మరో వందేళ్లూ మహిళలకు సమానత్వం కలే!

  • సతీష్ ఊరుగొండ
  • బీబీసీ తెలుగు ప్రతినిధి
భరతమాత చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మహిళలు ఆకాశంలో సగమన్నారు. స్త్రీ-పురుషులు సమానమేనని రాజ్యాంగమూ చెబుతోంది. సమాన అవకాశాలు కల్పిస్తామని పాలకులూ తరచూ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక చెబుతోంది.

ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే సమానత్వం కోసం మహిళలు వందేళ్లు నిరీక్షించాలట. అంతేకాదు స్త్రీ-పురుష అసమానతలు గతంతో పోలిస్తే పెరుగుతున్నాయని కూడా డబ్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

2006 నుంచి పోల్చి చూసుకుంటే ఈ ఏడాది స్త్రీ-పురుష అసమానతలు పెరిగాయని డబ్యూఈఎఫ్ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 144 దేశాల్లోని విద్య, వైద్య, రాజకీయ రంగాలతో పాటు ఆర్ధిక విషయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని అధ్యయనం చేసి డబ్యూఈఎఫ్ ఈ నివేదిక తయారు చేసింది.

మగవాళ్లకు ఉన్న అవకాశాల్లో స్త్రీలకు కేవలం 68 శాతం మాత్రమే ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. గతేడాది ఈ సంఖ్య 68.3శాతంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ వ్యాప్తంగా అన్నిరంగాల్లో మహిళలకు సమానత్వం రావాలంటే 83 ఏళ్లు పడుతుందని 2016లో అంచనా వేశారు. కానీ ఇప్పుడా వ్యత్యాసం మరింత పెరిగింది. మహిళల సమానత్వానికి కాస్త అటుఇటుగా వందేళ్లు పడుతుందని డబ్యూఈఎఫ్ నివేదిక చెబుతోంది.

అయితే, విద్య, ఆరోగ్యం విషయంలో మహిళల పరిస్థితి కాస్త బెటర్‌గానే ఉంది. కానీ ఆర్థిక, రాజకీయ విషయాల్లో మహిళల భాగస్వామ్యం ఆశించినంతగా మెరుగు పడలేదని తన నివేదికలో డబ్యూఈఎఫ్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఉద్యోగాల్లో సమానత్వం రావాలంటే మహిళలు 217 ఏళ్లు ఎదురుచూడాలట. అంటే మరో మూడు తరాలు మారాలన్న మాట. అప్పటికి కూడా పరిస్థితులు అనుకూలిస్తేనే. అలాగే స్త్రీ-పురుషుల జీతాల విషయంలోనూ విపరీతమైన వ్యత్యాసం ఉందని నివేదిక చెబుతోంది.

ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్ వంటి స్కాండినేవియా దేశాలు స్త్రీ-పురుష సమానత్వంలో ముందంజలో ఉన్నాయి. ఐస్‌లాండ్‌లో స్త్రీ-పురుషులకు దాదాపు సమాన అవకాశాలు ఉన్నాయి. అక్కడ 12 శాతం వ్యత్యాసం మాత్రమే ఉంది. నార్వే, ఫిన్‌లాండ్, స్వీడన్ టాప్ 5 దేశాల్లో నిలిచాయి. రువాండలో ప్రతీ ఐదుగురు ఎంపీల్లో ముగ్గులు మహిళలే ఉన్నారు.

నికరాగువా, స్లోవేనియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ టాప్ 10 ర్యాంకుల్లో నిలిచాయి.

మధ్య ప్రాచ్యం, ఉత్తరాఫ్రికాలోని మహిళలు ఎక్కువగా వివక్ష ఎదుర్కొంటున్నారు. సమానత్వం విషయంలో యెమన్ చాలా వెనకబడి ఉంది. అక్కడ 52 శాతం మాత్రమే స్త్రీ-పురుషుల మధ్య సమానత్వం ఉంది.

సమానత్వంలో భారత్ ఎక్కడుంది?

- స్త్రీ-పురుష సమానత్వం విషయంలో భారతదేశం 21 పాయింట్లు దిగజారి 108 స్థానానికి పడి పోయింది.

- పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్ కూడా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.

- మహిళలకు తక్కువ వేతనాలు, ఆర్థిక వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా డబ్యూఈఎఫ్ అంచనా వేసింది.

- 170 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక తయారు చేశారు.

- మహిళలకు గోవా సురక్షిత ప్రాంతమని, బిహార్‌లో స్త్రీలకు రక్షణ తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.

- మహిళా ఆరోగ్యం విషయంలో కేరళ టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, సిక్కిం, కర్ణాటక, ఏపీ, గోవా, మహారాష్ట్ర ఉన్నాయి.

- ఈ విషయంలో బిహార్ అట్టడుగు స్థానంలో ఉంది.

- విద్య, వైద్యం, ఆర్ధిక రంగాల్లో మొత్తంగా చూస్తే తెలంగాణ 11వ స్థానంలో, ఏపీ 12వ స్థానంలో నిలిచాయి.

ఫొటో సోర్స్, I&PR, Govt of AP

'ఆడపిల్ల చెబితే వినాలా'

ఈ రోజుల్లో కూడా మహిళలకు ఏ దేశంలోనూ సమానత్వం లేదని ఏపీ పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు రావడం లేదన్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని ఆమె గుర్తు చేసుకున్నారు. 'ఆడపిల్ల చెబితే వినాలా' అనే నిర్లక్ష్య ధోరణి అధికారులు, ఇతర నాయకుల్లో ఉండేదని, మహిళలంటే వారికి చిన్నచూపని అఖిల ప్రియ చెప్పారు.

ఏ రంగంలోనైనా మహిళలు ఎదగాలంటే మామూలుగా కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడాలని మంత్రి అఖిల ప్రియ అన్నారు. చట్టాలతో పరిస్థితి మారదని, ప్రజల మైండ్‌సెట్ మారాలని ఆమె సూచించారు. ప్రజలు మారితే సమానత్వం గురించి మాట్లాడే అవసరమే ఉండదని అఖిలప్రియ అన్నారు.

ఒకే పని చేసే స్త్రీ-పురుషుల వేతనాల్లోనూ వ్యత్యాసం ఉంటోందని డబ్యూఈఎఫ్ నివేదిక చెబుతోంది.

- వేతనాల విషయంలో మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని పేర్కొంది.

- మహిళలు చేసే ఇంటి పని, వంట పనికి జీతం ఇవ్వకపోవడం, ఆర్ధిక విషయాల్లో వారి భాగస్వామ్యం తగ్గడానికి కారణమని అంచనా వేస్తున్నారు.

మహిళల పనికి విలువ ఏది?

ఇప్పటికీ ఇంటి పని, పిల్లల పెంపకం బాధ్యత మహిళలదే అన్నట్లుగా చూస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని ప్రముఖ తెలుగు రచయిత్రి కుప్పిలి పద్మ బీబీసీతో అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమల్లోకి రావాలన్నారు.

ఆడవాళ్లు ఇంట్లో చేసే పనికి ఎవరూ విలువ కట్టడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆడ-మగ తేడా చూపించి ఉద్యోగాల్లో, పనుల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఆలోచన విధానం మారాలని, మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యార్థి దశ నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇతర దేశాల్లో ఉన్న పద్ధతులను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయాలని సూచించారు.

అయితే, కంపెనీల్లో అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో చాలా అరుదుగా మాత్రమే మహిళలు ఉంటారు. మగవాళ్ల ఆధిపత్యాన్నిఎదిరించి, అవకాశాలు అందిపుచ్చుకోవడం వారికి కష్టంగా మారుతోందని డబ్యూఈఎఫ్ చెబుతోంది.

మరోవైపు, మహిళలు అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకెళ్తున్నారని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. సమానత్వం కోసం వందేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని వుమెన్ బాడీ బిల్డర్ కిరణ్ దెంబ్లా అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని చోట్ల అసమానతలు ఉండొచ్చన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ కంటే బంగ్లాదేశ్ మెరుగు

  • స్త్రీ-పురుష సమానత్వంలో బంగ్లాదేశ్‌ పరిస్థితి కాస్త మెరుగు పడింది. ఈ దేశం 47వ స్థానంలో నిలిచింది.
  • మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌దే అగ్రస్థానం.
  • స్లోవేనియాలో స్త్రీ-పురుషుల వేతనాల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది.
  • అక్కడ 80.5శాతం సమాన వేతనాలు, అవకాశాలు అందుకుంటున్నారు.

96వ స్థానంలో అమెరికా

రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం విషయంలో అమెరికా గతంలో కంటే కాస్త వెనకబడింది. మహిళా రాజకీయ సాధికారత విషయంలో అమెరికా పదేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. ఈ విషయంలో అమెరికా 96వ స్థానంలో నిలిచింది. ట్రంప్ పాలనలో మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. వారి సంఖ్య 27శాతం మాత్రమేనని సమాచారా హక్కు ద్వారా బయటపడింది. మొత్తానికి అమెరికా నాలుగు స్థానాలు దిగిజారి 49 స్థానంతో సరిపెట్టుకుంది.

స్తీ-పురుష సమానత్వం విషయంలో బ్రిటన్‌ 5 స్థానాలు మెరుగుపడి 15వ స్థానం దక్కించుకుంది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమైంది. మహిళా పార్లమెంట్ సభ్యులు కూడ రికార్డు స్థాయిలో ఎన్నికయ్యారు.

అయితే, ఆర్థిక రంగంలో మహిళల భాగస్వామ్యం విషయంలో మాత్రం బ్రిటన్ కాస్త వెనకబడే ఉంది. ఆర్ధిక అసమానత్వం విషయంలో బ్రిటన్ 95వ స్థానం దక్కించుకుంది. మగవాళ్లతో పోలిస్తే 45 శాతం తక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)