ప్యారడైజ్‌ పేపర్స్‌లో బీజేపీ మంత్రి, ఎంపీల పేర్లు

జగన్

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్,

ప్యారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరు

పనామా పేపర్స్‌ లీకైన 18 నెలల తర్వాత ఇప్పుడు 'పారడైజ్ పేపర్స్' ద్వారా మరోసారి అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటికొచ్చాయి.

జర్మనీ పత్రిక 'సూదాయిచె జాయ్‌టుంగ్' సంపాదించిన డాక్యుమెంట్లను 'ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్' ఆధ్వర్యంలో 96 వార్తా సంస్థల ప్రతినిధులు అధ్యయనం చేశారు. ఇందులో బీబీసీతో పాటు మనదేశానికి చెందిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉంది.

నాడు 'పనామా పేపర్స్' నేడు 'ప్యారడైజ్ పేపర్స్'

 • 'ప్యారడైజ్ పేపర్స్'గా పిలుస్తున్న సుమారు కోటి 34 లక్షల డాక్యుమెంట్లు లీకయ్యాయి.
 • బెర్ముడాకు చెందిన 'ఆపిల్‌బీ', సింగపూర్‌కు చెందిన 'ఏసియా సిటీ' ఆర్థిక సంస్థల పత్రాలు బయటికొచ్చాయి.
 • 180 దేశాలకు చెందిన కంపెనీల ఆర్థిక లావాదేవీల సమాచారం ప్యారడైజ్ పేపర్లలో ఉంది.
 • 180 దేశాల జాబితాలో భారత దేశం 19వ స్థానంలో ఉంది. మొత్తం 714 మంది భారతీయుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ పత్రాలను అధ్యయనం చేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మనదేశానికి సంబంధించి పలు వార్తా కథనాలు ప్రచురించింది. వాటి ప్రకారం..

భారత్‌కు చెందిన నందలాల్ ఖేమ్కా స్థాపించిన 'సన్ గ్రూప్' సంస్థ 'ఆపిల్‌బీ'కి అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద క్లయింట్. ఇది 118 విదేశీ కంపెనీల పేర్లతో వ్యాపారం చేస్తోంది.

వీడియో క్యాప్షన్,

ప్యారడైజ్ పేపర్స్: డబ్బు ఇలా దాచేస్తారు!

'ప్యారడైజ్ పేపర్స్'లో 714 మంది భారతీయులు

'ప్యారడైజ్ పేపర్స్'లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పేరు ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఎమ్మార్ ఎంజీఎఫ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలు ప్యారడైజ్ పేపర్లలో బయటికొచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర వైమానిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా

సిన్హా పేరు 'ప్యారడైజ్ పేపర్స్' ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రచురించింది.

 • జయంత్ సిన్హా రాజకీయాల్లోకి రాకముందు 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌' భారతదేశ ఎండీగా పనిచేశారు.
 • 'ఆపిల్‌బీ' పత్రాల ప్రకారం జయంత్ సిన్హా 'డి.లైట్ డిజైన్‌' కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
 • అమెరికా కంపెనీ 'డి.లైట్ డిజైన్‌'లో 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌' పెట్టుబడి పెట్టింది.
 • 'డి.లైట్ డిజైన్‌'కు కేమన్ ఐలాండ్‌లో ఒక అనుబంధ సంస్థ ఉంది.
 • దాని నుంచి రూ.19కోట్ల 41లక్షలు అప్పు తీసుకుంది.
 • 'డి.లైట్ డిజైన్‌'కు సిన్హా డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే 2012 డిసెంబర్ 31న ఈ ఒప్పందం జరిగిందని 'ఆపిల్‌బీ' పత్రాలు వెల్లడిస్తున్నాయి.
 • ఒప్పందంపై మరో ఐదుగురితో కలిసి సిన్హా సంతకం చేసినట్లు 'ప్యారడైజ్ పేపర్స్' పేర్కొన్నాయి.
 • 2009లో 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌'లో చేరిన సిన్హా 2013 డిసెంబర్‌లో రాజీనామా చేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లోగానీ, 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రధాని కార్యాలయానికి గానీ ఆ విషయాన్ని చెప్పలేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది.

'ప్యారడైజ్ పేపర్స్‌పై జయంత్ సిన్హా స్పందన

తాను 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌' ప్రతినిధిగానే ఆ లావాదేవీలు నిర్వహించినట్లు జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఎలాంటి వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోలేదని ట్వీట్ చేశారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందే డి.లైట్ బోర్డ్‌కు రాజీనామా చేశానని వివరించారు.

డి.లైట్ డిజైన్‌తో పాటు ఎన్నో సంస్థల్లో 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌' పెట్టుబడులు పెట్టిందని, ఆ వివరాలు ఆ కంపెనీనే వెల్లడిస్తుందని సిన్హా చెప్పారు.

2004లో డి లైట్ డిజైన్‌ను ఈబే వ్యవస్థాపకుడు పెరీ ఒమిడర్ స్థాపించారు. 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌' ఇందులో పెట్టుబడి పెట్టింది.

అయితే, జయంత్ సిన్హా తమ కంపెనీలో భాగస్వామి, ఎండీ, కన్సల్టెంట్ అని 'ఒమిడ్‌యార్ నెట్‌వర్క్‌' ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వివరించింది. అయితే, తమ పెట్టుబడులు, ప్రయోజానాలపై వివరాలు ఇవ్వలేమని తెలిపింది.

ఫొటో సోర్స్, @RKSinhaBJP

బీజేపీ ఎంపీ రవీంద్ర కిశోర్ సిన్హా

రాజ్యసభ ఎంపీల్లో రవీంద్ర కిశోర్ సిన్హా అత్యంత సంపన్నుడన్న పేరుంది. ఆయన బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం..

 • మాజీ జర్నలిస్టు అయిన రవీంద్ర ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసెస్‌-ఎస్ఐఎస్‌ను స్థాపించారు.
 • ఈ కంపెనీకి విదేశాల్లో రెండు సంస్థలు ఉన్నాయి.
 • మెల్టా రికార్డుల ప్రకారం 2008లో ఎస్ఐఎస్‌కు అనుబంధ కంపెనీగా ఎస్ఐఎస్ ఏసియా పసిఫిక్ హోల్డింగ్స్ లిమిటెడ్-ఎస్ఏపీహెచ్ఎల్ ఏర్పాటైంది. సిన్హా భార్య దీనికి డైరెక్టర్‌గా ఉన్నారు.
 • బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోనూ ఎస్ఐఎస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ ఉంది. దీంట్లో కూడా సిన్హాకు షేర్ ఉంది.
 • రికార్డుల ప్రకారం 2008 అక్టోబర్ 13న 1499 ఎస్ఏపీహెచ్ఎల్ షేర్లు ఒక్కోటి ఒక యూరో చొప్పున పీసీఎల్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్‌కు బదిలీ చేశారు.

డెవిడ్ మారినెల్లి తరఫున ఈ షేర్లు రవింద్ర కిశోర్ సిన్హాకు బదిలీ అయ్యాయి. అయితే, ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి సిన్హా చెప్పలేదు. అయితే, ఇవి ఈ కంపెనీలన్నీ ఎస్ఐఎస్ అనుబంధ సంస్థలని, తనకు వ్యక్తిగత ఆసక్తి లేదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను మౌన వ్రతంలో ఉన్నానని, నాలుగు రోజుల తర్వాత మాట్లాడతానని మీడియాకు వివరించారు.

'ప్యారడైజ్ పేపర్స్'లో 'ఫోర్టీస్' బాస్

'ఆపిల్‌బీ' లావాదేవీల్లో అనేక అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సింగపూర్‌కు చెందిన 'బయోసెన్సార్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్' అనే స్టెంట్స్ తయారు చేసే కంపెనీ 'ఫోర్టీస్-ఎస్కార్ట్స్' చైర్మన్ డాక్టర్ అశోక్ సేత్‌కు ఆ సంస్థ షేర్లు కేటాయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రచురించింది.

తర్వాత డాక్టర్ అశోక్ సేత్ తన పేషంట్లకు ఆ కంపెనీ స్టెంట్లనే రాశారని, ఆ షేర్లను అమ్మి ఆయన సొమ్ము చేసుకున్నారన్నది ఆ వార్త సంస్థ కథనం. డాక్టర్ అశోక్ సేత్‌ గతంలో పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

 • 'బయోసెన్సార్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్' షేర్లను మూడేళ్ల తర్వాత 54 లక్షల లాభానికి విక్రయించినట్లు డాక్టర్ సేత్‌ చెప్పినట్లు ఆ పత్రిక ప్రచురించింది.
 • 2004 అక్టోబర్‌లోనే 5000 షేర్లు కొనేందుకు తనకు ఆఫర్ వచ్చినా తీసుకోలేదని, తొమ్మిదేళ్ల తర్వాత ఏప్రిల్ 2013లో 58లక్షల 26వేల 150 రూపాయలకు వాటిని కొన్నట్లు ఆయన తెలిపారు.
 • మూడేళ్ల తర్వాత 54 లక్షల లాభానికి వాటిని విక్రయించినట్లు, ఆదాయ పన్ను రిటర్న్స్ లో కూడా ఆ వివరాలు పొందుపర్చినట్లు డాక్టర్ సేత్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

అంతుచిక్కని విజయ మాల్యా రహస్యాలు!

లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా 2013లో తన 'యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్-యూఎస్‌ఎల్' కంపెనీని 'డియాజియో' సంస్థకు విక్రయించారు. ఆ తర్వాత 'డియాజియో' లండన్‌కు చెందిన న్యాయ సంస్థ 'లింక్‌లెటర్స్ ఎల్ఎల్‌పీ'ని సంప్రదించింది. గజిబిజిగా ఉన్న మాల్యా కంపెనీ స్ట్రక్చర్‌ను పునర్ వ్యవస్థీకరణ చేయమని కోరింది.

 • యూఎస్‌ఎల్ హోల్డింగ్ లిమిటెడ్ (బీవీఐ) నుంచి నిధులను వర్జిన్ ఐలాండ్‌లోని ఒక కంపెనీకి, బ్రిటన్‌లోని మరో 3 అనుబంధ కంపెనీలకు తరలించేందుకే ఈ పునర్ వ్యవస్తీకరణ చేపట్టినట్లు రికార్డులు చెప్తున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. యూఎస్‌ఎల్ హోల్డింగ్స్ (యూకే) లిమిటెడ్, యునైటెడ్ స్పిరిట్స్ (యూకే), యునైటెడ్ స్పిరిట్స్ (గ్రేట్ బ్రిటన్) లిమిటెడ్ కంపెనీలకు నిధులు తరలించినట్లు 'ప్యారడైజ్ పేపర్స్'లో ఉంది.
 • మాల్యా కంపెనీ పునర్ వ్యవస్తీకరణపై లింక్ లెటర్స్‌తో ఆపిల్‌బీ కలిసి పనిచేసింది.
 • ఆపిల్‌బీ పత్రాల ప్రకారం ఆ 4 అనుబంధ కంపెనీలకు ఏడేళ్లలో 9వేల710 కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చింది.
 • తర్వాత రూ.9వేల710 కోట్ల అప్పును 'డియాజియో' మాఫీ చేసింది.
 • అంతేకాదు. మారిషస్‌లో ఉన్న మాల్యా సొంత కంపెనీ వాట్సన్ లిమిటెడ్‌ను, దానికున్న 37కోట్ల 53లక్షల రూపాయల అప్పులను కూడా యూఎస్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీలో కలిపేసింది.
 • దీంతో మాల్యాకు 1225కోట్ల లబ్ధి చేకూరిందని బాంబే స్టాక్ ఎక్చేంజీకి ఇచ్చిన నివేదికలో డియాజియో పేర్కొంది.
 • అయితే, 10వేల కోట్ల కంటే ఎక్కువే ప్రయోజనం కలిగిందని ఆపిల్‌బీ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
 • ‌అనుబంధ కంపెనీలకు ఆదాయం వచ్చే మార్గంలేకపోవడం వల్లే అప్పులను మాఫీ చేసినట్లు డియాజియో ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

'ప్యారడైజ్ పేపర్స్'లో నీరా రాడియా

మాల్టాలో నీరా రాడియాకు రెండు కంపెనీలు ఉన్నట్లు 'ప్యారడైజ్ పేపర్స్‌లో బయటపడిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

 • 2012 ఏప్రిల్‌లో మాల్టాలో ఏర్పాటు చేసిన 'సూయజ్ లా వాల్లేట్ కంపెనీ'
 • 2011లో ఏర్పాటైన 'పెగాసస్ ఇంటర్నేషనల్ అడ్వైజర్స్ లిమిటెడ్‌'కు డైరెక్టర్‌గా ఆమె ఉన్నారు.
 • అయితే, 2014 ఫిబ్రవరి, ఆగస్టుల్లో ఈ రెండు కంపెనీలకు ఆమె రాజీనామా చేశారు.
 • అప్పుడే రాడియాకు చెందిన వైష్ణవి గ్రూప్ కంపెనీలపై దర్యాప్తునకు పర్మిషన్ ఇవ్వాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కార్పొరెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు. భారతీయ కంపెనీల చట్టాన్ని నీరా రాడియా ఉల్లంఘించారని ఆరోపించారు.

గతంలో పనామా పేపర్స్‌లో కూడా నీరా రాడియా పేరు వచ్చింది. 1994లో క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్ అనే కంపెనీని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఏర్పాటు చేసినట్లు పనామా పేపర్స్‌ పేర్కొన్నాయి.

అయితే, మార్కెట్ స్పెషలిస్ట్‌గా మరిన్ని దేశాలకు సేవలను విస్తరించేందుకు 2011లో మాల్టా కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్‌ను నీరా రాడియా అంగీకరించారని ఆమె తరఫు ప్రతినిధి చెప్పారు. అయితే అనారోగ్యం కారణంగా వాటి నుంచి తప్పుకున్నట్లు వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగా అపర కుబేరుల పన్ను ఎగవేత రహస్యాలను బట్టబయలు చేసిన ప్యారడైజ్‌ పేపర్స్‌లో 180 దేశాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఎక్కువ మంది పేర్లున్న దేశాల పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది.

అమితాబ్ బచ్చన్

బెర్ముడాకు చెందిన ఓ కంపెనీని అమితాబ్ బచ్చన్ కొన్నట్లు ప్యారడైజ్ పేపర్స్ లో బయటపడింది. సరళీకృత చెల్లింపుల పథకం కింద 2004కి ముందు ఆయనీ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు 'ప్యారడైజ్ పేపర్స్'లో బయటపడింది.

'ప్యారడైజ్ పేపర్స్'లో కార్పొరెట్ కంపెనీల ప్రస్తావన

జీఎంఆర్ గ్రూప్‌నకు సంబంధించిన వేలాది పత్రాలు బయటపడ్డాయి. గతేడాది జీఎంఆర్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. 'ఆపిల్‌బీ' ఏర్పాటు చేసిన 28 విదేశీ కంపెనీలతో మనదేశంలో పన్ను ఎగ్గొట్టడానికి జీఎంఆర్ గ్రూప్ ప్రయత్నించిందన్న విషయం బయటపడింది.

జిందాల్ స్టీల్, అపోలో టైర్స్, హవెల్స్, హిందుజాస్, ఎమ్మార్ ఎంజీఎఫ్, వీడియోకాన్, ది హిరనందిని గ్రూప్, డీఎస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి.

'ఆపిల్‌బీ' అసలు సంగతులేంటి?

 • ఇది బెర్ముడాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ.
 • సుమారు 119 ఏళ్లుగా పనిచేస్తోంది.
 • ఆదాయ పన్నులకు సంబంధించి ఎలాంటి సలహాలు ఇవ్వదు.
 • కానీ న్యాయవాదులు, అకౌంటెట్లు, బ్యాంకులు, విదేశాల్లో కంపెనీలు పెట్టిన వాళ్లు ఇందులో కస్టమర్లుగా ఉన్నారు.

పన్ను ఎగ్గొట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, థర్డ్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు, విమానాలు, షిప్పులు కొనేందుకు, తక్కువ పన్ను కట్టి, ఎక్కువ లబ్ధి పొందాలని భావించే వాళ్లు ఆపిల్ బీని ఆశ్రయిస్తారని చెప్పుకుంటారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)