పేదరికానికి కొత్త నిర్వచనం చెప్పిన ప్రపంచ బ్యాంక్!

  • 5 నవంబర్ 2017
పారిస్ శివారులోని పేదల బస్తి Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొత్త నిర్వచనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతోంది.

ప్రపంచంలో పేదలు ఎంతమంది ఉన్నారు? సూటిగా అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రం కాస్త కష్టం.

కొన్ని వారాల క్రితం వరకు పేదరికానికి నిర్వచనం ఒక్కటే ఉండేది. రోజుకు 123 రూపాయలతో, లేదంటే అంతకంటే తక్కువ ఖర్చుతో జీవించే వారిని పేదలుగా గుర్తిస్తూ ప్రపంచ బ్యాంక్ నిర్వచించింది. దాని ప్రకారం 2013లో ప్రపంచ జనాభాలో 10.7 శాతం మంది అంటే 77 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు.

కానీ తాజా దారిద్ర్య రేఖ నిర్వచనం ప్రకారం ప్రపంచం, వివిధ దేశాలు ఇంకా పేదరికంలోకి జారిపోయి ఉండొచ్చు.

మా ఇతర కథనాలు:

ఈ నెల తర్వాత పేదరికాన్ని నిర్వచించడానికి ప్రపంచ బ్యాంక్ మరింత సరళమైన విధానాన్ని అనుసరించనుంది. అంటే పేదరికం ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుందన్న మాట. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ప్రపంచ బ్యాంక్ పేదరికాన్ని నిర్ణయిస్తుంది.

  • పేదరికాన్ని కొలిచేందుకు ముఖ్యంగా రెండు పద్ధతులు పాటించనుంది.
  • ఒకటి రోజుకు 206 రూపాయల కంటే తక్కువ వ్యయంతో జీవించేవాళ్లు.
  • అంటే నెలకు 6,180 రూపాయలు, లేదా అంతకన్నా తక్కువ ఖర్చు చేసే స్థోమత ఉన్న వ్యక్తి పేదవాడి కిందే లెక్క.
  • ఇక రెండో పద్ధతి రోజుకు 355 రూపాయల ఖర్చుతో జీవించేవాళ్లు.
  • అంటే నెలకు 10,650 జీతం వచ్చినా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నట్లే.

పేదరికానికి కొత్త నిర్వచనం

346 కోట్ల

మంది ప్రజలు 2013లో రోజుకు రూ.355 కంటే తక్కువ ఖర్చుతో జీవించారు.

48.4%

ప్రపంచ జనాభాలో వీరి శాతం ఇది.

  • రోజుకు రూ. 123 కంటే తక్కువ ఖర్చు చేస్తే గతంలో నిజమైన పేదల కింద లెక్క.

  • 76.7 కోట్ల మంది ప్రజలు ఆ లెక్కన 2013లో పేదవాళ్లే.

Getty

ఈ కొత్త పద్ధతులు ఆయా దేశాల్లో పేదరికాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఉపకరిస్తాయని ప్రపంచ బ్యాంకు సీనియర్ సలహాదారు ఫ్రాన్సిస్కో ఫెరీరా అన్నారు. 'మలావీలో పేదరికంలో ఉండటం వేరు, బ్రెజిల్ లేదా పోలాండ్‌లో పేదరికంలో ఉండటం వేరు' అని ఆయన చెప్పారు.

అయితే, కొత్త ప్రమాణాల ప్రకారం పేదరికం పెరిగింది. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 355 రూపాయల ఖర్చుతో జీవించే వాళ్లు ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 48.4 శాతం ఉన్నారు. అంటే 346 కోట్ల మంది అన్నమాట.

మా ఇతర కథనాలు:

ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, పేదరికం తాజా నిర్వచనం వల్ల బ్రెజిల్‌లో పేదల సంఖ్య విపరీతంగా పెరిగింది. వారి సంఖ్య 89 లక్షల నుంచి 4.55 కోట్లకు చేరింది. ఇది ఆ దేశ జనాభాలో ఐదో వంతు.

ప్రపంచ బ్యాంక్ ప్రకారం బ్రెజిల్‌ 'ఎగువ మధ్య తరగతి' ఆదాయ పరిధిలోకి వస్తుంది. అంటే రోజుకు 355 రూపాయల కంటే తక్కువ వ్యయంతో జీవించే వారిని అక్కడ పేదలుగానే చూస్తారు.

దారిద్ర్యరేఖ పరిధిని పెంచడం సంపన్న దేశాలపైనా ప్రభావం చూపిస్తోంది. స్పెయిన్‌లో రోజుకు 123 రూపాయల ఖర్చుతో జీవించే వాళ్లు కేవలం 0.2 శాతం అంటే దేశ జనాభాలో 4.65 కోట్ల మంది మాత్రమే ఉంటారు. కానీ ఆదాయ పరిమితిని 355 రూపాయలకు పెంచడం వల్ల స్పెయిన్‌లో పేదలు దాదాపు 3 శాతం పెరుగుతారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రెజిల్‌లో 22శాతం జనాభా పేదరికంలో మగ్గుతోంది

ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం అధికాదాయ దేశాల్లో రోజుకు 1,404 రూపాయలు ఖర్చు చేసే వ్యక్తి కూడా పేదరికంలో ఉన్నట్టే. అంటే నెలకు రూ. 42,120 సంపాదించినా అక్కడ పేదోడి కిందే లెక్క. అలా భావిస్తే అమెరికా, బ్రిటన్‌లో కూడా 20 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖ దిగువన ఉన్నట్లేనని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది.

మా ఇతర కథనాలు:

అయితే, ఇప్పటికీ కొన్ని దేశాల్లో పేదరికాన్ని పాత ప్రమాణాల ప్రకారమే కొలవాలని ఫ్రాన్సిస్కో ఫెరీరా చెబుతున్నారు. బ్రెజిల్‌లో రోజుకు 123 రూపాయల ఖర్చుతో జీవించే పేదలు కేవలం 4.3 శాతం మంది మాత్రమే ఉంటే.. కాంగోలో మాత్రం ఇది 77 శాతంగా ఉంది. అందుకే దారిద్ర్య్య రేఖను నిర్ణయించడానికి పాత ప్రమాణాలు కూడా ఉపయోగించాలని ఫెరీరా చెప్తున్నారు.

కటిక పేదరికాన్ని కొలిచేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలను ప్రపంచ బ్యాంక్ ఉపసంహరించుకోలేదు. 2030లోగా పేదరికం లేని ప్రపంచం చూడాలన్నది వరల్డ్ బ్యాంక్ లక్ష్యమని ఫెరీరా అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం సుమారు 100 కోట్ల మంది చిన్నారులు పేదరికంలో మగ్గుతున్నారు

1990- 2013 మధ్యకాలంలో సంపూర్ణ దారిద్య్ర రేఖ కింద జీవిస్తున్న ప్రజల సంఖ్య సగానికి తగ్గింది. అదే సమయంలో ప్రపంచ జనాభాలో రోజుకు 355 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో జీవిస్తున్న ప్రజల శాతం 68.2% నుంచి 48.4% శాతానికి తగ్గింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)