అభిప్రాయం: మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?

  • 13 నవంబర్ 2017
మోదీ, అమిత్ షా Image copyright BJP4India/facebook

నాకో స్నేహితుడున్నాడు. ఎన్నికల అంశాల్లో నిపుణుడు. వచ్చే నెల్లో గుజరాత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల గురించి అతన్ని అడిగితే, నవ్వాడు.

''ఇదో ఎన్నికే కాదు, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఓ సన్నాహకం. ఈ ఎన్నికల ద్వారా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని, తమ వ్యూహంలో లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు'' అంటూ అతడు తన అభిప్రాయం వ్యక్తంచేశాడు.

ఎన్నికలంటేనే అనుమానం, వైరం, అనిశ్చితిలతో ముడిపడినవని, కానీ ప్రస్తుత ఎన్నికల్లో అవి తనకు అంతగా కనిపించడం లేదని అతడు వ్యాఖ్యానించాడు.

అక్కడి పరిణామాలు అనివార్యమైనవిగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఊపు మీద ఉందనిపిస్తోంది.

గుజరాత్‌ ఎన్నికల సంగ్రామంలో కనిపించే చిన్న చిన్న పోరాటాలు కేవలం ఒక రకమైన వినోద కార్యక్రమాలే. ఇవి ప్రజాస్వామ్యంలో ఉత్తేజాన్ని నింపేందుకు ఉద్దేశించినవి.

దృష్టి అంతా 2019 ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉంది.

Image copyright Getty Images

దేశవ్యాప్తంగా చూస్తే ప్రజల దృష్టిని ప్రధాని నరేంద్ర మోదీ తనపై నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. మోదీ వాదనల్లో విషయం లేకపోయినా, ఆయన తనలో క్రియాశీలత, చిత్తశుద్ధి ఉన్నట్లు ప్రజలకు చూపించుకోగలుగుతున్నారు.

ప్రధానేమో బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తారు, ప్రతిపక్షమేమో చేయడానికేమీ లేనట్లు కనిపిస్తుంది.

మోదీకి మొరారి బాపు, జగ్గీ వాసుదేవ్ సహా అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు 'సర్టిఫికెట్లు' ఇవ్వడాన్ని కూడా నా స్నేహితుడు నాతో ప్రస్తావించాడు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తన మార్షల్ ఆర్ట్స్ గురువు నుంచి మాత్రమే సర్టిఫికెట్ (అయికిడోకు సంబంధించి) పొందగలిగారు.

ఈ విషయాన్నీ ప్రజలు గమనిస్తారు.

Image copyright Getty Images

మోదీనే కాదు అమిత్ షా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్) పోషించే పాత్రను కూడా జనం గ్రహించగలరు.

ఎన్నికలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్న యంత్రాంగం మాదిరి బీజేపీ, అందుకు భిన్నమైన పరిస్థితిలో ఉన్న పార్టీలుగా ప్రతిపక్షాలు వారికి కనిపిస్తాయి.

విపక్షం కకావికలమై ఉంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయినప్పటికీ విపక్షానికి స్థైర్యం గానీ, ఒక రూపు గానీ లేవు.

Image copyright Getty Images

పెద్ద నోట్ల రద్దు: పర్యవసానాల కంటే ఉద్దేశాలపైనే చర్చ

ఒక రకంగా చూస్తే, నైతికపరంగా అదృష్టం బీజేపీ పక్షానే ఉంది. బీజేపీని బాగా కష్టపడుతున్న పార్టీగా ప్రజలు భావిస్తున్నారు.

ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) వ్యవహారాన్నే తీసుకోండి. అదొక విధ్వంసకర చర్య, ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగానికి.

అయితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై కంటే ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.

ఈ చర్యను నైతిక కోణంలో తీసుకొన్నదిగానూ, పాక్షికంగా విఫలమైనదిగానూ ఎక్కువ మంది పరిగణిస్తున్నారు. మోదీని నిందించేవారు తక్కువ. ఓటరుకు ఆయన ఇప్పటికీ ఒక యోధుడిగానే కనిపిస్తున్నారు.

2019 ఎన్నికల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమిత్ షా

నిరుద్యోగం, వ్యవసాయంపై విఫలమైన భాజపా విధానాలు

బీజేపీ ఏ పొరపాటూ చేయలేదని కాదు. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభ పరిష్కారాల్లో బీజేపీ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయి.

ఇప్పటి వరకైతే బీజేపీ వైఫల్యాలను నిరసిస్తూ ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి రాలేదు.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. మీడియాతో కుమ్మక్కు అయిన సంఖ్యా బలమున్న రాజకీయ పక్షం ఏం చేసినా చెల్లిపోతోంది. ప్రతిపక్షాల బలహీనతను ఇది తనకు అనుకూలంగా మలచుకుంటోంది.

ఈ రాజకీయ శూన్యత ప్రభావం గుజరాత్ ఎన్నికల్లో కనిపిస్తోంది.

అసమ్మతి, ప్రత్యామ్నాయాల గురించి ఆలోచనే జరగడం లేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అల్పేశ్ ఠాకూర్, హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ

బీజేపీ తన ప్రయత్నాల్లో విజయవంతమవుతోందని చెప్పడం లేదు. రాజకీయాలే నిస్తేజంగా మారాయంటున్నాను.

ఎన్నికలంటే రసవత్తరంగా సాగే పోటీలుగా కనిపించడం లేదు. మోదీ, అమిత్ షాల భారీ హోర్డింగులతో కూడిన మూకీ సినిమాలాగా తయారయ్యాయి.

ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన చేతనత్వం ఇప్పుడు లోపించింది.

గుజరాత్ ఎన్నికలనే తీసుకోండి. ముగ్గురు ప్రముఖులు- హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేశ్ మెవానీ ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. హంగామా సృష్టిస్తున్నారు. అయితే అమిత్ షా విజయరథం ముందు వారు చిన్నబోతున్నారు.

జాతీయ వ్యూహం రూపొందించలేకపోతున్న ప్రతిపక్షాలు

బీజేపీ పనితీరు బాగుందని కాదు. నవీన్ పట్నాయక్, లాలు ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి నాయకులతోపాటు సీపీఎం లాంటి రాజకీయ పక్షాలు ఒక తాటిపైకి వచ్చి, వ్యూహాలు రూపొందించలేకపోతున్నారు.

పరిమిత బలాలున్న ఈ నాయకులు ఒక జాతీయ వ్యూహాన్ని రూపొందించలేకపోతున్నారు.

ఈ అభిప్రాయంతో ఉండేవారు తక్షణం ఫలితాలు వచ్చేయాలనేమీ చెప్పడం లేదు. వారు వ్యూహాన్ని, దార్శనికతను కోరుకొంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ఒక 'బీ' గ్రేడ్ సినిమాపై ఉండే అంచనాలు కూడా నేటి రాజకీయాలపై లేవు. నేటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పొరపాట్లపై విశ్లేషణ, పనితీరు మదింపు, విధానాలపై చర్చ కొరవడ్డాయి.

Image copyright Getty Images

తడబడుతున్న కమల్ హాసన్

ప్రజలకు న్యాయం చేకూర్చే, నచ్చని విధానాలపై పోరాటాన్ని నడిపించే ఎన్నో గొప్ప ఆలోచనలకు చెన్నై ఒకప్పుడు వేదికగా ఉండేది. ఇప్పుడు అక్కడ రాజకీయ శూన్యత ఆవరించింది.

కమల్ హాసన్ సగం స్క్రిప్టే చేతిలో ఉన్న నటుడు మాదిరి తడబడుతున్నారు. రజినీ కాంత్ మౌనం వహిస్తున్నారు.

నిస్తేజ రాజకీయం ఆందోళనకరంగా ఉంది.

మీడియానేమో 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే భావనతో సంబరాలు చేసుకుంటోంది.

ఇక పౌర సమాజమే చైతన్యవంతమై, విధానాలపై చర్చకు తెర తీస్తుందని, తద్వారా 2019 ఎన్నికల నాటికి భారత ప్రజాస్వామ్యం నిస్తేజంగా కాకుండా ఉత్సాహంగా ముందుకు సాగేలా చూస్తుందనే ఆశాభావం ఉంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)