1984 సిక్కుల ఊచకోత, 2002 గుజరాత్ మారణకాండల్లో అసలు దోషులెవరు? - అభిప్రాయం

  • మనోజ్ మిట్ట
  • బీబీసీ పంజాబీ కోసం
1984 అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల బంధువులు

ఫొటో సోర్స్, Getty Images

1984, అక్టోబరు 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నవంబరు 1న సిక్కుల ఊచకోత మొదలైంది.

ఇందిర హత్య జరిగిన రోజే సిక్కులను లక్ష్యంగా చేసుకొని చాలా చోట్ల దాడులు జరిగినప్పటికీ, మొదటి హత్య మాత్రం మరుసటి రోజు, నవంబర్ 1న తెల్లవారుజామున జరిగింది.

నవంబర్ 1 ఉదయం, తూర్పు దిల్లీలో తొలుత ప్రారంభమైన హింసాకాండ హత్యకు దారితీసింది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇందిర హత్య జరిగిన తర్వాత చాలా సేపటికి సిక్కుల ఊచకోత మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మారణహోమంలో 2,733 మంది చనిపోయారు.

ఈ హింసాకాండ ఇందిర హత్య జరిగిన వెంటనే మొదలు కాలేదు కాబట్టి ఇది పథకం ప్రకారం సాగించిన హత్యాకాండ కాదని ప్రభుత్వం చేసే వాదన సత్యదూరమైంది.

ఇదే తరహా మారణహోమం 2002లో గోధ్రా సంఘటన తర్వాత గుజరాత్‌లోనూ చోటుచేసుకుంది.

గోధ్రా రైలు ఘటన జరిగిన 30 గంటల తర్వాత గుల్బర్గ్ సొసైటీలో మొదటగా హింస చెలరేగింది.

1984, 2002 లలో చోటుచేసుకున్న ఈ రెండు మతహింసలకు మధ్య ఓ పెద్ద వ్యత్యాసం ఉంది. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నవారు శిక్ష నుంచి తప్పించుకోవడమే ఆ తేడా.

దిల్లీలో జరిగిన సిక్కుల మారణకాండపై 33 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా బాధితులకు న్యాయం చేయడంలో న్యాయవ్యవస్థ విఫలమైంది.

ఫొటో సోర్స్, Getty Images

2002 గోధ్రా బాధితులతో పోల్చితే 1984 బాధితులకు కేవలం నష్టపరిహారం విషయంలో మాత్రమే కాస్త ఓదార్పు లభించింది. అది కూడా ఉన్నత స్థాయిలో రాజకీయంగా ఒత్తిడి తేవడం వల్ల మాత్రమే సాధ్యమైంది. అయినప్పటికీ వారు ఇంకా తమకు న్యాయం దక్కలేదని నిరాశతోనే ఉన్నారు.

గోధ్రా ఘటన సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ప్రభుత్వంలో మాయా కొడ్‌నానీ మంత్రిగా ఉన్నారు. ఈ మతహింస బాధితులు కనీసం ఆమెను దోషిగానైనా నిలబెట్టగలిగారు.

అయితే, 1984 మతహింసలో ఆమె లాగే వ్యవహరించిన సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్, కమల్ నాథ్‌లతో పాటు చనిపోయిన హెచ్.కె.ఎల్. భగత్‌లపై కూడా సుదీర్ఘ న్యాయ విచారణ జరిగింది. కానీ, శిక్ష మాత్రం పడలేదు.

ఫొటో సోర్స్, Getty Images

1984 మారణకాండపై విచారణకు అనేక కమిటీలు, కమిషన్లు వేశారు. రెండు నెలల కిందట కూడా దీనిపై కొత్తగా మరో కమిటీ కూడా ఏర్పాటైంది.

1984 మారణహోమంపై సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా విచారణ చేసినప్పటికీ 1984 మారణహోమానికి సంబంధించిన 200 కేసులను ఎందుకు మూసివేసిందో విచారించేందుకు ఈ ఏడాది ఆగస్టు 16న ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లో ఇది తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.

సిట్ ఇప్పటి వరకు 293 కేసులను పరిశీలించి అందులో కేవలం 59 కేసులను తిరిగి ప్రారంభించింది. అందులో కూడా మళ్లీ 39 కేసులను మూసివేసింది. కేవలం 4 కేసులలో లిఖితపూర్వక ఆధారాలు సేకరించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ హయాంలో జరిగిన మారణహోమంపై విచారణలో పెద్దగా పాదర్శకత కనిపించడం లేదు.

బహుశా 1984, 2002 మతహింసలను ప్రేరేపించినవారి మధ్య ఏదైనా రహస్య ఒప్పందం ఉందేమో మరి.

1984 ఉచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై మళ్లీ విచారించేందుకు దిల్లీ హైకోర్టు సిద్ధమవడం బాధితుల్లో కొంత నమ్మకాన్ని కలిగిస్తోంది.

1984లో దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో చెలరేగిన హింస సమయంలో సజ్జన్‌కుమార్ అక్కడే ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి. ఆయన్ను చూసిన ప్రత్యక్ష సాక్షులూ ఉన్నారు. అందుకే ఈ విషయంలో తమకు కొంతైనా న్యాయం జరుగుతుందని, ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీకి శిక్ష పడుతుందని బాధితులు బలంగా నమ్ముతున్నారు. కాగా, ఈ విచారణలో బాధితుల తరఫున పోరాడేందుకు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా పంజాబ్ అంసెబ్లీ ప్రతిపక్ష హోదాను కూడా వదులుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ కంటోన్మెంట్ ఏరియా, పశ్చిమ దిల్లీలో జరిగిన మారణహోమంలో సజ్జన్ కుమార్ పాత్ర లేదని గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. కానీ, దిల్లీ కంటోన్మెంట్ ఏరియా హింసలో ఆయన పాత్ర ఉన్నట్లు చెప్పే ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ ఉన్నారు.

మతహింసకు సంబంధించిన అనేక కేసుల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై లభించే ఆధారాల కంటే సజ్జన్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం చాలా పెద్దదనే చెప్పాలి. హింసాకాండ సమయంలో సజ్జన్ కుమార్ అల్లరి మూకలతో కలిసి వీధుల్లో తిరిగినట్లు నాటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇలా ఓ రాజకీయ నాయకుడు సాక్ష్యాలతో సహా చిక్కడం చాలా అరుదు.

తూర్పు దిల్లీలో ఇలాంటి పాత్రే పోషించిన హెచ్.కె.ఎల్. భగత్‌ విషయంలో సాక్ష్యాలు పెద్దగా లభించలేదు. అయితే, మారణకాండలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకుండా తెర వెనుక ఉండి ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. 2000 సంవత్సరంలో వెలువడిన కోర్టు తీర్పులో ఆయన నిర్దోషిగా తేలడానికి ఇదే ప్రధాన కారణం.

ఇందులో భగత్ ప్రమేయం లేదని రాజీవ్‌గాంధీ హయాంలో 1986లో ఏర్పడ్డ రంగనాథ్ మిశ్రా కమిషన్ పేర్కొంది. ఆయనకు అనుకూలంగా సిక్కు నేత బల్విందర్ సింగ్ సాక్ష్యం చెప్పడంతో ఆయనను కేసు విచారణ నుంచి మినహాయించారు. బల్విందర్ సింగ్ కుమారుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆ తర్వాత కాలంలో షీలా దీక్షిత్ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. ఇటీవల ఆయన బీజేపీలోకి మారారు.

మతహింస నుంచి రాజకీయ లబ్ధిని పొందే నేటి ధోరణులను గమనించినట్టయితే, చట్టం ఇలాంటి హింసకు పాల్పడే వారికన్నా, వారిని ఎగదోసే బడా నాయకులను పట్టుకోవడం చాలా అవసరమని అర్థమవుతుంది. నేరాలకు పాల్పడినప్పటికీ శిక్ష నుంచి తప్పించుకోగల వెసులుబాటు ఉన్నంత కాలం రాజకీయ పార్టీలను - అవి సిద్ధాంతాలకు కట్టుబడినవే అయినా లేదా అవకాశవాద పార్టీలే అయినా - మతోన్మాద హింసకు పాల్పడకుండా అడ్డుకోలేం.

(మనోజ్ మిట్ట, 'వెన్ ఏ ట్రీ షూక్ దిల్లీ: ది 1984 కార్నేజ్ అండ్ ఇట్స్ ఆఫ్టర్‌మాత్' పుస్తక సహరచయిత, 'ది ఫిక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ : మోదీ అండ్ గోధ్రా' పుస్తక రచయిత.)

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)