ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్టులపై చర్చకు తెరతీసిన పాకిస్థాన్ దర్శకురాలు

  • సికిందర్ కిర్మాణీ
  • బీబీసీ ప్రతినిధి, పాకిస్థాన్
పాకిస్థాన్ దర్శకనిర్మాత షర్మీన్ ఒబైద్ చినోయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాకిస్థాన్ దర్శకనిర్మాత షర్మీన్ ఒబైద్ చినోయ్

పరిచయం లేని మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వేధించినట్లేనంటూ పాకిస్థాన్‌కు చెందిన దర్శక నిర్మాత షర్మీన్ ఒబైద్ చినోయ్ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. షర్మీన్ సోదరికి వచ్చిన ఓ ప్రెండ్ రిక్వెస్ట్‌ నేపథ్యంలో ఇదంతా మొదలై అసలు వేధింపులకు నిర్వచనం ఏంటన్న ప్రశ్న తలెత్తింది.

ఇటీవల షర్మీన్ సోదరి ఓ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స తరువాత డాక్టర్ ఆమెకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. షర్మీన్‌కు అది కోపం తెప్పించింది. ట్విటర్లో ఆమె దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌లో ఇలాంటివాటికి హద్దూపద్దూ లేకుండా పోతోందని, ఒక మహిళా రోగికి వైద్యుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడమేంటని ప్రశ్నిస్తూ ఆయనపై ఫిర్యాదు చేస్తానంటూ వరుస ట్వీట్లు చేశారు. దీంతో అసలు వేధింపులకు నిర్వచనమేంటన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఫొటో క్యాప్షన్,

ఫేస్‌బుక్‌లో మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించడంపై చర్చ జరుగుతోంది

షర్మీన్ అభిప్రాయాలపై చాలామంది పాకిస్థానీలు సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఆమె అతిగా స్పందించారని అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా మాట్లాడారు.

ఫొటో సోర్స్, Sharmeen Obaid / Twitter

ఫొటో క్యాప్షన్,

షర్మీన్ ఒబైద్ చేసిన ట్వీట్

ఫొటో సోర్స్, Sharmeen Obaid / Twitter

ఫొటో సోర్స్, Sharmeen Obaid / Twitter

ఫొటో క్యాప్షన్,

షర్మీన్ చేసిన ట్వీట్

షర్మీన్‌ అభిప్రాయాలతో విభేదించే అలీ మొయీన్ నవాజీష్ అనే పాత్రికేయుడు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ''ముందుముందు పెన్ను అడిగినా వేధించామంటారేమో?.. ఎవరి వైపైనా 3 సెకన్లపాటు చూసినా వేధించడంగానే పరిగణిస్తారేమో'' అని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

వేధింపులకు గురయ్యే నిజమైన బాధితుల గురించి మాట్లాడాలని ఆయన సూచించారు. షర్మీన్ తన చర్యలతో పాకిస్థాన్ పరువు తీస్తున్నారంటూ నవాజీష్ విమర్శించారు.

షర్మీన్ వరుస ట్వీట్ల కారణంగా కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో పనిచేసే ఆ వైద్యుడిని సస్పెండ్ చేశారని నవాజీష్ తెలిపారు.

కాగా పరువు హత్యలు, యాసిడ్ దాడులు వంటి అనేక అంశాలపై డాక్యుమెంటరీలు తీసిన షర్మీన్ గతంలోనూ పలుమార్లు విమర్శలను ఎదుర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆమె పాక్ పరువు తీస్తున్నారంటూ విమర్శకులు మండిపడిన సందర్భాలున్నాయి.

తాజా వివాదంలోనూ నెటిజన్లు ఆమె తీరుపై నిరసన వ్యక్తంచేశారు. తన కుటుంబానికి చెందినవారు కాకుండా ఇతర పురుషులతో ఆమె దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. అంతేకాదు, షర్మీన్‌కు ఇబ్బడిముబ్బడిగా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించాలని ప్రచారం చేస్తూ అనేక ఫేస్‌బుక్ పేజీలను ప్రారంభించారు.

కేవలం మగవాళ్లే కాకుండా ఎంతోమంది మహిళలు కూడా ఈ విషయంలో షర్మీన్ ధోరణిని ప్రశ్నించారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినంత మాత్రాన వేధించారని అనుకుంటే ఎలా అని వారు సోషల్ మీడియాలో ఆమెను నిలదీశారు.

ఫొటో సోర్స్, Hamza Ali Abbasi / Twitter

ఫొటో క్యాప్షన్,

షర్మీన్ వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు అనుకూలంగా, ప్రతికూలంగా కూడా స్పందించారు

మరోవైపు పాక్ పత్రికలు కొన్ని షర్మీన్‌కు మద్దతుగా వ్యాసాలు ప్రచురించాయి. పాకిస్థాన్‌కే చెందిన రచయిత బీనా షా వంటివారూ ఆమె వాదనను సమర్థించారు. మరోవైపు షర్మీన్ స్వయంగా దీనిపై స్పందిస్తూ ''మహిళల భద్రతకు సంబంధించి వేధింపులు, అనైతిక ధోరణులకు వ్యతిరేకంగా జరగాల్సిన ఈ చర్చ పక్కదారి పట్టింది'' అని అభిప్రాయపడ్డారు.

ఆ వైద్యుడు తన సోదరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడానికి ముందుగా ఆమె ఫొటోలకు కామెంట్లు పెట్టారని, చికిత్స సమయంలోనూ పూర్తిగా వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలడిగారని ఆరోపించారు. తనకూ నిత్యం అనేకమంది కొత్తవారి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తాయని, కానీ ఇలా వైద్యుడి హోదాను అడ్డంపెట్టుకుని రోగిని ఇబ్బందిపెట్టడం సరికాదని అన్నారు.

కాగా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్ నుంచి తొలగించగా కరాచీలోనే వేరే ఆసుపత్రి యాజమాన్యం ఆయనకు ఉద్యోగ అవకాశం ఇచ్చిందని చెబుతున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)