బీబీసీ 100 మంది మహిళలు: అంతరిక్ష దుస్తులు కుట్టే 'నక్షత్రాల దర్జీ’ ఈమె

  • 12 నవంబర్ 2017
లీన్ Image copyright నాసా

అపోలో స్పేస్ సూట్లు (అంతరిక్ష దుస్తులు) నుంచి మార్స్ రోవర్స్ వరకు అంతరిక్షానికి పంపే ముఖ్యమైన విడిభాగాలను బిగించే పని వెనుక మహిళలదే కీలక పాత్ర.

అందులో ఒకరు లిన్ ఫామ్, ఆమెను 'నక్షత్రాల దర్జీ'గా అభివర్ణిస్తుంటారు.

భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లే వాహకనౌకకు థర్మెల్ బ్లాంకెట్స్ (ఉష్ణ నిరోధక కవచాలు) అతి ముఖ్యమైనవి. అలాంటి వాటిని తయారు చేసే జెట్ ప్రొపుల్షన్ ప్రయోగశాలలో లీన్ పని చేస్తుంటారు.

ఇది అంత ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. కానీ, అంతరిక్ష ప్రయోగశాలలో లీన్ చేసేది కుట్టుపనే.

శనిగ్రహాన్ని చేరేందుకు కస్సినీ పేరుతో నాసా ఓ అంతరిక్ష వాహక నౌకను రూపొందించింది. వాతావరణ మార్పులకు లోను కాకుండా ఉండేందుకు దీనికి బంగారువర్ణంలో ఉండే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నాసాలో లీన్ మొదటి ప్రాజెక్టు.

కుట్టు మిషన్లతో చెప్పులను తయారు చేసినట్లే థర్మల్ బ్లాంకెట్లను కూడా అదే మాదిరిగా రూపొందిస్తారు. తర్వాత వాటిని అంతరిక్ష నౌకకు అతికిస్తారు. అందువల్ల ప్రయోగ సమయంలో అవి ఊడిపోవు.

Image copyright నాసా

తాను నాసాలో కుట్టుపని చేస్తానని వియత్నాంలో పుట్టిపెరిగిన లీన్ కలలో కూడా ఊహించలేదు.

1970లలో వియత్నాం యుద్ధం సమయంలో లీన్ కుటుంబం దేశాన్ని విడిచివెళ్లింది. తన ఆరుగురు తోబుట్టువులకు అండగా ఉండేందుకు ఆమె అమెరికాకు వచ్చారు.

వారి కుటుంబం రెండు కుట్టు మిషన్లను కొనుక్కొని రాత్రంతా బట్టలు కుట్టేది. ఇంటి నుంచే ఆమె బట్టలు అమ్మడం మొదలుపెట్టారు.

"బట్టలు, జాకెట్లు, చొక్కాలు ఇంకా చాలా కుట్టేవాళ్లం. ఒక్కో దానికి 50 సెంట్లు వచ్చేవి" అని ఆమె 'బీబీసీ 100 వుమెన్ సిరీస్‌'కు చెప్పారు.

లోదుస్తుల తయారీ కంపెనీలో రోజుకూలీగా పనిచేసిన లీన్ వారాంతాల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తరగతులకు హాజరయ్యేవారు.

అప్పట్లో కాలిఫోర్నియాలో ఇంజినీరింగ్‌కు బాగా డిమాండ్ ఉండేది. వారిలో చాలా మందిని నాసా ఉద్యోగులుగా నియమించుకునేది.

లీన్ స్నేహితురాలు ఒకరు ఆమెను నాసాకు చెందిన జెట్ ప్రొపెల్షన్ ప్రయోగశాలలో ఉద్యోగానికి దరఖాస్తు చేయమని సూచించారు. 1994‌లో లీన్ నాసాలోని శనిగ్రహానికి పంపే అంతరిక్షనౌక విడి భాగాల కూర్పు జట్టులో ఉద్యోగిగా చేరారు.

అంతరిక్ష నౌకకు సంబంధించి విడివిడిగా ఉండే సాంకేతిక పరికరాలను కలిపే అత్యంత జటిలమైన పనికి అప్పట్లో బాగా డిమాండ్ ఉండేది. ఆ పనిని లీన్ జట్టు మూడేళ్లు చేసింది.

"దుస్తుల తయారీ కంపెనీల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు ఇక్కడ కేబులింగ్ (విడిభాగాల కూర్పు)లో మహిళలే ఎక్కువగా ఉంటారు. మహిళలకు హస్తకళల్లో మంచి నైపుణ్యం ఉంటుంది" అని లీన్ చెప్పుకొచ్చారు.

Image copyright నాసా

ఎక్కువ మంది మహిళలతోనే థర్మల్ బ్లాంకెట్ టీం ఏర్పాటైంది. దీన్ని వాళ్లు 'షీల్డ్ షాప్‌'గా పిలిచేవారు. 20 వేర్వేరు పొరలను ఈ టీంలోని సభ్యులు అత్యంత జాగ్రత్తగా కుట్టేవారు. ఇందులో కొన్ని పొరలు వెయ్యిలో ఒక వంతు మందం కూడా ఉండవు.

సూట్‌ను రూపొందించినట్లే ఈ కవచాన్ని కూడా తగిన కొలతలతో క్రమానుగత రీతిలో రూపొందిస్తారు.

"ఇదంతా చేతితో తయారు చేసే దర్జీ పని లాంటిదే" అని లీన్ వివరించారు.

కుట్టుపని తెలిసిన మహిళలనే నాసా ఇలాంటి పనిలోకి తీసుకోవడానికి కారణముంది. టెఫ్లాన్‌లాంటి పదార్థాలతో ఎలా పని చేయాలో ఇంజనీర్లు గుర్తించలేకపోయినప్పుడు అంతరిక్ష ప్రయోగాలకు ఇబ్బందులు ఏర్పడుతాయి.

అయితే, టెఫ్లాన్ పదార్థం అంచులను మడత పెట్టాలని, బట్టల అంచును కుట్టినట్లు కుట్టాలని లీన్ సలహా ఇచ్చారు. ఈ సలహా పని చేసింది.

Image copyright డేవిడ్ మీర్మన్ స్కాట్

చంద్రుడి మీదికి మొదటిసారిగా మనిషిని పంపిన అపోలో కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు చూస్తే హస్తకళా నైపుణ్యం ఉన్న లీన్‌లాంటి మహిళలెందరో నాసా విజయంలో కీలక పాత్ర వహించారు.

నాసాలో ఉండే ఈ మహిళలను 'లిటిల్ ఓల్డ్ లేడీస్‌'గా పిలుస్తుంటారు. అయితే, ఇందులో ఎక్కువ మంది యువతులే ఉంటారు.

ప్రోగ్రామింగ్ కోడ్‌ గురించి ఏమాత్రం అవగాహనలేని ఈ మహిళలు, సూక్ష్మ అయస్కాంత క్షేత్రాల మధ్యలోంచి రాగి తీగలను అత్యంత చాకచక్యంగా అల్లుతుంటారు. చాలా ఖచ్చితమైన ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడుతుంది. కానీ, వీరి నైపుణ్యం బయటి ప్రపంచానికి మాత్రం కనిపించదు.

లోదుస్తులు కుట్టడంలో ఉపయోగపడిన నైపుణ్యం అపోలో అంతరిక్ష సూట్లను రూపొందించేందుకు ఉపయోగపడటం విశేషం. అత్యున్నతస్థాయిలో, ఒక్కోసారి పొద్దుపోయేవరకు పనిచేస్తూ వాళ్లు సృష్టించిన ఆవిష్కరణలే మానవసహిత అంతరిక్షయాత్రలను సుసాధ్యం చేశాయి.

నాసాలోని అంతుచిక్కని కొన్ని రహస్యాల మాదిరిగానే అందులో పనిచేసే లీన్‌ లాంటి వారి కథలు కూడా బయటి ప్రపంచానికి తెలియడం లేదు.

"చిన్నప్పుడు ఆకాశం వైపు చూసి నక్షత్రాలను అందుకుంటే బాగుండునని అనుకునేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అక్కడికి వెళ్లే వాటిని తయారు చేస్తున్నా. ఇలా చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు" అని లీన్ అన్నారు.

ఏది ఏమైనప్పటికీ, ఈ ఉద్యోగంతో లీన్ తన కలను నిజం చేసుకున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)