పర్వాతారోహణంపై ప్రభుత్వాల ఆంక్షలు

ఉలురు
ఫొటో క్యాప్షన్,

2019 నుండి ఉలురు పర్వతాన్ని అధిరోహించడాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది

'ఉలురు' పర్వతం ఆస్ట్రేలియాలోనే అత్యంత ఎత్తైనది. స్థానిక ఆస్ట్రేలియన్లు ఈ పర్వతాన్ని పవిత్రమైందిగా భావిస్తారు. మరోవైపు ఈ పర్వతం ఎక్కడానికి చాలా మంది పర్వతారోహకులు ఆసక్తి చూపిస్తారు.

కానీ వీరి ఆశలపై ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నీళ్లుచల్లింది. 2019 నుండి ఉలురు పర్వతాన్ని అధిరోహించడాన్ని నిషేధించింది.

వన్యప్రాణి సంరక్షణ సంస్థల అంచనా ప్రకారం మనుషుల మనుగడ కారణంగా ప్రపంచంలోని 83 శాతం అడవులు, పర్వతాలు దెబ్బతింటున్నాయి. విపరీతమైన రద్దీ, ఇతర కార్యక్రమాల వల్ల హిమాలయ పర్వతాలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.

అరుదైన పర్వతాల పరిరక్షణ, ప్రజల మత విశ్వాసాల కారణంగా కొన్ని దేశాలు పర్వతాలపై నిషేధాంక్షలు విధించాయి. అలాంటి 5 పర్వతాల గురించి తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images

గాంగ్‌కర్ ప్యుఎన్సమ్, భూటాన్

ఈ పర్వతం ఎత్తు 7,570 మీటర్లు. హిమాలయ పర్వత శ్రేణిలో నేపాల్, భూటాన్ దేశాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. స్థానికుల మత విశ్వాసాలను కాపాడటం కోసం ఈ పర్వతం పైకి ఎవరూ ఎక్కరాదంటూ భూటాన్ ప్రభుత్వం 1994లో ఆదేశాలు జారీచేసింది. వాతావరణ కారణాల దృష్ట్యా 2003లో పర్వతారోహణను పూర్తిగా నిషేధించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1970లో ఓ పర్వతారోహకుడు ఈ పర్వతాన్ని ఎక్కుతూ మరణించాడు

షిప్రోఖ్, అమెరికా

అమెరికాలోని న్యూ మెక్సికో ప్రాంతంలో షిప్రోఖ్ మంచు పర్వతం ఉంది. ఈ పర్వతం ఎత్తు 2,188 మీటర్లు. 1970లో ఓ పర్వతారోహకుడు ఈ పర్వతాన్ని ఎక్కుతూ మరణించాడు. మరోవైపు 'నవజొ' అనే స్థానిక అమెరికన్ల మత విశ్వాసాలు, వారి సంస్కృతిని పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో, 1970లో ఈ పర్వతాన్ని నిషేధించారు. కానీ ఇప్పటికీ ఈ పర్వతాన్ని చాలా మంది రహస్యంగా అధిరోహిస్తూనే ఉన్నారు.

మౌంట్ ఓమిన్, జపాన్

జపాన్‌లోని ఈ పర్వతాన్ని మహిళలు మాత్రమే అధిరోహిస్తారు. కానీ ఈ పర్వతంపై నిషేధమున్నది కూడా మహిళల పైనే! జపాన్‌లోని షింతో మతస్థులు ఈ పర్వతాన్ని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. నెలసరి కారణాలతో మహిళలు ఈ పర్వతాన్ని అధిరోహించరాదన్నది అక్కడి ఓ ప్రాచీన ఆచారం. కానీ ప్రతిసంవత్సరమూ మహిళా ఉద్యమకారులు 1300 యేళ్ల నాటి నిబంధనను ఉల్లంఘిస్తూ పర్వతాన్ని అధిరోహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Public Domain

బాల్స్ పిరమిడ్, ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా పసిఫిక్ తీరం నుండి 787 కి.మీ.దూరంలో ఉన్న పురాతన లావా అవశేషాలే ఈ బాల్స్ పిరమిడ్. యునెస్కో 1986లో ఈ పర్వతాలను వారసత్వ సంపదగా గుర్తించింది. అయితే అదే సంవత్సరంలోనే ఈ పర్వతాలను అధిరోహించడాన్ని నిషేధించారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదమైంది.

పర్వతారోహకుల వల్ల ఆ ప్రాంతం కాలుష్యమవుతుండటంతో ఆ పర్వతాలపై ఉండే అరుదైన కీటకాలు అంతరించిపోతున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

2014లో ఆస్ట్రేలియా మిలియనీర్ డిక్ స్మిత్ పర్వతారోహకులకు ఓ ఛాలెంజ్ చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి ఈ పర్వతాన్ని అధిరోహించిన వారికి రెండు మార్లు ప్రపంచ పర్యటన కోసం ఫ్లైట్ టికెట్స్ ఇస్తానన్నారు. అంతే కాకుండా వారి తరఫున 3,900 డాలర్లు జరిమానా కూడా చెల్లిస్తానని ప్రకటించారు కూడా!

మౌంట్ బనాహా, ఫిలిప్పీన్స్

ఈ పర్వతాల ఎత్తు 2,170 మీటర్లు. ఈ లావా పర్వతాలను స్థానికులు పవిత్రమైనదిగా భావిస్తారు. 1994 వరకూ పర్వతారోహణం కొనసాగింది. కానీ, పర్యావరణవేత్తల సూచనల మేరకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిషేధాన్ని జారీ చేసింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)