వాట్సాప్, టెలిగ్రాంలపై నిషేధం దిశగా అఫ్గాన్ చర్యలు

Taliban special forces
ఫొటో క్యాప్షన్,

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు వాట్స్‌యాప్, టెలిగ్రాంలను విస్తృతంగా వాడుతున్నారు.

వాట్సాప్, టెలిగ్రాంలను 20 రోజుల పాటు నిలిపివేయాలంటూ అఫ్గానిస్తాన్ టెలికమ్యూనికేషన్ల నియంత్రణ సంస్థ కొద్దిరోజుల కిందట సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాసింది. భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.

అఫ్గానిస్తాన్‌లో ప్రధాన పత్రిక సంపాదకుడు ఒకరు దీనిపై స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తిరోగమన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.

''తాలిబాన్లు కానీ, ఇతర తిరుగుబాటుదారులు కానీ వాట్సాప్, టెలిగ్రాం వంటివి వినియోగిస్తున్నారని అనుకుంటే వారెవరో గుర్తించండి. అంతేకానీ, ఏకంగా మెసేజింగ్ సర్వీసులనే నిషేధిస్తాం అంటే కుదరదు. దేశం పురోగమన దశలో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు వద్దు'' అని ఆయనన్నారు.

ఈ వ్యవహారంపై అఫ్గాన్ టెలికం మంత్రి షాజాద్ అర్యోబీ ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కయిన వాక్ స్వాతంత్ర్యాన్ని హరించబోమని చెప్పారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్,

అఫ్గానిస్తాన్‌లో మెసేజింగ్ సర్వీసుల వాడకం భారీగా ఉంది.

నిషేధించినా సేవలు అందుతాయి

మరోవైపు అక్కడి సోషల్ మీడియా యూజర్లు, పౌర హక్కుల సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయి. అంతేకాదు, నిషేధం అమలు ప్రభుత్వానికి సాధ్యపడదని, వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ద్వారా చాలా సులభంగా మెసేజింగ్ సర్వీసులను పొందొచ్చని అంటున్నారు.

అఫ్గనిస్తాన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లను అక్కడి ప్రజలు, నాయకులే కాకుండా తాలిబాన్లూ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)