ఇజ్రాయెల్ వివాదం: బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ రాజీనామా

  • 9 నవంబర్ 2017
ప్రీతి పటేల్ Image copyright PA

భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ ఇజ్రాయెల్‌లో చేసిన వ్యక్తిగత పర్యటనపై వివాదం చెలరేగడంతో తన పదవికి రాజీనామా చేశారు.

ఆమె ఆగస్టులో కుటుంబ సమేతంగా ఇజ్రాయెల్‌లో సెలవులు గడిపేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహూతో పాటు పలు ఇజ్రాయెలీ అధికారులను అనధికారికంగా కలిశారు.

దీనికి సంబంధించి ఆమె బ్రిటిష్ ప్రభుత్వానికి గానీ, ఇజ్రాయెల్‌లో ఉన్న బ్రిటిష్ దౌత్యకార్యాలయానికి గానీ ఎలాంటి సమాచారం అందించలేదు.

గత సోమవారమే ఆమె దీనికి సంబంధించి క్షమాపణలు కోరారు. అయినా వివాదం కొనసాగడంతో ఆమె తన ఆఫ్రికా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు.

ఇదీప్రీతి పటేల్ రాజకీయప్రస్థానం

Image copyright EPA

45 ఏళ్ల ప్రీతి పటేల్ బ్రిటన్ అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు. ఆ పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

ప్రభుత్వంలో ఆమె పలు కీలక పదవుల్లో పనిచేశారు. 2016 జూన్‌లో ఆమెకు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి పదవి దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందే ఆర్థిక సహాయానికి సంబంధించి వివిధ బాధ్యతలను ఈ శాఖ నిర్వర్తిస్తుంది.

ఆమెకు యూరోపియన్ యూనియన్ విమర్శకురాలిగా కూడా పేరుంది. స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా ఆమె ఓటు వేశారు. ధూమపానంపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహించారు. ఆమె ఇజ్రాయెల్‌కు ఎప్పటి నుంచో మద్దతుదారుగా ఉన్నారు.

2010లో ఆమె అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ ప్రచారానికి బలమైన మద్దతుదారుగా పేరున్న ఆమె 2014లో ట్రెజరీ మంత్రిగా ఉన్నారు. 2015లో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆమె ఉపాధి మంత్రి పదవిని చేపట్టారు.

ఉగాండా దేశం నుంచి లండన్‌కు వలస వెళ్లిన గుజరాతీ కుటుంబంలో పుట్టిన ప్రీతి పటేల్ వాట్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ ఫర్ గర్ల్స్ లో చదివారు. ఆమె కీలే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ లో కూడా చదివారు. కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా పని చేశారు. 1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్ స్మిత్ నేతృత్వంలో రెఫరెండం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. బ్రిటన్‌లో యూరోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించే ఏకైక పార్టీ ఇదే.

కన్జర్వేటివ్ పార్టీలో విలియం హెగ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరి 1997 నుంచి 2000 వరకూ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తరువాత ఆమె మద్యాన్ని తయారు చేసే ప్రముఖ బ్రాండ్ డయాజియోలో కూడా పనిచేశారు.

2005లో ఆమె నాటింఘం నుంచి ఎన్నికల్లో పాల్గొని పరాజయం పాలయ్యారు. 2010లో విట్‌హెమ్ నుంచి గెలుపొందారు.

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శం అని ఆమె చెబుతుంటారు.

ఎందుకీ వివాదం?

ఆగస్టులో ఇజ్రాయెల్‌లో తన కుటుంబంతో సెలవులు గడిపేందుకు వెళ్లిన ఆమె అక్కడి అధికారులను, వ్యాపారులను కలిశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయని బీబీసీ ప్రతినిథి బితే సప్తావ్ తెలిపారు.

ఆమె ఇజ్రాయెల్‌లో అక్కడి ప్రతిపక్ష నేతను కూడా కలిశారు. ఎన్నో సంస్థలకు కూడా వెళ్లారు అధికారిక బాధ్యతలకు సంబంధించి కూడా చర్చించారు.

