ప్యారడైజ్ పేపర్స్: అపర కుబేరుల పన్ను స్వర్గం రహస్యాలు బట్టబయలు
- ప్యారడైజ్ పేపర్స్ రిపోర్టింగ్ టీమ్
- బీబీసీ పనోరమా

ఫొటో సోర్స్, EPA
బ్రిటిష్ రాణి ప్రైవేటు నగదు దాదాపు 10 మిలియన్ పౌండ్లు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈ లీక్ చెప్తోంది
బ్రిటిష్ రాణి ప్రైవేటు ఎస్టేట్ సహా కుబేరులు, శక్తిమంతులు పన్ను భారం లేని విదేశాల్లో రహస్యంగా భారీ మొత్తంలో పెట్టుబడులు ఎలా పెడుతున్నారో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల తాజా భారీ లీక్ బహిర్గతం చేసింది.
అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఒక రష్యా సంస్థలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారులోని వాణిజ్య మంత్రికి వాటా ఉన్నట్లు ఆ పత్రాలు చెప్తున్నాయి.
’ప్యారడైజ్ పేపర్స్‘ అని అభివర్ణిస్తున్న ఈ లీక్‌లో 1.34 కోట్ల పత్రాలు ఉన్నాయి. అందులోనూ.. విదేశీ పెట్టుబడుల్లో ఒక అగ్రగామి సంస్థకు సంబంధించిన పత్రాలు అత్యధికంగా ఉన్నాయి.
బీబీసీ పనోరమా సహా దాదాపు 100 మీడియా సంస్థలు ఈ పత్రాలను పరిశోధిస్తున్నాయి.
గత ఏడాది పనామా పేపర్స్ లీక్ తరహాలోనే ఈ పత్రాలను కూడా జర్మన్ వార్తాపత్రిక సూదాయిచె జాయ్‌టుంగ్ అందించింది. ఈ పరిశోధనను పర్యవేక్షించాలని ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)ని ఆ పత్రిక ఆహ్వానించింది.
ఈ సమాచారంలో వందలాది మంది వ్యక్తులు, సంస్థల పేర్లు ఉన్నాయి. వారిలో కొందరికి బ్రిటన్‌తో బలమైన సంబంధాలున్నాయి. ఈ సమాచారాన్ని వారం రోజుల పాటు విడతల వారీగా బహిర్గతం చేయనున్నారు. ఆదివారం కొన్ని వివరాలు విడుదలయ్యాయి.
రాజకీయవేత్తలు, బహుళజాతి సంస్థలు, సెలబ్రిటీలు, ధనికులు.. తమ డబ్బును పన్ను అధికారుల కంట పడకుండా ఉంచుతూ తమ లావాదేవీలను రహస్య తెర వెనుక దాచడానికి.. ట్రస్టులు, ఫౌండేషన్లు, షెల్ కంపెనీల సంక్లిష్ట నిర్మాణాలను ఎలా ఉపయోగిస్తారనే అంశం మీద ఈ కథనాలు దృష్టి కేంద్రీకరించాయి.
వీటిలో అత్యధిక భాగం లావాదేవీల్లో చట్టపరంగా ఎలాంటి తప్పూ కనిపించదు.
ఆదివారం విడుదల చేసిన ఇతర కీలక కథనాలివీ:
- కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కీలక సహాయకుడు ఒకరి పాత్ర ఈ విదేశీ పెట్టుబడుల్లో ఉన్నట్లు వెల్లడైంది. దీనివల్ల కెనడాకు లక్షలాది డాలర్ల పన్ను నష్టం వాటిల్లి ఉండవచ్చు. పన్ను స్వర్గాలను మూసివేస్తామని ప్రచారం చేసిన జస్టిన్‌కు ఇది ఇబ్బందికర పరిస్థితిని సృష్టించే అవకాశముంది.
- బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ మాజీ డిప్యూటీ చైర్మన్, పేరున్న దాత లార్డ్ ఆష్‌క్రాఫ్ట్.. తన విదేశీ పెట్టుబడుల నిర్వహణ విషయంలో నిబంధనలను విస్మరించి ఉండొచ్చు. ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉన్నపుడు బ్రిటన్‌లో శాశ్వత పన్ను నివాసిగా మారారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన తనకున్న విదేశంలో శాశ్వత నివాసి హోదాను కొనసాగించారని ఇతర పత్రాలు చెప్తున్నాయి. విదేశంలో శాశ్వత నివాసం హోదా ఉన్న వ్యక్తి విదేశీ ఆదాయం మీద బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఎవర్టన్ ఎఫ్‌సీలో ప్రధాన వాటాల నిధుల సమీకరణ మీద ఏవిధంగా ప్రశ్నలు తలెత్తాయి.
- ఇతర మీడియా సంస్థలు తమ ప్రాంతంపై ప్రభావం చూపే భిన్నమైన కథనాలను ప్రచురించవచ్చు.
బ్రిటిష్ రాణి పాత్ర ఏమిటి?
బ్రిటిష్ రాణికి చెందిన వ్యక్తిగత నగదు దాదాపు 85 కోట్ల రూపాయలు (కోటి బ్రిటిష్ పౌండ్లు) విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈ ప్యారడైజ్ పేపర్లు చెప్తున్నాయి.
బ్రిటిష్ రాణికి చెందిన 420 కోట్ల రూపాయల (50 కోట్ల పౌండ్లు) విలువైన ప్రైవేట్ ఎస్టేట్ తరఫున పెట్టుబడులను నిర్వహిస్తూ, ఆమెకు ఆదాయం అందించే సంస్థ దచీ ఆఫ్ ల్యాంకాస్టర్ ద్వారా కేమ్యాన్ ఐలాండ్స్, బెర్ముడాల్లో ఈ పెట్టుబడులు పెట్టినట్లు వివరిస్తున్నాయి.
ఈ పెట్టుబడుల్లో అక్రమం ఏమీ లేదు. రాణి పన్ను చెల్లించడం లేదన్న సూచనలూ లేవు. అయితే.. మహారాణి విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చా అన్న ప్రశ్నలు రావచ్చు.
పేదలను దోపిడీ చేస్తోందన్న ఆరోపణలున్న రెంట్-టు-బై (అద్దె ద్వారా కొనుగోలు) రిటైల్ సంస్థ బ్రైట్హౌస్లో స్వల్ప పెట్టుబడులు ఉన్నాయి. ఇటీవల.. దాదాపు 150 కోట్ల రూపాయలు (1.75 కోట్ల పౌండ్లు) పన్ను బకాయి పడి, 6,000 మంది ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చుతూ దివాళా తీసిన థ్రెషర్స్ చైన్ సంస్థల్లోనూ పెట్టుబడులు ఉన్నాయి.
ఫొటో సోర్స్, Alamy
రిటైల్ సంస్థ బ్రైట్హౌస్లో బ్రిటిష్ రాణి ప్రైవేటు ఎస్టేట్ పెట్టుబడులు స్వల్పంగా ఉన్నాయి
పెట్టుబడుల నిర్ణయం విషయంలో తన పాత్ర లేదని దచీ పేర్కొంది. అలాగే.. తన తరఫున పెట్టిన నిర్దిష్ట పెట్టుబడుల గురించి బ్రిటిష్ రాణికి తెలుసు అనడానికి ఎలాంటి ఆధారం లేదని కూడా ఆ సంస్థ చెప్పింది.
బ్రిటిష్ రాణి తన ఎస్టేట్ విషయంలో ’’చాలా ఆసక్తి’’ చూపుతారని.. ‘‘రాణి ప్రతిష్ఠ మీద ప్రతికూల ప్రభావం చూపగల తన చర్యలను నిరంతరం సమీక్షిస్తూ ఉంటా’’మని దచీ సంస్థ గతంలో పేర్కొంది.
ఉల్బర్ రాస్, ట్రంప్‌లకు ఇబ్బందులు?
1990ల్లో డొనాల్డ్ ట్రంప్ దివాలా తీయకుండా ఉండటానికి ఉల్బర్ రాస్ సాయం చేశారు. తర్వాత ఆయన ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా నియమితులయ్యారు.
అయితే.. రష్యా ఇంధన సంస్థకు చమురు, గ్యాస్ రవాణా చేస్తూ కోట్లాది డాలర్లు ఆర్జిస్తున్న ఒక షిప్పింగ్ కంపెనీలో రాస్ వాటా కొనసాగుతోందని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఆ ఇంధన సంస్థ వాటాదారుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడు ఒకరు. ఆ సంస్థకే చెందిన మరో ఇద్దరు వాటాదారుల మీద అమెరికా ఆంక్షలు ఉన్నాయి.
దీంతో.. డొనాల్డ్ ట్రంప్ బృందానికి గల రష్యా సంబంధాల మీద మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేలా ప్రయత్నించడం కోసం ట్రంప్‌తో రష్యా చేతులు కలిపిందని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ‘బూటకపు వార్తలు’ అని ట్రంప్ కొట్టివేశారు.
ఈ పత్రాల లీక్ ఎలా జరిగింది?
ఎటువంటి పన్నూ లేకుండా, లేదా అతి తక్కువ పన్ను రేటుతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా తన క్లయింట్లకు న్యాయ సేవలు అందించే ఆపిల్బి అనే సంస్థ నుంచి ఈ సమాచారం వచ్చింది. ఈ విదేశీ వాణిజ్య రంగపు శిఖరభాగాన గల ఈ సంస్థ బెర్ముడా కేంద్రంగా పనిచేస్తోంది.
ఈ సంస్థ పత్రాలతో పాటు.. కరీబియన్ దేశాల పరిధిలో గల కార్పొరేట్ రిజిస్ట్రేషన్ సంస్థల నుంచి సూదాయిచె జాయ్‌టుంగ్ ఈ పత్రాలను సంపాదించింది. కానీ ఎవరి ద్వారా, ఎలా సంపాదించిందో మాత్రం వెల్లడించలేదు.
విదేశీ పెట్టుబడుల్లో అక్రమాలు ఉన్నట్లు ఈ రంగానికి సంబంధించిన సమాచారం లీక్‌ల ద్వారా పలుమార్లు వెల్లడైందని.. కాబట్టి ప్రజాప్రయోజనం కోసం తాజా పత్రాలపై పరిశోధన చేస్తున్నామని మీడియా భాగస్వాములు చెప్తున్నారు.
ఈ పత్రాల లీక్ మీద ఆపిల్బి స్పందిస్తూ.. ’’మా వల్ల గానీ, మా క్లయింట్ల వల్ల గానీ ఏదైనా తప్పు చేశారనేందుకు ఏ ఆధారం లేదన్నది సంతృప్తినిస్తోంది. చట్టవ్యతిరేక ప్రవర్తనను మేం సహించం’’ అని పేర్కొంది.
విదేశీ పెట్టుబడులు అంటే నిజంగా ఏమిటి?
ఏవైనా సంస్థలు, వ్యక్తుల సొంత దేశపు నియమనిబంధనలు వర్తించని విదేశాలకు.. తక్కువ పన్ను రేట్ల ద్వారా ప్రయోజనాలు పొందడం కోసం ఆయా సంస్థలు, వ్యక్తులు తమ డబ్బు, ఆస్తులు, లాభాలను తరలించి పెట్టే పెట్టుబడులు.
ఈ ప్రాంతాలు సాధారణ పౌరుడికి ‘పన్ను స్వర్గాలు’గా సుపరిచితం. పారిశ్రామిక వర్గాలైతే గౌరవప్రదంగా ‘ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సెంటర్స్’ అని పిలుచుకుంటారు. అవి మామూలుగా సుస్థిరమైన దేశాలు. గోప్యత పాటిస్తాయి. ఆధారపడగల దేశాలుగా ఉంటాయి. ఎక్కువగా చిన్న దీవి దేశాలుంటాయి. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై అవి ఎంత బలంగా నిబంధనలు అమలు చేస్తాయనేదాంట్లో ఇలాంటి దేశాల మధ్య తేడాలుంటాయి.
ఇందులో బ్రిటన్ పాత్ర చాలా పెద్దది. అందుకు కారణం.. ఆ దేశానికి చెందిన విదేశీ భూభాగాలు, రాచరికం పరిధిలోని దేశాలు ‘ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సెంటర్స్’ కావడమే కాదు.. ఈ విదేశీ పెట్టుబడుల రంగంలో పనిచేసే చాలా మంది న్యాయవాదులు, అకౌంటెంట్లు, బ్యాంకర్లు లండన్ నగరంలో నివసించడం కూడా ఒక ప్రధాన కారణం.
అది అపర కుబేరుల వ్యవహారం కూడా. ‘‘విదేశీ పెట్టుబడులు ఒక శాతం మంది కోసం కాదు. అది .001 శాతం మంది కోసం’’ అని ‘క్యాపిటల్ వితౌట్ బోర్డర్స్: వెల్త్ మేనేజర్స్ అండ్ ద ఒన్ పర్సెంట్’ రచయిత బ్రూక్ హారింగ్టన్ చెప్తారు. ఈ విదేశీ పెట్టుబడులు పథకాలకు అవసరమైన ఫీజుల కోసమే 3.25 కోట్ల రూపాయలు (5 లక్షల డాలర్లు) విలువైన ఆస్తులు కూడా సరిపోవు అని ఆమె పేర్కొంటారు.
మన మీద ప్రభావం ఏమిటి? మనం పట్టించుకోవాలా?
ఇది చాలా భారీ మొత్తంలోని నగదు. విదేశాల్లో పది ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులు ఉన్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చెప్తోంది. అది.. బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాల స్థూల దేశీయోత్పత్తుల మొత్తంతో సమానం. ఇది కూడా చాలా పొదుపుగా వేసిన అంచనా కావచ్చు.
ఇది ముఖ్యంగా.. అక్రమాలకు, అసమానతలకు తావిచ్చే గోప్యతకు సంబంధించిన అంశమని విదేశీ పెట్టుబడుల విమర్శకులు అంటారు. దీనిని నిరోధించేందుకు ప్రభుత్వాల చర్యలు చాలా నెమ్మదిగా, అసమర్థంగా ఉంటాయని కూడా వారు చెప్తారు.
ధనికులు పన్ను ఎగవేస్తుంటే పేదలు పన్ను కడుతున్నారని బ్రూక్ హారింగ్టన్ చెప్తున్నారు: ‘‘ప్రభుత్వాలు పనిచేయడానికి కనీస మొత్తం అవసరం. ధనవంతుల ద్వారా, కార్పొరేట్ సంస్థల ద్వారా కోల్పోయిన మొత్తాన్ని వారు మన చర్మం వలిచి తీసుకుంటారు’’.
‘‘విదేశీ పెట్టుబడుల్లో ఏం జరుగుతోందో మనం చూడాల్సి ఉంది. ఈ విదేశీ పెట్టుబడుల వ్యవహారం రహస్యం కాకపోయినట్లయితే ఇందులో కొంత అసలు జరిగి ఉండేది కాదు.. ఇందులో పారదర్శకత అవసరం. ఇవి వెలుగులోకి రావాలి’’ అని బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మెగ్ హిల్లీయర్ ఈ ఉదంతం మీద పనోరమాతో పేర్కొన్నారు.
విదేశీ పెట్టుబడి కేంద్రాలు ఎలా సమర్థించుకుంటాయి?
అసలు తాము లేకపోతే ప్రభుత్వాలు వేసే పన్నుల మీద అసలు నియంత్రణే ఉండదని ఈ ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సెంటర్లు అంటాయి. తాము డబ్బు మూటలపై కూర్చోవట్లేదని.. ప్రపంచ మంతా డబ్బు పంపిణీ చేయడానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నామని అవి చెప్తాయి.
ఇతర దేశాల పన్నులను వసూలు చేసే పని తనది కాదని, ఆ సమస్యను ఆయా దేశాలే పరిష్కరించుకోవాలని.. బాబ్ రిచర్డ్స్ బెర్ముడా ఆర్థికమంత్రిగా ఉన్నపుడు పనోరమాతో పేర్కొన్నారు. ఆయనతో పాటు ఐల్ ఆఫ్ మ్యాన్ ముఖ్యమంత్రి హోవార్డ్ క్వాలేను కూడా పనోరమా గతంలో ఇంటర్వ్యూ చేసింది.
వారిద్దరూ.. అసలు తమ ప్రాంతాలను ‘పన్ను స్వర్గాలు’ అనడాన్నే వ్యతిరేకించారు. తమ దేశాల్లో నియంత్రణ చట్టాలు చక్కగా అమలవుతున్నాయని, అంతర్జాతీయ ఆర్థిక నివేదనల నిబంధనలను పూర్తిగా అమలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ ప్యారడైజ్ పేపర్స్ లీక్‌లో బ్రిటన్ రాచరిక పరిధిలోని దేశమైన ఐల్ ఆఫ్ మ్యాన్ పాత్ర చాలా ఉంది.
‘‘నేరం, అవినీతి, వివక్షా పీడన బాధితులకు అవినీతి ప్రభుత్వాల నుంచి భద్రత కల్పించడం ద్వారా ఈ ఓఎఫ్సీలు రక్షిస్తాయ’’ని ఆపిల్బి గతంలో స్వయంగా పేర్కొంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)