సౌదీ జైల్లో 11 మంది యువరాజులు

  • 5 నవంబర్ 2017
మొహమ్మెద్ బిన్ సల్మాన్ Image copyright AFP

సౌదీ యువరాజులు ఊచలు లెక్కపెడుతున్నారు. రాజులు ఊచలు లెక్కపెట్టడమా? అవును..

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది సౌదీ అరేబియా యువరాజులు అవినీతి ఆరోపణలతో కటకటాల పాలయ్యారు.

గతంలోని అవినీతి నిరోధక శాఖను యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ ప్రక్షాళన చేశారు.

పాత అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో కొత్త శాఖ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ఈ అరెస్టులు జరిగాయి.

అరెస్టయిన వారిలో 11 మంది యువరాజులతో పాటుగా ఇద్దరు ప్రస్తుత మంత్రులు, డజన్ల కొద్దీ మాజీ మంత్రులు ఉన్నారు.

అయితే వీరిని ఏ కేసుల్లో అరెస్టు చేశారన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు. కానీ గతంలోని కొన్ని కేసుల్లో తాజాగా మళ్లీ దర్యాప్తు ప్రారంభమైందని స్థానిక మీడియా సంస్థ అల్ - అరేబియా చెబుతోంది.

మొహమ్మద్ సల్మాన్ సౌదీ సింహాసనానికి వారసుడు. సౌదీ భావి చక్రవర్తి. ఇప్పటికే ఎన్నో సంస్కరణలతో సల్మాన్ దూసుకుపోతున్నారు. సౌదీపై పట్టు సాధించడంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని బీబీసీ ప్రతినిధి ఫ్రాంక్ గార్డ్‌నర్ తెలిపారు.

సల్మాన్ అంతటితో ఆగలేదు. సౌదీ జాతీయ భద్రత శాఖామంత్రి మితెబ్ బిన్ అబ్దుల్లాతో పాటుగా, నేవీ కమాండర్ అడ్మైరల్ అబ్దుల్లా బిన్ సుల్తాన్ బిన్ మొహెమ్మద్ అల్ - సుల్తాన్‌ను కూడా విధుల నుంచి తప్పించారు. కానీ వీరిని విధుల నుంచి తప్పించడానికి కారణాలు మాత్రం అధికారులు చెప్పడం లేదు.

Image copyright Reuters

మొహెమ్మద్ బిన్ గతంలో రక్షణ శాఖామంత్రిగా కూడా పనిచేశారని, సింహాసనాన్ని అధిష్టించబోయే తరుణంలో జాతీయ భద్రతపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని బీబీసీ ప్రతినిధి తెలిపారు.

జాతీయ భద్రత శాఖామంత్రి యువరాజు మితెబ్ బిన్ సింహాసనాన్ని అధిష్టించబోయే యువరాజుల రేసులో ఉన్నారు. గతంలో మొహమ్మద్ బిన్‌ సల్మాన్ కు గట్టి పోటీనే ఇచ్చారు కూడా.

‘మితవాద ఇస్లామ్’ తన సంస్కరణలకు పునాది అని మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నారు. అతి త్వరలోనే సౌదీలోని ఉగ్రవాద అవశేషాలను ఏరిపారేస్తానని రియద్ కాన్ఫరెన్స్‌లో ఈ భావి చక్రవర్తి ప్రతిజ్ఞ చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

మా ఇతర కథనాలు

సౌదీ మహిళలు ఇక స్టేడియానికి వెళ్లొచ్చు!

సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!

ఐసిస్ అధ్యక్షుడు అల్ బగ్ధాదీ బతికే ఉన్నాడా?

థాయ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు