భారత వంటల ఘాటు తట్టుకోలేక ఇల్లు అద్దెకివ్వనంటున్న ఏజెన్సీ

  • 11 నవంబర్ 2017
ఫెర్గస్ విల్సన్

లండన్‌లోని ఓ వ్యాపారవేత్త భారతీయులకు ఇల్లు అద్దెకివ్వనని తేల్చిచెప్పాడు. భారతీయులపై ద్వేషం, ఆర్థికపరమైన సమస్యలు దీనికి కారణం కాదన్నారు. కేవలం "భారతీయులు వండే కూరల నుంచి వచ్చే ఘాటు వాసన వల్లనే వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వలేకపోతున్నాను’’ అని అంటున్నారు.

ఫెర్గస్ విల్సన్ ఓ బ్రిటన్ వ్యాపారవేత్త. ఇంగ్లండ్‌లోని కెంట్ ప్రాంతంలో అతనికి చాలా ఇళ్లున్నాయి. కాని భారతీయులకు అద్దెకు ఇవ్వనంటున్నారు.

ఎందుకిలా వివక్ష చూపుతున్నారని అడిగితే.. తన నిర్ణయం జాత్యహంకారంతో కూడిందికాదని అంటున్నారు.

భారతీయుల వంటకాలు చాలా ఘాటుగా ఉంటాయని వాటి మరకలు తొలగించడం కష్టంగా ఉందని అందువల్ల వారికి.. పాకిస్తానీయులకు ఇళ్ళు అద్దెకివ్వనని తెలిపారు.

అయితే మెయిడ్సన్ కంట్రీ కోర్టు విల్సన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

సమానత్వం, మానవ హక్కుల కమీషన్ ఈ నిర్ణయం చట్టవ్యతిరేకమని తెలిపింది.

నల్లజాతీయులకు, భారతీయులకు ఇళ్ళు అద్దెకివ్వొద్దని ఫెర్గస్ విల్సన్ తన ఏజెన్సీకి పంపించిన ఓ ఇమెయిల్ ను ద సన్ వార్తాపత్రిక బయటపెట్టింది.

అది ఈ కేసుకు కారణమైంది. దీనిపై విల్సన్ వివరణ ఇస్తూ తాను ఆర్థిక కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రజల రంగునో, వారి జాతినో ఉద్దేశించి కాదని వివరించారు.

ఎందరో నల్లజాతీయులకు ఇళ్ళు అద్దెకిచ్చానన్నారు.అయితే విల్సన్ వివరణను మెయిడ్సన్ కంట్రీ కోర్టు జడ్జి తోసిపుచ్చారు. అది హాస్యాస్పదమని తెలిపారు.

"విల్సన్ నిర్ణయం వివక్ష చూపిస్తున్నట్లుగా ఉంది. ఇది చట్ట విరుద్ధం " అని జడ్జి తెలిపారు.

విల్సన్ నిర్ణయాన్ని కోర్టు తప్పుబడుతూ.. భారతీయులకు, పాకిస్తానీయులకు ఇళ్ళు అద్దెకివ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

రాజకీయ రంగు పులుముకుంది !

ఇప్పుడీ కేసు రాజకీయ రంగు పులుముకుంది, ఇది ఇళ్ళు అద్దెకిచ్చే వ్యాపారాన్ని దెబ్బతీయొచ్చని విల్సన్ కోర్టు విచారణలో తెలిపాడు.

గతంలో ఓ ఇంటిని భారతీయ కుటుంబం నుంచి కొన్నానని ఆ ఇంట్లో కూరల మరకలను తొలగించడానికి 12,000 పౌండ్లు (రూ.10.35 లక్షలు) ఖర్చు చేశానని బీబీసీకి వివరించారు.

గతంలో విల్సన్ 200 మందిని తమ ఇళ్ల నుంచి బయటకు పంపేశారు.

ఇళ్లల్లో నుంచి వచ్చే కూర వాసనలతో తనకు ఆర్థికంగా సమస్యలొస్తున్నాయని విల్సన్ అంటున్నారు.

"కూరల మరకలు ఇంట్లో పరుపులపై, గోడలపై పడుతున్నాయి. ఇంటి యాజమానులందరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. నేను కూడా ఇదే అంటున్నాను." అని పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు