సౌదీ అరేబియా: మూడేళ్లలో 100 బిలియన్ డాలర్ల కుంభకోణం

  • 10 నవంబర్ 2017
సౌదీ అరేబియా Image copyright Reuters

సౌదీలో గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 6.5 లక్షల కోట్లు)కుంభకోణం జరిగిందని సౌదీ అరేబియా అటార్నీ జనరల్ సౌద్ అల్ ముజీబ్ వెల్లడించారు.

మూడేళ్ల దర్యాప్తు తరువాత గత శనివారం రాత్రి నుంచి అవినీతి నిరోధక చర్యలలో భాగంగా ఇప్పటివరకూ 201 మందిని విచారించామని షేఖ్ సౌద్ అల్ ముజీబ్ తెలిపారు.

ఈ 201 మందిలో రాజకుటుంబీకులు, మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారి పేర్లను మాత్రం అటార్నీ జనరల్ బయటపెట్టలేదు.

"అవినీతికి సంబంధించి మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి" అని ఆయన తెలిపారు.

అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా సౌదీలో ఆర్థిక కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగలేదని ఆయన తెలిపారు. కేవలం వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను మాత్రమే స్తంభింపజేశారు.

32 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి అవినీతి నిరోధక కమిటీ వేగంగా విచారణ చేచడుతుందని షేఖ్ సౌద్ అల్ ముజీబ్ తెలిపారు.

Image copyright Getty Images

ఇప్పటివరకూ 208 మందిని విచారణకు పిలిచామని వీరిలో ఏడుగురిపై ఎటువంటి ఆరోపణ రుజువు కాకపోవడంతో వారిని విడుదల చేశామని ఆయన అన్నారు.

కమిటీకి తగినంత చట్టపరమైన అధికారం ఉందని అందుకే వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని ఆయన తెలిపారు.

సొంతవారిని కూడా లెక్క చేయలేదు!

నిర్బంధంలో ఉన్న వ్యక్తుల్లో ప్రముఖ వ్యాపారవేత్త ప్రిన్స్ అల్ వలీద్ బిన్ తాలాల్, ప్రిన్స్ మితబ్ బిన్ అబ్దుల్లా, అతని సోదరుడు టర్కి బిన్ అబ్దుల్లా ఉన్నారు.

ప్రిన్స్ మితబ్ గత సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా కుమారుడు. ఆయన్ను సౌదీ నేషనల్ గార్డ్ చీఫ్ పదవి నుంచి తొలగించారు.

సౌదీ, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు

Image copyright EPA

సౌదీ అరేబియా లెబనాన్‌లో ఉన్న తన పౌరులందరిని సౌదీ తిరిగొచ్చేయాలని పిలుపునిచ్చింది. లెబనాన్‌కు వెళ్లొద్దని పౌరులను సౌదీ ప్రభుత్వం కోరింది.

సౌదీ బాటలోనే కువైట్, యూఏఈ కూడా తమ పౌరులందరినీ లెబనాన్ వెళ్లొద్దని కోరాయి.

సౌదీ అరేబియాకు మద్దతుదారుగా ఉన్న లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి శనివారం తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. తనకు ప్రాణభయం ఉందని ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఇరాన్‌కు మద్దతు తెలుపుతున్న లెబనాని తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ యెమన్‌లో క్షిపణులను ప్రయోగించిందని సౌదీ ఆరోపించింది.

సౌదీ సున్నీ వర్గం, ఇరానీ షియా వర్గాల మధ్య తమ దేశం లెబనాన్ నలిగిపోతోందని లెబనాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రన్‌ అకస్మాత్తుగా సౌదీ అరేబియా పర్యటనకు వెళుతున్నానని ప్రకటించారు.

లెబనాన్ మాజీ ప్రధానమంత్రి సాద్ హరిరి సౌదీ అరేబియా నుంచే తన రాజీనామా లేఖను పంపించడంతో సౌదీ అరేబియా ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేశారని విశ్లేషకులు అంటున్నారు.

సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య లెబనాన్ చిక్కుకుందని వారు చెప్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)