న్యూయార్క్ ట్రక్ దాడి: ఐదుగురు స్నేహితులు మృతి

న్యూయార్క్ ట్రక్కు దాడి

ఫొటో సోర్స్, Reuters

న్యూయార్క్‌లో జరిగిన ట్రక్ దాడిలో అర్జెంటీనాకు చెందిన ఐదుగురు స్నేహితులు మృతి చెందారు. వీరంతా తమ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరుపుకొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్నారు.

మాన్‌హట్టన్‌లో ఓ ట్రక్ డ్రైవర్ తన వాహనాన్ని సైక్లిస్టులు, పాదచారుల మీదుగా పోనివ్వడంతో కనీసం ఎనిమిది మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దాడి జరిగిన వెంటనే పోలీసులు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

తీవ్రంగా గాయపడిన దుండగుడు, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అధికారులు దీనిని ‘ఉగ్రదాడి’గా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CBS

ఫొటో క్యాప్షన్,

సేఫుల్లో సైపోవ్

అతని ట్రక్‌లో ఇస్లామిక్ స్టేట్‌ ప్రస్తావన ఉన్న నోట్ లభించినట్లు పోలీసులు చెబుతున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 00.30 గంటలు) ఈ సంఘటన జరిగింది.

గాయపడిన వారందరి పరిస్థితి తీవ్రంగా ఉందనీ, అయితే వారి ప్రాణాలకు మాత్రం ముప్పు లేదని న్యూయార్క్ పోలీస్ శాఖ కమిషనర్ జేమ్స్ ఓనీల్ తెలిపారు.

జరిగిన ఘటనకు సంబంధించిన ఆయన తెలిపిన వివరాలివి:

  • స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత హోం డిపో నుంచి అద్దెకు తీసుకున్న వాహనాన్ని వెస్ట్ హోస్టన్ మీదుగా నడుపుతూ సైక్లిస్టులు, పాదచారుల పైకి మళ్లించాడు.
  • వాహనం మొదట ఒక స్కూలు బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పెద్దవారు, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆ తర్వాత వాహనం ఆగిపోయింది.
  • డ్రైవర్ వాహనంలోంచి బైటికి వచ్చాడు. అతని చేతిలో రెండు హ్యాండ్‌గన్స్ ఉన్నాయి. అతడు 'ఉగ్రవాద దాడి'కి సంబంధించిన ప్రకటన చేశాడు.
  • అక్కడే ఉన్న ఒక పోలీసు అధికారి అతడిపై తుపాకీ పేల్చగా దాడికి పాల్పడ్డ వ్యక్తికి కడుపులో గాయమైంది.
  • ఘటనా స్థలం లోంచి ఒక పెయింట్‌బాల్ ‌తుపాకీనీ, ఒక పెల్లెట్ గన్‌నూ స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు తమ పనులు ముగించుకొని స్కూల్‌ల నుంచి, ఆఫీసుల నుంచి సైకిళ్లపై ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని కమిషనర్ అన్నారు.

ఫొటో సోర్స్, CBS

ఈ దారుణానికి పాల్పడ్డ 29 ఏళ్ల సేఫుల్లో సైపోవ్ 2010లో అమెరికాకు శరణార్థిగా వచ్చి ఫ్లోరిడాలో ఉంటున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

నగరవాసులంతా హాలోవీన్ వేడుకల్లో మునిగి ఉండగా ఈ దాడి జరిగింది.

న్యూయార్క్‌లో ట్రక్కు దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా విభాగాన్ని ఆదేశించారు.

'ఇస్లామిక్ స్టేట్ మన దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించరాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.

నిందితుని గురించి ఏం చెబుతున్నారు?

  • సేఫుల్లో సైసోవ్ ఫ్లోరిడాలోని తంపాలో నివసిస్తున్నాడు.
  • గత ఏడాది ట్రాఫిక్ జరిమానా విషయంలో సైపోవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.
  • ట్రక్ నుంచి దిగిన సైపోవ్ ''అల్లాహు అక్బర్'' అని అరిచినట్లు స్థానికులు చెబుతున్నారు.
  • తెల్లని పికప్ ట్రక్ సైకిళ్లకు ప్రత్యేకించిన దారిపై వేగంగా వచ్చి, అనేక మందిని ఢీ కొందని ప్రత్యక్ష సాక్షి యూజెన్ తెలిపారు.
  • ఫ్రాంక్ అనే మరో ప్రత్యక్ష సాక్షి, ఓ వ్యక్తి పరిగెడుతుండగా చూసినట్లు తెలిపాడు. పోలీసుల కాల్పులకు ఆ వ్యక్తి కింద పడిపోయాడని వివరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)