశం: కొన్ని పాత్రలకు చాలా శక్తి ఉంటుంది కానీ ప్రధాన పాత్రలు ఉండవు. అటువంటి పాత్రే రాబర్ట్ ముల్లర్. జేమ్స్ కోమీ తొలగింపు నేపథ్యంలో రష్యా లింకులపై దర్యాప్తు కోసం నియమితులైన ‘‘స్పెషల్ కౌన్సెల్’’ (ప్రత్యేక న్యాయవాది) ఈయనే. ముల్లర్ కూడా కోమీ కేటగిరీకి చెందిన వ్యక్తే. ఇద్దరూ ఎఫ్‌బీఐ మాజీ అధిపతులే. దీనివల్ల ముల్లర్ నిష్పాక్షికంగా లేరని కొందరు ఆరోపిస్తున్నారు.

ముల్లర్‌ను కూడా తొలగించాలని అధ్యక్షుడు భావించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన 15 మందికి పైగా న్యాయవాదులు, మూడు డజన్ల మందికి పైగా సిబ్బందితో కూడిన బృందంతో సాక్ష్యాలను పోగు చేస్తూ తెరవెనుక మౌనంగా పనిచేస్తున్నారు. క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయని, త్వరలో అరెస్టులు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

ముల్లర్ దర్యాప్తుకు సమాంతరంగా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు)లో రాజకీయ పెద్దలూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఎవరి మీద అయినా అభియోగాలు మోపగలగే అధికారం ఉన్నది మాత్రం ఈయనకే.

ఈ సుదీర్ఘ ఉత్కంఠ రాజకీయ డ్రామాలో మున్ముందు నాలుగో అంకం ఆ తర్వాతి రంగాల్లో ఈయన కీలక పాత్ర పోషించవచ్చు.

కథనం: రజిని వైద్యనాథన్, రొనాల్డ్ హ్యూజ్; చిత్రాలు: జెర్రీ ఫ్లెచర్

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)