ప్యారడైజ్ పత్రాలు: సంపన్నులు పన్ను తప్పించుకుంటే సామాన్యుడిపైనే భారం

  • 12 నవంబర్ 2017
ప్యారడైజ్ పేపర్స్

ప్యారడైజ్ పత్రాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పన్ను భారం పెద్దగా లేని, ఆర్థిక వ్యవహారాలపై గోప్యత పాటించే దేశాల (టాక్స్ హేవెన్స్) గురించి చర్చ మళ్లీ మొదలైంది. వీటి మూలంగా జరిగే నష్టంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా సంపన్నులైన వ్యక్తులు, సంస్థల రహస్య ఆర్థిక కార్యకలాపాల వివరాలను ప్యారడైజ్ పత్రాలు వెలుగులోకి తెచ్చాయి. ఈ కార్యకలాపాల్లో భారీగా చేతులు మారే డబ్బు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని మరింత పెంచుతోందని అనేక నివేదికలు చెబుతున్నాయి.

ఈ అంశంతో ముడిపడిన వివిధ వాదనల్లోకి వెళ్లే ముందు సంపన్నులు పన్నులను తప్పించుకొనే తీరును చూద్దాం.

అసలు టాక్స్ హేవెన్స్ అంటే?

విదేశీ వ్యక్తులు, వ్యాపార సంస్థలపై పన్ను భారం పెద్దగా లేకపోవడం, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం అనే వెసులుబాట్లున్న దేశాలు, భూభాగాలను 'టాక్స్ హేవెన్స్' అని పిలుస్తారు.

ఈ వ్యక్తులు, సంస్థల సొమ్ము ఏ దేశం నుంచి వస్తుందో ఆ దేశంతో ఇవి అత్యంత తక్కువ సమాచారాన్ని పంచుకుంటాయి.

చాలా వరకు తేలికైన పద్ధతుల్లో సొమ్మును ఈ ప్రాంతాలకు తరలిస్తుంటారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక టాక్స్ హేవెన్స్‌లో ఒకటైన జెర్సీ ద్వీపం యూకే పరిధిలో ఉంది.

ఉదాహరణకు కంపెనీలనే తీసుకుంటే, అవి లాభాలను పన్ను భారం లేని దేశాలకు తరలించవచ్చు.

బహుళ జాతి కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను, లాభాలను తమ వ్యాపారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కాకుండా పన్ను భారం లేని దేశాల్లో ఉన్నట్లు చూపించొచ్చు. గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలను ఉదాహరణలుగా చెప్పొచ్చు.

ఇక వ్యక్తులైతే పన్ను భారం లేని దేశాల నివాసితులుగా మారొచ్చు. ఆఫ్‌షోర్ టాక్స్ హేవెన్స్‌లో ట్రస్టులు ఏర్పాటు చేయొచ్చు. పేరుకు మాత్రమే స్వతంత్రత ఉన్న థర్డ్ పార్టీల నిర్వహణలో ఆస్తులను ఉంచొచ్చు.

ఈ వ్యక్తులు ట్రస్టుల్లో ఉంటారు. కానీ వారి ఆస్తులకు సంబంధించి మూలధన లాభాల పన్ను ఉండదు. ఆదాయాలపైనా పన్ను పడదు. ఎవరైనా బెనిఫిషియరీలకు చెల్లింపులు జరిపినప్పుడు మాత్రమే వారు ఈ పన్నుల పరిధిలోకి వస్తారు.

అయితే ట్రస్టులో ఆస్తులు ఉంచిన వ్యక్తి ఎవరైనా చనిపోతే బెనిఫిషియరీలుగా ఆ ఆస్తులను పొందే వ్యక్తులు వాటి విలువ ప్రాతిపదికగా పన్ను చెల్లించాలనే నిబంధన లేదు. ఇదో ముఖ్యమైన కోణం.

Image copyright AFP

అలాంటివి ఎన్ని ఉన్నాయి?

ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) గణాంకాల ప్రకారం ఇలాంటి దేశాలు, భూభాగాలు 40కి పైగా ఉన్నాయి. స్విట్లర్జాండ్ లాంటి దేశాలతోపాటు యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) పరిధిలోని జెర్సీ, ఐసిల్ ఆఫ్ మాన్ లాంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.

అమెరికాలోని డెలవేర్, నెవాడా, వయోమింగ్ రాష్ట్రాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. దేశంలోని సమాఖ్య రాజకీయ వ్యవస్థను ఆసరాగా చేసుకొని, పన్ను వెసులుబాట్లను పెద్దయెత్తున కల్పిస్తున్నాయి.

ప్రజలపై భారం ఎలా పడుతుంది?

సంపదను ఇలాంటి ప్రాంతాలకు తరలించి, అక్కడ ఉంచే వ్యక్తులు/సంస్థలు వాస్తవానికి వారు వ్యాపారం చేసే, డబ్బు సంపాదించే దేశాల్లో పన్నును తప్పించుకొంటున్నారు.

ఇలా చేయడం వల్ల ఆయా దేశాల్లోని ప్రభుత్వాలకు ప్రజలకు సేవలు అందించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన నిధులు సమకూరవు. ఫలితంగా పన్ను రాబడి, ప్రభుత్వ వ్యయం మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతుంది.

ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వాలు పన్ను రేట్లను పెంచితే అంతిమంగా సామాన్యుడిపైనే భారం పడుతుంది.

భారత్ ఏటా కోల్పోయేది రూ.2.69 లక్షల కోట్లు

వ్యక్తులు, సంస్థలు కార్పొరేట్ పన్ను చెల్లింపు బాధ్యతను తప్పించుకోవడంవల్ల ఆసియా దేశాలు జపాన్, చైనా, భారత్ మూడూ కలిసి ఏటా సుమారు రూ.10 లక్షల కోట్ల (దాదాపు 15,480 కోట్ల డాలర్ల) రాబడిని కోల్పోతున్నట్లు ఇటీవల యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత్ కోల్పోయేదే సుమారు రూ.2.69 లక్షల కోట్లు ఉంది.

పాకిస్తాన్‌ అయితే ఏటా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 5.1 శాతం మేర రాబడిని కోల్పోతోంది. అమెరికాలో ఈ నష్టం జీడీపీలో 1.6 శాతంగా ఉంది.

పేద దేశాల్లో ప్రభావం ఎక్కువ

పేదరికం ఎక్కువగా ఉండే దేశాల్లో సంపన్నులు పన్నులను తప్పించుకోవడం వల్ల కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.

ఉదాహరణకు ఆఫ్రికా ఖండాన్నే తీసుకుంటే అత్యంత సంపన్నులైన వ్యక్తులు తమ సంపదను పన్నుభారం లేని ప్రాంతాలకు తరలించడం వల్ల సుమారు 91.5 వేల కోట్ల రూపాయల (1400 కోట్ల డాలర్లు) పన్ను ఆదాయం అందాల్సిన ప్రభుత్వాలకు అందలేదు.

చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు

ఈ భారీ మొత్తం సంబంధిత ప్రభుత్వాలకే అందితే ఆఫ్రికాలో 40 లక్షల మంది చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, ఆఫ్రికాలోని ప్రతి చిన్నారికి విద్యను అందించేందుకు వీలుగా ఉపాధ్యాయులను నియమించవచ్చని 'ఆక్స్‌ఫామ్' సంస్థ అంచనా వేసింది.

ఆఫ్రికాలోని అధికార వర్గాల అంచనా ప్రకారం- అంతర్జాతీయ సహాయం రూపంలో ఆఫ్రికా పొందే నిధుల కన్నా వ్యక్తులు, సంస్థలు పన్నును తప్పించుకోవడం వల్ల ఆఫ్రికా కోల్పోయే సొమ్మే ఎక్కువ.

ఏమీ చేయలేమా?

బ్యాంకింగ్ వ్యవహారాల్లో అనుచిత గోప్యత పాటించే దేశాలపై కఠిన చర్యలు చేపట్టాలని 2009లో లండన్‌లో జరిగిన ఒక సదస్సులో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తీర్మానించాయి.

ఐదేళ్ల తర్వాత 'కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్' పేరుతో ఓఈసీడీ ఒక ఒప్పందాన్ని రూపొందించింది. కొన్ని ఆఫ్‌షోర్ ఆర్థిక కేంద్రాలు సహా 100కు పైగా దేశాలు ఈ ఒడంబడికకు అనుగుణంగా సమాచార మార్పిడికి అంగీకరించాయి.

టాక్స్ హేవెన్స్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించాల్సిన కొన్ని దేశాలే ఈ విషయంలో సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ను అతిపెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలాంటి ప్రాంతాలు పదికి పైగా యూకే పరిధిలోనే ఉన్నాయి.

చట్టవిరుద్ధం కాకపోవడం మరో కోణం

ఇలాంటి చోట సంపద ఉంచడం చట్టవిరుద్ధం కాకపోవడం మరో ముఖ్యమైన కోణం. పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్రాంతాలు చట్టబద్ధ మార్గాలను అందిస్తున్నాయి.

అక్రమ పద్ధతులను అవలంబించడం ద్వారా పన్నును చెల్లించకపోతే దానిని పన్ను ఎగవేత(టాక్స్ ఎవేజన్)గా వ్యవహరిస్తారు. అలా చేయడం చట్టవిరుద్ధం. టాక్స్ హేవెన్స్‌ను ఉపయోగించే వారు చేసేది పన్ను నుంచి తప్పించుకోవడం (టాక్స్ అవాయ్‌డన్స్).

మనీ లాండరింగ్‌కు ఊతం

ప్యారడైజ్ పత్రాల్లో పేర్లున్న అందరూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారనడం సబబు కాదు. అయితే టాక్స్ హేవెన్స్ పాటించే గోప్యత మనీ లాండరింగ్ లాంటి చర్యలకు ఊతమిస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తులు/సంస్థలు చట్టాల్లోని లోపాలను సొమ్ము చేసుకొనేందుకు యత్నిస్తుంటారని, లోపాలను సరిచేయాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు.

పన్ను చట్టాల్లో మనం ఒక లోపాన్ని గుర్తించే సరికే బహుళ జాతి సంస్థలు పది లోపాలు కనుగొంటాయని ఫ్రాన్స్ ఆర్థికవేత్త, 'ద హిడెన్ వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తక రచయిత గేబ్రియల్ జుక్మన్ ఇటీవల 'లే మండే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

ఇంతకూ అక్కడ ఎంతుంది?

ఆఫ్‌షోర్ ఆర్థిక కార్యకలాపాల్లో రూ.1,373 లక్షల కోట్ల నుంచి రూ.2,092 లక్షల కోట్ల వరకు సంపద ఉన్నట్లు పలువురు అధ్యయనవేత్తలు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కోసం కృషిచేసేవారితో కూడిన 'టాక్స్ జస్టిస్ నెట్‌వర్క్' ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది.

ఇదంతా కేవలం కోటి మందికే చెందినదని వ్యాఖ్యానించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో రెండు శాతం కన్నా తక్కువే.

ప్రపంచంలోకెల్లా అత్యధిక సంపద కలిగిన 200 కంపెనీల్లో 90 శాతం కంపెనీలు టాక్స్ హావెన్స్‌ను ఉపయోగించుకొంటున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది.

ఈ ప్రాంతాల్లో ఈ సంస్థల కార్పొరేట్ పెట్టుబడులు 2001 నుంచి 2014 మధ్య నాలుగింతలు అయ్యాయని పేర్కొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)