ప్రభుత్వంలో ఉన్న మంత్రులు తమ విదేశీ పర్యటనలో వారి కార్యకలాపాలకు సంబంధించి సమాచారం ప్రభుత్వానికి అందజేయాలి.

Image copyright Pablo Kaplan

ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత , బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు అందే ఆర్థిక సహాయ బడ్జెట్ నుంచి ఎంతో కొంత ఇజ్రాయిల్ సైన్యానికి కూడా ఇవ్వాలని ఆమె సలహా ఇచ్చారు.

ప్రీతి పటేల్ సలహా బ్రిటన్ అధికారులకు నచ్చలేదు. ఎందుకంటే సిరియాలోని గోలాన్ హైట్స్ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని బ్రిటన్ అంగీకరించలేదు. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.

ప్రీతి పటేల్ స్పందన

ఇజ్రాయెల్ అధికారులతో సమావేశానికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించనందుకు ఆమె క్షమాపణలు కూడా కోరారు. బ్రిటన్ విదేశీ కార్యదర్శి బోరిస్ జాన్సన్‌కు తన విదేశీ పర్యటనకు సంబంధించి వివరాలు తెలుసనే సంకేతాలు కూడా ఇచ్చారు.

Image copyright PA

అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆమె క్షమాపణలపై సానుకూలంగా స్పందించింది. ప్రధానమంత్రి ఈ విషయంపై ప్రీతి పటేల్‌ను ఆమె విధులపై దృష్టి పెట్టమని తెలిపారని పేర్కొంది. బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఆమెను సమర్థిస్తూ ఆమె పర్యటనతో బ్రిటన్ విదేశాంగ విధానంలో ఎటువంటి మార్పు రాబోదని స్పష్టం చేశారు.

కానీ బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రీతి పటేల్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ఆమెపై విచారణ జరిపించాలని, ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ప్రీతి పటేల్ నిబంధనలను ఉల్లంఘించారని లేబర్ పార్టీ ఆరోపణలు గుప్పించింది.

సోషల్ మీడియాలో కూడా ప్రీతి పటేల్ విమర్శలు ఎదుర్కొన్నారు. కుటుంబ సమేతంగా సెలవులపై ఇతర దేశాలకు వెళ్లి అక్కడి అధికారులతో సమావేశమవుతారా అని నెటిజన్స్ ప్రశ్నించారు.

చివరికి ఏమయ్యింది?

బుధవారం వరకూ ఈ వివాదం మరింత తీవ్రం కావడంతో టెరీసా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సెప్టెంబర్‌లో కూడా ఆమె ఇలాంటి రెండు సమావేశాల్లో పాల్గొన్నారని ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె ఇజ్రాయెల్ ప్రజా భద్రతా మంత్రి, అక్కడి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో సమావేశమయ్యారు.

న్యూయార్క్‌లో జరిగిన సమావేశం గురించి సమాచారం బ్రిటన్ ప్రభుత్వానికి తెలుసనీ, కానీ బ్రిటన్ ప్రభుత్వం ఈ సమావేశానికి సంబంధించి వివరాలు బయటపెట్టొద్దని ప్రీతి పటేల్‌కు సలహా ఇచ్చిందని జ్యూయిష్ క్రానికల్ అనే పత్రిక వెల్లడించడంతో బ్రిటన్ ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. జ్యూయిష్ క్రానికల్ కథనాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది.

ఈ కొత్త వివాదంతో ప్రీతి పటేల్‌ను ప్రభుత్వం నుంచి తప్పించాలని బ్రిటన్ ప్రధానమంత్రి టెరీసా మేపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ వివరాలన్నీ బయటకు రావడంతో ఉగాండా పర్యటనలో ఉన్న ప్రీతి పటేల్ తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని బ్రిటన్‌ తిరిగొచ్చేశారు. బ్రిటన్ ప్రధానమంత్రి టెరీసా మేతో సమావేశం తర్వాత రాజీనామా చేశారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)