అట్లాస్ ఆఫ్ బ్యూటీ: 'అందనంత ఎత్తులో అందమైన భ్రమ'

మిహేలా నొరోక్ ఫోటోలు
ఫొటో క్యాప్షన్,

ఖాట్మండు, నేపాల్ (ఎడమ), ఐస్‌ల్యాండ్‌లలో మిహేలా తీసిన ఫొటోలు

గూగూల్‌లో ''బ్యూటీఫుల్ విమెన్''ను వెతుకు.. అని అడిగింది ఫోటోగ్రాఫర్ మిహేలా నొరోక్.

అలాగే వెతికాను. క్షణంలో పేజీ మొత్తం అమ్మాయిల ఫోటోలతో నిండిపోయింది. అవన్నీ మహిళల అంగాంగ ప్రదర్శనకు సంబంధించినవి.

''అక్కడ ఏం కనిపిస్తోంది? శృంగారాన్ని ఒలకబోస్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు కదూ?'' అని అడిగింది మిహేలా.

నిజంగానే!.. హైహీల్స్ వేసుకుని, తమ సొగసులను ప్రదర్శిస్తున్న వందల కొద్ది ఫోటోలు కన్పించాయి. వారంతా తెల్లగా, చాలా సన్నగా, యుక్తవయస్సులో ఉన్నారు.

''అందం అంటే ఇదేనా?'' అడిగింది మిహేలా.

''అమ్మాయిలను శృంగార వస్తువుగా మాత్రమే చూపించడం అందం అవుతుందా?'' అని ప్రశ్నించింది.

ఫొటో క్యాప్షన్,

ఎడమ నుంచి కుడికి: జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అందాలు

''మహిళలు బొమ్మలు కాదు. మాకూ జీవితాలు, బాధలు ఉన్నాయి. మాకూ శక్తియుక్తులు ఉన్నాయి. మాకు సరైన గుర్తింపు కావాలి. రోజూ ఇలాంటి ఫోటోలను చూస్తూ అందం అంటే ఇదేనని తీర్మానించేస్తున్నారు అందరూ. అలాంటప్పుడు యువతులు ఆత్మన్యూనతకు గురవుతారు. వీరికి ఆత్మవిశ్వాసం కలిగించాలి. వారిలో దాగున్న అందానికి ఓ గుర్తింపు కావాలి. ఈ శరీర ఛాయ, శరీర ప్రదర్శన నిజమైన అందం కాదు కదా!’’

తన మొదటి ఫోటోగ్రఫీ సంకలనం ''అట్లాస్ ఆఫ్ బ్యూటీ'' పుస్తకాన్ని మహేలా ఈమధ్యనే విడుదల చేసింది. ఈ పుస్తకంలో 500 మంది మహిళల ఫోటోలు మనల్ని పలకరిస్తాయి.

ఫొటో క్యాప్షన్,

పుష్కర్, భారతదేశం

అందానికి మిహేలా కొత్త నిర్వచనం ఇస్తోంది.

''ఏ నిర్వచనమూ లేనిదే అందం'' అని ఆమె మాటలు ప్రతిధ్వనిస్తాయి.

ఈ పుస్తకంలోని మహిళలు భిన్నమైన వృత్తులు, ప్రాంతాలకు చెందినవారు. అన్ని వయస్సుల మహిళలూ ఇందులో ఉన్నారు.

''నేను తీసిన ఫోటోలను చాలా మంది ఇష్టపడుతున్నారు. అందుకు కారణం నా పుస్తకంలోని ఫోటోలు సహజంగా ఉండటమే. వారంతా నిజజీవితంలో మనకెదురయ్యే మహిళలే'' అంటారామె.

''మహిళలనూ, వారి అందాన్నీ వర్ణిస్తున్నప్పుడు.. చాలామంది మాటలు బరువుగా ఉంటాయి. అందాన్ని అందుకోలేనంతగా వర్ణిస్తారు వారు.''

''కానీ నా ఫోటోల్లోని మహిళల అందం అందుకు పూర్తిగా భిన్నం. ఈ మహిళలు చాలా సహజంగా, సాధారణంగా ఉంటారు. అందాన్ని మనం ఇలా ఎప్పుడూ చూడం. అందుకే ఈ పుస్తకం ఓ కొత్త అనుభూతి.''

ఈ పుస్తకంలోని ప్రతి ఫోటోకూ ఓ క్యాప్షన్ ఉంటుంది. ఆ ఫోటో ఎక్కడ తీశారన్న సమాచారం అందులో ఉంటుంది.

చాలా ఫోటోలకు - ఆ వ్యక్తి ఎవ్వరు, ఏ ప్రాంతం అన్న అంశాలూ జోడించి ఉంటాయి.

భారతదేశం, ఇటలీ, జర్మనీ, అఫ్గానిస్తాన్, ఉత్తర కొరియా, మెక్సికో, ఇంగ్లాండ్, అమెరికా, అమెజాన్ అడవులు, నేపాల్ ఇలా భిన్నమైన ప్రాంతాల మహిళలు ఇందులో ఉన్నారు.

