రోహింజ్యా సంక్షోభం: రఖైన్ రాష్ట్రంలో ఆంగ్ సాన్ సూచీ పర్యటన

ఆంగ్ సాన్ సూచీ
ఫొటో క్యాప్షన్,

రఖైన్‌లో సైనికుల దాడులపై ఆంగ్ సాన్ సూచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు

రోహింజ్యాలు నివసించే రఖైన్ ప్రాంతాన్ని తొలి సారిగా మయన్మార్‌ ప్రభుత్వ వాస్తవ అధినేత్రి ఆంగ్ సాన్ సూచీ సందర్శిస్తున్నారు. ఇప్పటికే ఆమె రఖైన్ రాష్ట్ర రాజధాని సిట్వే చేరుకున్నారు.

గత కొద్దికాలంగా ఇక్కడ రోహింజ్యాలపై హింసాత్మక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

ఒక రోజు పర్యటనలో రఖైన్ రాజధాని సిట్వే, ఇతర పట్టణాలను సూచీ సందర్శించనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

రోహింజ్యా ముస్లింలపై మయన్మార్‌ మిలిటరీ చేస్తున్న హింసాత్మక దాడులను ఆపడంలో విఫలమయ్యారని అంతర్జాతీయ స్థాయిలో సూచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి చూస్తే దాదాపు ఆరు లక్షల మంది రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు వలసపోయారు.

రఖైన్‌ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మిలిటెంట్ గ్రూప్ ది అరకన్ రోహింజ్యా సాల్వేషన్ ఆర్మీ (అర్సా), పోలీసు స్టేషన్లపై వరుస దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా మయన్మార్‌ మిలిటరీ రోహింజ్యాలపై హింసాత్మక దాడులను ప్రారంభించింది.

ఈ దాడుల్లో ఎంతో మంది రోహింజ్యాలు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గ్రామాలను తగలబెట్టి, రోహింజ్యాలను బయటకు వెళ్లగొట్టినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

2017 సెప్టెంబరు 7న రోహింజ్యాలు నివసించే ఒక గ్రామాన్ని తగుల బెట్టారు. అంతకు ముందే హింసాత్మక ఘటనలను అడ్డుకున్నట్లు సూచీ చెప్పారు

మిలిటెంట్లను ఏరివేయడంలో భాగంగానే తాము దాడులు చేస్తున్నట్లు మయన్మార్‌ మిలిటరీ చెబుతోంది. పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతున్నారన్న వార్తలను తోసి పుచ్చింది.

అయితే ప్రత్యక్షంగా చూసినవారు, రోహింజ్యా శరణార్థులు, పాత్రికేయులు మాత్రం మిలిటరీ చెబుతున్న మాటలను వ్యతిరేకిస్తున్నారు.

"సూచీ ప్రస్తుతం సిట్వే‌లో ఉన్నారు. మాంగ్‌డా, బతిడాంగ్ పట్టణాలను సందర్శిస్తారు" అని మియన్మార్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జా టే, వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీకి గురువారం వెల్లడించారు. "పగలు మాత్రమే ఆమె అక్కడ పర్యటిస్తారు" అని టే చెప్పారు.

అయితే రోహింజ్యా గ్రామాలను సందర్శిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

గురువారం ఉదయం సిట్వే‌లో ఆంగ్ సాన్ సూచీ ఒక మిలిటరీ హెలికాప్టర్ ఎక్కుతుండగా తమ రిపోర్టరు చూసినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. దాదాపు మరో 20 మంది సూచీతో పాటు ఉన్నట్లు పేర్కొంది.

వీడియో క్యాప్షన్,

‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’ రోహింగ్యాలు

ఈ ఏడాది సెప్టెంబరులో ప్రసంగించినప్పుడు రఖైన్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుంటోందనే ఆరోపణలను సూచీ తోసిపుచ్చారు. అయితే రోహింజ్యాలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించడం కానీ, మిలిటరీని తప్పు పట్టడం కానీ ఆమె చేయలేదు.

బుద్ధిస్టులు మెజారిటీగా ఉన్న రఖైన్‌లో రోహింజ్యా ముస్లింలు మైనారిటీగా ఉన్నారు. వీరిని మయన్మార్ ప్రభుత్వం పౌరులుగా గుర్తించడం లేదు. వారికి ఎటువంటి హక్కులు కల్పించడం లేదు. వారిని అక్రమ వలసదారులుగా చూస్తోంది.

రోహింజ్యా శరణార్థులు తమ దేశంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్లే అవకాశం లేకుండా బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాము ఎంపిక చేసిన ప్రాంతాలలోనే నివసించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది.

కాక్స్ బజార్ నగరానికి సమీపంలో 4 లక్షల మంది రోహింజ్యా శరణార్థులకు పునరావాస కేంద్రాలు నిర్మించనున్నట్లు బంగ్లాదేశ్ పేర్కొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)