భూకంపాలను ముందే పసిగట్టొచ్చనే వాదనల్లో నిజమెంత?

  • 15 నవంబర్ 2017
ఇరాన్ ఇరాక్ భూకంపం Image copyright Getty Images

మరి కొద్ది రోజుల్లో భూకంపం వచ్చి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందనే విషయాన్ని ముందస్తుగా గుర్తించడం సాధ్యమేనా?

సూర్యుడు, చంద్రుడితో పాటు, ఇతర గ్రహాల కదలికల ఆధారంగా రఫెల్ బెండాండి అనే ఇటలీ శాస్త్రవేత్త భూకంపం సూచనలను ముందస్తుగానే అంచనా వేసేవారు. ఆయన 1979లో మరణించారు.

కానీ, 2011 మే 11న ఇటలీ రాజధాని రోమ్ నగర వాసులంతా ఊరు విడిచి దూరంగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, ఆ రోజు రోమ్‌లో భూకంపం వస్తుందని బెండాండి ముందుగానే ఊహించారని వాళ్లు చెప్పిన మాట.

ఇలాంటి పరిస్థితే న్యూజిలాండ్‌లోనూ కనిపించింది. ఓ మాంత్రికుడు సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వాతావరణ మార్పులను అంచనా వేయగా, అది భూకంప సూచన అంటూ అందరూ భయపడిపోయారు.


ఎవరీ రఫెల్ బెండాండి?

  • సెంట్రల్ ఇటలీలో 1983లో జన్మించారు.
  • 1924 జనవరి 2న భూకంపం వస్తుందని 1923 నవంబర్‌లోనే చెప్పారు.
  • ఆయన చెప్పిన తేదీకి రెండు రోజుల తర్వాత ఇటలీలోని లే మార్చే ప్రావిన్స్‌లో నిజంగానే భూకంపం వచ్చింది.
  • ముస్సోలిని ఈయన్ను ఓ వీరుడిగా గౌరవించేవారు.
  • కానీ, ప్రజలను భయపెట్టేలా ఊహాజనిత హెచ్చరికలు చేయకుండా ఆయనపై నిషేధం విధించారు.

Image copyright Other

అయితే, భూకంపాలను అలా ముందుగానే గుర్తించొచ్చన్న విషయంలో వాస్తవం లేదని చాలా మంది శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

అలా చెప్పడం కల్పితమేనని అంటున్నారు. ఎప్పుడు భూమి కంపిస్తుందో నెలలు, సంవత్సరాల ముందుగానే అంచనా వేసి చెప్పడం అసాధ్యమంటున్నారు.

"భూకంపాలను ముందస్తుగా పసిగట్టడం కోసం అనేక అధ్యయనాలు, ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఎప్పుడు? ఎక్కడ? ఎంత తీవ్రతతో భూకంపం సంభవిస్తుంది? అన్న విషయాన్ని విజయవంతంగా గుర్తించిన దాఖలాలు లేవు" అని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్త బ్రియాన్ బాప్టీ అన్నారు.

"భూమి లోపల ఎక్కడ ఒత్తిడి పెరుగుతుందో గుర్తించేందుకు రాతి పొరల కదలికలను శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉంటారు. ఆ పరిశీలన ఆధారంగా ఆఖరి నిమిషంలో భూకంప హెచ్చరికలు జారీ చేసే వీలుంటుంది" అని బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ జొనాథన్ ఆమోస్ చెబుతున్నారు.

"జపాన్ , కాలిఫోర్నియాలోని భూకంప హెచ్చరికల కేంద్రాల్లో శాస్త్రవేత్తలు ఎప్పుడూ రాతి పొరల కదలికల సంకేతాలను గమనిస్తూ ఉంటారు. వాళ్లు మరో 30 సెకన్లలో, ఫలానా ప్రాంతంలో భూ ప్రకంపనలు వస్తాయని హెచ్చరికలు పంపిస్తారు. అంతకంటే ముందస్తుగా హెచ్చరికలు చేయడం కష్టమే" అని ఆమోస్ అన్నారు.

అయితే భూమిలో పొరలను బట్టి శాస్త్రవేత్తలు ఫలానా ప్రాంతంలో భూకంపాలు రావచ్చు అని మాత్రం శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే, ఫలానా రోజు, నెల, సంవత్సరం అని మాత్రం చెప్పలేరు. అది జరిగేందుకు కొన్ని దశాబ్దాలు కూడా పట్టొచ్చు.

Image copyright Getty Images

జంతువులు భూకంపాలను పసిగడతాయా?

భూకంపాల రాకను జంతువులు ముందుగానే పసిగడతాయన్న వాదనలూ పలుమార్లు వినిపించాయి.

2009లో ఇటలీలో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని గోండ్రు కప్పలు మూడు రోజుల ముందే పసిగట్టాయని, వాటిలో వింత ప్రవర్తన కనిపించిందని జర్నల్ ఆఫ్ జువాలజీ వెల్లడించింది.

అయితే, అకస్మాత్తుగా సంభవించే భూకంపాలను ఆ జీవులు గుర్తించగలవన్న విషయాన్ని శాస్త్రీయంగా చెప్పడం కష్టం.

ఫలానా ప్రాంతంలో భూకంపం వస్తుందని కొందరు మాంత్రికులు ప్రజలను నమ్మిస్తుంటారు. తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియా, జపాన్ వంటి ప్రాంతాల్లో అలాంటి వారు చెప్పేవి కొన్నిసార్లు నిజం కూడా కావొచ్చు. కానీ, అన్ని చోట్లా వాళ్ల మాట నిజమవుతుందని చెప్పలేం.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం