స్టీవెన్ సీగల్ నన్ను లైంగికంగా వేధించారు: పోర్షియా దె రోసీ

  • 10 నవంబర్ 2017
స్టీవెన్ సీగల్, పోర్షియా దె రోసీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఒక పాత్ర కోసం తాను ఆడిషన్‌కు వెళ్లినపుడు స్టీవెన్ సీగల్ తనకు ప్రతిపాదించారని నటి పోర్షియా ఆరోపిస్తున్నారు

నిన్నటి తరం హాలీవుడ్ యాక్షన్ హీరో స్టీవెన్ సీగల్ తనను లైంగికంగా వేధించినట్లు నటి పోర్షియా దె రోసీ ఆరోపించారు.

‘అరెస్టెడ్ డెవలప్‌మెంట్’ సినిమాతో నటిగా పేరు తెచ్చుకున్న దె రోసీ బుధవారం రాత్రి ఒక ట్వీట్‌లో ఈ ఆరోపణ చేశారు.

నటుడు, నిర్మాత కూడా అయిన సీగల్ ఒక సినిమా ఆడిషన్ సందర్భంగా ‘‘తెర వెనుక ‘కెమిస్ట్రీ’ ఉండటం ఎంత ముఖ్యమో’’ అని తనతో చెప్తూ ప్యాంటు విప్పారని ఆమె ఆరోపించారు.

ఈ ఆరోపణపై వ్యాఖ్యానించడానికి సీగల్ నిరాకరించారని ఆయన మేనేజర్ ‘బీబీసీ’తో చెప్పారు.

1980, 1990లలో యాక్షన్ పాత్రలకు సీగల్ ప్రసిద్ధి గాంచారు. అండర్ సీజ్, ఫ్లైట్ ఆఫ్ ఫ్యురీ వంటి సినిమాలు అందులో ఉన్నాయి. 2016లో ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా పౌరసత్వం ఇచ్చారు.

‘గుడ్ వైఫ్‘ సినిమా నటి జూలియానా మార్గ్యులీస్, మోడల్ జెన్నీ మెక్‌కార్తీలు సహా ఇంకొందరు ఇతర మహిళలు కూడా సీగల్ అనుచిత ప్రవర్తన, వేధింపుల మీద ఆరోపణలు చేశారు.

నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ తమపై లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పలువురు మహిళలు ఆరోపణలు చేయడం మొదలైన తర్వాత హాలీవు‌డ్‌లో తాజాగా అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు స్టీవెన్ సీగల్.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు, స్టీవెన్ సీగల్‌కు మార్షల్ ఆర్ట్స్ సంబంధాలున్నాయి

తనపై చేసిన సమ్మతి లేని సెక్స్‌ ఆరోపణలన్నిటినీ హార్వీ వైన్‌స్టీన్ నిరాకరించారు.

సీగల్ ప్రవర్తనపై ఆ సమయంలో తాను చేసిన ఫిర్యాదును ఆయన ఏజెంట్ కొట్టివేశారని నటి దె రోసీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే ఆ ఆడిషన్ ఏ సినిమా కోసం జరిగింది, ఏ సంవత్సరంలో ఆ ఘటన జరిగింది అనేది ఆమె వెల్లడించలేదు.

ఆస్ట్రేలియన్-అమెరికన్ నటి అయిన పోర్షియో.. అమెరికా టెలివిజన్ టాక్ షో హోస్ట్ ఎలెన్ దెజెనెరెస్‌ను తొమ్మిదేళ్ల కిందట వివాహమాడారు.

ఎలెన్ దెజెనెరెస్ కూడా నటి. ఆమె ‘‘నా భార్యను చూసి నాకు ఎంతోగర్వంగా ఉంది’’ అని పేర్కొంటూ దె రోసీ ట్వీట్‌ను గురువారం తన 75 మంది ఫాలోయర్లకు షేర్ చేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionహాలీవుడ్ బడా నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)