ఫొటో క్యాప్షన్,

మిహేలా కెమెరాలో బందీ అయిన కొలంబియా (ఎడమ) మరియు ఇటలీ ముద్దుగుమ్మలు

ఫొటో క్యాప్షన్,

కెప్టెన్ బెరినీస్ టోరిస్, మెక్సికో ఫెడరల్ పోలీస్

ఈ దేశాల్లో చాలా ప్రాంతాలు సమస్యాత్మకంగా కన్పించాయి.

''ఫోటోలు తీయడానికి చాలా మంది మహిళలను అనుమతి కోరాను. నేను ఏం చేస్తున్నాను, నా ప్రాజెక్ట్ ఏమిటి? వంటి విషయాలను వారికి వివరించి చెప్పాను. కొందరు సరే అంటారు. మరికొందరు వద్దు అంటారు. ఈ సమాధానాలు ఆయా దేశ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.''

''సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న సమాజంలో మహిళలపై ఒత్తిడి ఉంటుంది. ఆమె రోజూవారి జీవితం ఎవరో ఒకరి కనుసన్నల్లో నడుస్తుంటుంది. ఇలాంటి మహిళలు ఫోటో తీసేందుకు ఒప్పుకోరు. బహుశా ఆమె తండ్రి, సోదరుడు లేక భర్త ఎవరో ఒక మగవాడి అనుమతిని ఆమె పొందాలేమో?''

ఫొటో క్యాప్షన్,

అబీ మరియు ఏంజెలా సిస్టర్స్, న్యూయార్క్

ఫొటో క్యాప్షన్,

ప్యాంగ్‌యాంగ్ మిలటరీ మ్యూజియం గైడ్, ఉత్తర కొరియా

''కొలంబియా లాంటి దేశాల్లో మహిళలు మరింత జాగ్రత్తతో ఉంటారు. ఆ జాగ్రత్త వారి భద్రతకు సంబంధించింది. పాబ్లో ఎస్కొబార్, డ్రగ్ మాఫియా భయం వారిని వెంటాడుతూ ఉంటుంది.''

ఫోటోలకోసం వారి వద్దకు వెళ్లి మాట్లాడినపుడు -

''ఓహో.. మా ఫోటోలు తీస్తావా? సరే. ఆ తర్వాత కొందరు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేస్తారు! ఎందుకంటే నువ్వు నువ్వు కాదు. మాఫియా వాళ్ల మనిషివి. మాకు తెలుసు.'' అన్నారు.

''ఎవరైనా ఈ ప్రాజెక్టును ఆడవాళ్లతో కాకుండా మగవాళ్లతో ప్రారంభించి ఉంటే పని సులభమయ్యేది. ఎందుకంటే భార్య, తల్లి, చెల్లి అనుమతి వారికి అవసరం లేదు కనుక.''

ఫొటో క్యాప్షన్,

ఎడమ: పొఖారా, నేపాల్. కుడి: నాంపాన్, మయన్మార్

మిహేలా చాలా అరుదుగా ఫోటోషాప్ చేస్తారు.

''సహజంగా కన్పించే రంగులు, పెయింటింగ్‌లో కన్పించినట్టు అన్ని ఫోటోల్లోనూ కన్పించవు. బోసిపోయినట్లుగా ఉంటాయి. ఆ సహజత్వం స్థానంలో కొన్నిసార్లు రంగులు అద్దాల్సివస్తుంది. కానీ ఫోటోల్లోని మనుషులను మాత్రం నేను తాకను. వారి సహజత్వాన్ని ఇబ్బంది పెట్టను.''

ఫొటో క్యాప్షన్,

సిరియా యుద్ధానికి దూరంగా పారిపోయిన తల్లీకూతుళ్లు

2015లో ''బుక్ ఆఫ్ సెల్ఫీస్'' పేరుతో విడుదలైన హాలీవుడ్ నటి కిమ్ కార్డషియన్ పుస్తకంతో పోలిస్తే మిహేలా పుస్తకం చాలా భిన్నమైనది.

''చాలా మంది బ్లాగర్లు కిమ్ కార్డషియన్ పుస్తకాన్ని ఆకాశానికెత్తేశారు. వాళ్లు అందాన్ని అందనంత ఎత్తుకు చేర్చారు. మరోవైపున కిమ్ కార్డషియన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ ఫాలోయిర్స్ ఉన్నారు. నాకేమో కేవలం 2 లక్షల మంది ఫాలోయిర్స్. కానీ నాకు తెలుసు. ఎప్పటికైనా సహజత్వంలో అందం దాగుందన్నది ప్రపంచానికి అర్థమవుతుంది.

ఫొటో క్యాప్షన్,

ఎడమ నుంచి కుడికి: ఫ్రాన్స్, ఇథియోపియా, గ్రీస్ సౌందర్యం

అందరికీ మిహేలా ఇచ్చే సలహా ఏమిటి? ఒక్కసారి ఊహించండి...

మంచి కెమెరా కొనండి అంటారా? లేక,

కెమెరా లెన్సుల గురించీ యాంగిల్స్ గురించీ తెలుసుకోండి.. అంటారా?...

ఏదీ కాదు..

మంచి షూస్ కొనమంటారామె. ఎందుకో తెలుసా??

''అసలైన అందాన్ని వెతకడానికి ప్రపంచమంతా అన్వేషించాలిగా..''

ఫొటో క్యాప్షన్,

లీసా, బెర్లిన్

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)