జింబాబ్వే రాజకీయాల్లో ముగాబే భార్య గ్రేస్‌ కీలక పాత్ర

  • 15 నవంబర్ 2017
మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గ్రేస్ Image copyright AFP

జింబాబ్వేలో ప్రభుత్వ మీడియాను సైన్యం తన అధీనంలోకి తీసుకోవడం, అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను గృహ నిర్బంధంలో ఉంచడం తదితర కీలక పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, దేశ రాజకీయాల్లో ముగాబే రెండో భార్య, దేశ ప్రథమ మహిళ గ్రేస్ ముగాబే పోషిస్తూ వస్తున్న పాత్ర మరోసారి చర్చనీయాంశమైంది.

గ్రేస్ గతంలో సేవా కార్యక్రమాలు, షాపింగ్ వ్యవహారాలతో వార్తల్లో ఉండేవారు. తదనంతర కాలంలో పాలక 'జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్- పేట్రియాటిక్ ఫ్రంట్ (జను-పీఎఫ్)'లో అత్యంత కీలక నాయకుల్లో ఒకరుగా ఆమె ఎదిగారు. ఆమె వ్యాపారవేత్త కూడా.

జను-పీఎఫ్ పార్టీలో మహిళా విభాగం అధినేతగా ఉన్న గ్రేస్, రాబర్ట్ ముగాబే స్థానంలో ఆయన వారసుడిగా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకొనే అవకాశమున్న పలువురు నాయకులను ఆమె కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు.

జను-పీఎఫ్‌ పార్టీలో గ్రేస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఎమర్సన్ నాన్‌గాగ్వాపై గ్రేస్ గత నెల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తిరుగుబాటుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

గత వారం ఉపాధ్యక్ష పదవి నుంచి నాన్‌గాగ్వాను రాబర్ట్ ముగాబే తప్పించారు. నాన్‌గాగ్వాలో విధేయత లోపించిందని ప్రభుత్వం పేర్కొంది.

నాన్‌గాగ్వాకు సైన్యాధిపతి జనరల్ కాన్‌స్టాంటినో చివెంగా సన్నిహితుడు.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఎమర్సన్ నాన్‌గాగ్వా

నాన్‌గాగ్వా స్థానంలో ఉపాధ్యక్ష పదవిని తాను చేపట్టేందుకు ముగాబేతోపాటు పార్టీలో కీలకమైన పలువురు నాయకుల మద్దతును గ్రేస్ సంపాదించారు.

ముగాబే కాలం చేసినా, లేదా పదవి నుంచి వైదొలగినా ఆయన స్థానంలో అధ్యక్ష పీఠమెక్కగల నాయకుల్లో ఒకరుగా ఆమె అవతరించారు.

ముగాబేకు 93 ఏళ్లు కాగా, గ్రేస్‌ వయసు 52 సంవత్సరాలు.

ప్రపంచంలోనే అత్యధిక వయసున్న పాలకుడు ముగాబే. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు ఉన్నాయి. చికిత్స కోసం ఆయన పలుమార్లు ఈ ఏడాది సింగపూర్‌కు వెళ్లారు.

అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ అధ్యక్ష పదవికి ఆయన్నే అభ్యర్థిగా పాలక జను-పీఎఫ్ నామినేట్ చేసింది.

ముగాబే భౌతిక కాయం కూడా ఓట్లు తేగలదన్న గ్రేస్

ముగాబేకు గ్రేస్ బలమైన మద్దతుదారు. ఆయనపై అంతులేని అభిమానాన్ని ప్రకటిస్తుంటారు.

ఈ ఏడాది ఒక సందర్భంలో ఆమె మాట్లాడుతూ- ముగాబే భౌతిక కాయం కూడా ఓట్లు సాధించగలదని, ఆయనంటే ప్రజలకు అంత అభిమానమని వ్యాఖ్యానించారు.

Image copyright AFP

అధ్యక్ష పీఠంపై తన ఆసక్తిని కూడా గ్రేస్ ఇంతకుముందు వ్యక్తంచేశారు. 2014లో ఒక ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ- ''నేను అధ్యక్ష పదవిని చేపట్టాలనుకొంటున్నాననే మాట వినిపిస్తోంది. ఏం, నేను చేపట్టకూడదా? నేను జింబాబ్వే పౌరురాలిని కాదా'' అని ప్రశ్నించారు.

2014లోనూ అప్పటి ఉపాధ్యక్షురాలు జాయిస్ ముజురు పదవీచ్యుతి వెనక గ్రేస్ పాత్ర ఉంది.

గ్రేస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలివీ:

  • గ్రేస్‌కు 41 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు, ముగాబేకు మధ్య సంబంధం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయంలో ఆమె టైపిస్ట్‌గా పని చేసేవారు.
  • అప్పటికే ముగాబేకు వివాహమైంది. ఆయన భార్య సాలీ తీవ్రమైన అనారోగ్యంతో ఉండేవారు. ఆమె 1992లో చనిపోయారు.
  • గ్రేస్ 1996లో ముగాబేను వివాహం చేసుకున్నారు. ఆమెకూ అప్పటికే పెళ్లైంది.
  • ముగాబే, గ్రేస్ దంపతులకు బోనా, రాబర్ట్, చతుంగ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు.
  • గ్రేస్ సేవా కార్యక్రమాలను, ఆమె ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేయడాన్ని మద్దతుదారులు ప్రశంసిస్తుంటారు.
  • జింబాబ్వే రాజధాని హరారే శివార్లలో చైనా నిధులతో ఈ అనాథాశ్రమం ఏర్పాటు చేశారు.
  • గ్రేస్ ప్రత్యర్థులు ఆమె భారీగా ఖర్చు పెట్టే పద్ధతిని, వ్యవహారశైలిని విమర్శిస్తుంటారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఈవెంట్

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

సెప్టెంబర్ 17: విలీనమా.. విమోచనా... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి

డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు