ప్యారడైజ్ పేపర్స్: కొనసాగుతున్న లీకుల పరంపర

ఫ్రెడరిక్, బాస్టియన్, ప్యారడైజ్ పేపర్స్, సూదాయిచె జాయ్‌టుంగ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

'పనామా పేపర్స్'లో ప్రముఖ పాత్ర వహించిన ఫ్రెడరిక్, బాస్టియన్

రహస్య పత్రాలను బహిర్గతం చేసే పరంపరలో తాజాగా ‘ప్యారడైజ్ పేపర్స్’‌ను విడుదల చేసారు. అనేక మంది ప్రముఖుల పన్నుభారం లేని దేశాల్లో అక్రమ పెట్టుబడులు పెడుతున్న వైనాన్ని, పన్నుల ఎగవేత వివరాలను ప్యారడైజ్ పేపర్స్ వెల్లడించాయి.

'ఆపిల్‌బై' అన్న ఒక న్యాయ వ్యవహారాల సంస్థ నుంచి ప్రధానంగా ఈ వివరాలను సేకరించారు. గత నాలుగేళ్లుగా వెల్లడవుతున్న 'లీక్‌'ల వివరాలు పరిశీలిస్తే..

పనామా పేపర్స్ 2016

2010లో విడుదలైన వికీలీక్స్ విడుదల చేసిన పత్రాల సైజు కన్నా పనామా పేపర్లు 1,500 రెట్లు ఎక్కువ.

జర్మన్ వార్తాపత్రిక 'సూదాయిచె జాయ్‌టుంగ్‌' 2015లో ఈ పత్రాలను విడుదల చేసింది. పనామా న్యాయసలహా సంస్థ 'మొసాక్ ఫొన్సెకా' నుంచి వీటిని సంపాదించారు. వీటిని అందజేసిన వారు తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

ఈ సమాచారం దాదాపు 2.6 టెరాబైట్లు ఉండడంతో సూదాయిచె జాయ్‌టుంగ్‌ 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్' (ఐసీఐజె) సహాయం కోరింది. దీనిలో బీబీసీ పనోరమాతో పాటు 100కు పైగా ఇతర వార్తా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఏడాదికి పైగా సాగిన పరిశోధన అనంతరం, ఐసీఐజే, దాని భాగస్వామ్య సంస్థలు 3 ఏప్రిల్, 2016న పనామా పేపర్స్‌ను విడుదల చేసాయి

ఫొటో క్యాప్షన్,

నవాజ్ షరీఫ్

ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు దగ్గరగా ఉన్నవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా అక్రమంగా పెట్టుబడులు పెట్టారని ఈ లీకుల్లో తేలింది. ఐస్‌ల్యాండ్, పాకిస్తాన్ ప్రధానులు ఈ ఆరోపణల్లో పీకల్లోతులో కూరుకుపోయారని బహిర్గతమైంది.

ఐస్‌ల్యాండ్ ప్రధాని రాజీనామా చేయగా, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు పదవీచ్యుతుడిని చేసింది.

పనామా పేపర్స్‌ ద్వారా సుమారు డజను మంది పదవిలో ఉన్న, మాజీ ప్రపంచ నేతలు, 120 మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, లెక్కకు మించి కోటీశ్వరులు, సెలబ్రిటీలు, క్రీడాకారుల పేర్లు వెల్లడయ్యాయి.

స్విస్ లీక్స్ 2015

ఐసీఐజే ఫిబ్రవరి, 2015లో రహస్య పత్రాల వివరాలను బహిర్గతం చేసింది.

దీని ద్వారా హెచ్‌ఎస్‌బీసీకి చెందిన సబ్సిడరీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ (స్విస్) రహస్య కార్యకలాపాలు వెల్లడయ్యాయి.

'ఆయుధ వ్యాపారులు, మూడో ప్రపంచ దేశాలకు చెందిన నియంతలు, గనుల నుంచి వజ్రాలను స్మగ్లింగ్ చేసేవారు, ఇతర అంతర్జాతీయ నేరస్తులు నుంచి హెచ్‌ఎస్‌బీసీ అక్రమంగా లాభపడింది' అని ఐసీఐజే బట్టబయలు చేసింది.

ఈజిప్టు మాజీ ప్రధాని హోస్నీ ముబారక్, ట్యూనీషియా మాజీ అధ్యక్షుడు బెన్ అలీ, సిరియా నేత బషర్ అల్ అసద్‌లకు దగ్గరగా ఉన్న వారి పేర్లు సైతం బహిర్గతమయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

హెర్వ్ ఫాల్సియాని

సమాచారాన్ని ఎవరు లీక్ చేసారు?

ఫ్రెంచ్-ఇటాలియన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హెర్వ్ ఫాల్సియాని మొదట ఆ సమాచారాన్ని ఐసీఐజెకు అందజేసాడు.

2008 నుంచి అతను హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాంక్ (స్విస్)కు చెందిన సమాచారాన్ని ఫ్రెంచ్ అధికారులకు అందజేయగా, వారు దానిని సంబంధిత ప్రభుత్వాలకు అందజేసారు.

లక్జెంబర్గ్ లీక్స్ 2014

ఈ ఐసీఐజే రహస్య పత్రాలను నవంబర్, 2014లో విడుదల చేసారు.

ప్రైస్‌వాటర్‌ కూపర్స్ ఫ్రొఫెషనల్ సర్వీస్ కంపెనీ ద్వారా అనేక బహుళ జాతి కంపెనీలు లక్జెంబర్గ్‌లో 2002-2010 మధ్యకాలంలో తమకు అనుకూలమైన తీర్పుల ద్వారా ఎలా లబ్ధి చెందాయో వీటి ద్వారా వెల్లడైంది.

తమ లాభాలను లక్జెంబర్గ్‌కు తరలించడం ద్వారా ఒకటి కన్నా తక్కువ శాతం పన్ను రేట్ల ద్వారా బహుళ జాతి కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాన్ని పొందాయని ఐసీఐజే వెల్లడించింది. లక్జెంబర్గ్‌లోని ఒకే ఇల్లు 1,600 కంపెనీల అడ్రస్‌గా ఉందని ఐసీఐజె తెలిపింది.

ఈ లీకు ద్వారా పెప్సీ, ఐకియా, ఏఐజీ, దోయెచ్ బ్యాంక్‌, వాల్ట్ డిస్నీ కంపెనీ, స్కైప్‌ల పేర్లు వెల్లడయ్యాయి. అయితే తామెలాంటి అక్రమాలకూ పాల్పడలేదని ఆ సంస్థలు వివరణ ఇచ్చాయి.

మా ఇతర కథనాలు:

సమాచారాన్ని లీక్ చేసిందెవరు?

ప్రైస్‌వాటర్‌ కూపర్స్ మాజీ ఉద్యోగి అంటోన్ డెల్‌టోర్. మరో ఉద్యోగి రాఫెల్ హాలెట్ అతనికి సహకరించారు.

ప్రైస్‌వాటర్‌ కూపర్స్ ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు, మరో జర్నలిస్ట్ ఎడ్వర్డ్ పెరీన్‌లపై కేసులు నమోదు చేసారు.

డెల్‌టోర్, హాలెట్‌లకు జరిమానాలు విధించగా, పెరీన్‌ నిర్దోషిగా విడుదలయ్యాడు.

ఫొటో సోర్స్, AFP/ Getty Images

ఫొటో క్యాప్షన్,

లీకు వీరులు (కుడి నుంచి ఎడమకు): ఎడ్వర్డ్ పెరీన్‌, రాఫెల్ హాలెట్, అంటోన్ డెల్‌టోర్

ఆఫ్‌షోర్ లీక్స్ 2013

2.5 మిలియన్ల రహస్య పత్రాలను ఏప్రిల్, 2013లో విడుదల చేసారు.

బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్‌లో నల్లధనాన్ని దాచుకున్న 1,20,000కు పైగా కంపెనీలు, ట్రస్టుల వివరాలు బహిర్గతం చేసారు.

ఈ లీకు ద్వారా రష్యా, చైనా, అజర్‌బైజాన్, కెనడా, థాయ్‌లాండ్, మంగోలియా, పాకిస్తాన్ నేతల పేర్లు వెల్లడయ్యాయి.

అయితే బయటపడిన వివరాల ప్రకారం అవన్నీ అవినీతి చర్యలే కానక్కరలేదని ఐసీఐజే పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

ఆపిల్‌బై సంస్థ ఉన్న బెర్ముడా

ప్యారడైజ్ పేపర్స్

‘ఆపిల్‌బై’ అన్న న్యాయవ్యవహారాల సంస్థ నుంచి వెల్లడైన పత్రాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. పన్నుల స్వర్గధామంగా పేర్కొనే 19 ప్రాంతాలలో నల్లధనాన్ని దాచుకున్న రాజకీయవేత్తలు, సెలిబ్రిటీలు, కార్పొరేట్ ప్రముఖుల పేర్లను దీనిలో పేర్కొన్నారు.

1.34 కోట్ల పత్రాలు మొదట జర్మన్ వార్తాపత్రిక సూదాయిచె జాయ్‌టుంగ్‌కు అందగా, వాటిని ఆ పత్రిక ఐసీఐజేకు అందజేసింది.

అయితే ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ప్రస్తుతం బీబీసీ వద్ద ఎలాంటి సమాచారం లేదు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)