2016లో రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ వృద్ధి

  • 31 అక్టోబర్ 2017
కార్బన్ డయాక్సైడ్, Image copyright Getty Images
చిత్రం శీర్షిక రికార్డు స్థాయికి పెరిగిన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు

2016లో భూమిపై రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) వెల్లడించింది. పది సంవత్సరాల సగటు కంటే 50% ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది.

పారిశ్రామిక విప్లవం, వాతావరణంలో పెరిగిన వేడి తదితరాలతో 8లక్షల ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ నమోదైందని పరిశోధకులు అంటున్నారు.

ఈ పరిణామం ప్రపంచ వాతావరణ లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ ఏడాది ప్రపంచ వాతావరణ సంస్థ 51దేశాల నుంచి తీసుకున్న వివిధ వాతావరణ ప్రమాణాలతో గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్‌ను విడుదలచేసింది.

కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువుల ప్రమాణాలను తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధన కేంద్రాలున్నాయి.

2016లో కార్బన్ డయాక్సైడ్ సగటు సాంద్రత 403.3 పార్ట్స్ పర్ మిలియన్‌గా నమోదైంది. 2015లో ఇది 440 పీపీఎమ్‌గా నమోదైంది.

"ఈ పరిశోధన స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటైన తర్వాత గత ముప్పై ఏళ్లలో ఇప్పటివరకు చూసిన అతి పెద్ద పెరుగుదల ఇదే" అని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించే వాతావరణ సమీక్షా కార్యక్రమ అధ్యక్షులు ఒక్సానా తరసోవా అన్నారు.

చిత్రం శీర్షిక కార్బన్ డయాక్సైడ్ వార్షిక గణాంకాలు

"వాతావరణ చక్రంలో అతిపెద్ద పెరుగుదల 1997-1998 లో నమోదైంది. అప్పుడు అది 2.7 పీపీఎమ్ ఉంటే ఇప్పుడు అదింకా పెరిగి 3.3 పీపీఎమ్ నమోదైంది. ఇది గత పదేళ్ల సగటు కంటే 50 శాతం ఎక్కువ" అని తరసోవా అన్నారు.

వాతావరణ చక్రంలో ఇలాంటి మార్పులు కరవుకు కారణమవుతాయి. మొక్కలు, చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను అదుపులో ఉంచుతాయి.

వాతావరణంలో విపరీతంగా కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అంటున్నారు. వాతావరణ వ్యవస్థలో అనూహ్య మార్పులు ప్రారంభమై... ఆ పరిస్థితి తీవ్రమైన పర్యావరణ సమస్యలకు, ఆర్థిక అవాంతరాలకు దారితీస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.

Image copyright Anthony Dubber

10,000 ఏళ్లలో జరిగిన మార్పులు ఇప్పుడు మరింత వేగంగా జరుగుతున్నాయని ఈ అధ్యయనం తెలుపుతోంది. ఇది ఆందోళనకర విషయమని ఆమె తెలిపారు.

ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన నివేదికలోని అంశాలు నిజంగా ఆందోళన కలిగించేవేనని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ పరిస్థితి తీవ్రమైన పర్యావరణ సమస్యలకు, ఆర్థిక అవాంతరాలను దారితీస్తుందని. అధ్యయనాలు వెల్లడించాయి.

"2015-16లో వాతావరణ చక్రంలో పెరుగుదల 3పీపీఎమ్ ఉండటం చాలా ఆందోళనకర విషయం, 1990-2000లో ఉన్న పెరుగుదల రేటు కన్నా రెట్టింపు వేగంతో పెరుగుదల నమోదైంది" అని రాయల్ హోల్లోవే యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ ఇయాన్ నిస్బెత్ తెలిపారు.

"ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు తప్పనిసరిగా పారిస్ ఒప్పందాన్ని పాటించాలి. శిలాజ (బొగ్గు, పెట్రోలియం, అణు) ఇంధనాల వాడకాన్ని వదిలేయాలి. దీనికి సంబంధించి మార్పు జరుగుతున్నట్లు అనిపిస్తున్నా గాలిలో మాత్రం మార్పులు కనిపించడం లేదు" అని ఆయన అన్నారు.

వాతావరణంలో అంతుచిక్కని విధంగా మిథేన్ వాయువు స్థాయి పెరుగుతుండటం కూడా ఈ నివేదికలో ఆందోళన కలిగిస్తున్న మరో విషయం. ఇది గత పదేళ్ల సగటుకంటే మరింత ఎక్కువ. ఈ పరిస్థితి విషవలయానికి సంకేతమని ప్రొఫెసర్ ఇయాన్ నిస్బెత్ అంటున్నారు. ఉష్ణోగ్రతలో మిథేన్ స్థాయి పెరిగితే అది సహజ వనరుల నుంచి మరింత మిథేన్‌ను విడుదల చేస్తుందని ఆయన అంటున్నారు.

Image copyright WMO

"2007 నుంచి మిథేన్ వేగంగా పెరుగుతోంది. ప్రత్యేకించి 2014, 2015, 2016లో మరింతగా పెరిగింది. ఇలా కాకూడదనే పారిస్ ఒప్పందాన్ని రూపొందించారు. ఉష్ణ దేశ, ఉప ఉష్ణదేశ ప్రాంతాలలో మిథేన్ పెరుగుదల మరింత ఎక్కువగా నమోదవుతోంది. పెరుగుదల శిలాజ ఇంధనాలతో నమోదవ్వడం లేదని మిథేన్‌లో ఉన్న కార్బన్ ఐసోటోప్‌లు తెలుపుతున్నాయి. మిథేన్ ఎందుకు పెరుగుతోందో అర్థం కావడం లేదు. ఇది వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం కావొచ్చు. ఇది నిజంగా ఆందోళనకర విషయం" అని ప్రొఫెసర్ నిస్బెత్ తెలిపారు.

వాతావరణ మార్పులతో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు పారిస్ ఒప్పందం అమల్లోకొచ్చిందని పరిశోధకులు తెలుపుతున్నారు.

"గణాంకాలు అబద్ధం చెప్పవు. మరిన్ని గణాంకాలు విడుదల చేస్తున్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి" అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షక విభాగ అధ్యక్షులు ఎరిక్ సోల్హెం తెలిపారు.

"ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఎన్నో పరిష్కారాలను కనుగొన్నాం. ఇప్పుడు కావాల్సింది ప్రపంచ రాజకీయ సంకల్పంతోపాటు వాటి అమలుకు సత్వర చర్యలే" అని ఎరిక్‌ అన్నారు.

ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షక చర్చలకు తదుపరి కార్యక్రమానికి ఒక వారం ముందే ప్రపంచ వాతావరణ సంస్థ ఈ నివేదికను జర్మనీలో విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినా, ఈ ఒప్పందానికి సంబంధించి చర్చించేందుకు జర్మనీలో పలుదేశాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వారు పారిస్ ఒప్పంద నియమ నిబంధనలపై చర్చించనున్నారు.