ఐవీఎఫ్ - అండ దానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’

ఎలైనే చోంగ్

సాధారణంగా రక్తదానం, అన్నదానం మనకు తెలిసిన దానాలు. కానీ చైనాకు చెందిన 'ఎలైనే చోంగ్' అండదానం చేశారు. అదీ కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే.

దీనికోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. తనకు ఎదురైన పరిస్థితులను ఆమె బీబీసీకి చెప్పారు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లోనే...

అండదానం గురించి తొలిసారి అమెరికాలో చదువుకుంటున్నప్పుడు విన్నా. వీర్య దానం, అండదానానికి సంబంధించి అన్ని వివరాలు మాకు తెలిశాయి. అప్పుడే నాకు అండదానం చేయాలని అనిపించింది.

ఆరోగ్యకరమైన, చదువుకున్న మహిళల అండాలకు ఎక్కువ డిమాండ్ ఉందని, కానీ మహిళలు అండదానానికి ముందుకు రావడం లేదని ప్రొఫెసర్ మాతో అన్నారు.

ఒక అండం ఖరీదు దాదాపు దాదాపు 2 లక్షల రూపాయలు ఉంటుందని ప్రొఫెసర్ అన్నప్పుడు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

నేను చైనా నేపథ్యమున్న వారి గురించి ఆలోచించా. సంతానం లేక బాధపడుతున్న వారిలో పిల్లలను కనాలనే కోరిక బలంగా ఉంటుంది. సంతానం కావాలనుకుంటున్న కొందరు స్వలింగ మిత్రులతోనూ మాట్లాడాను. నా ఆలోచన వారికి ఎలా సహాయ పడుతుందో వివరించారు.

ఆ తర్వాత అండదానం చేసేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాను. వెబ్‌సైట్‌లో అందమైన పిల్లల బొమ్మలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

అయితే, తొలిసారి స్క్రీనింగ్ ప్రక్రియలో విఫలమయ్యాను. ఎందుకంటే 1980 నుంచి 1997 మధ్యలో 6 నెలల కన్నా ఎక్కువ ఎవరైనా బ్రిటన్‌లో ఉంటే వారు అండదానానికి అనర్హులని ప్రకటించారు. దానికి కారణం వారికి బీఎస్ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అన్నారు.

కానీ అండదానం చేయాలనే కోరిక మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేసేందుకు బ్రిటన్ వచ్చాను. మళ్ళీ నా ప్రయత్నాలు మొదలు పెట్టాను.

ఇతర దాతలకు ఖర్చుల కోసం దాదాపు 750 పౌండ్లు, అంటే సుమారు రూ. 65 వేలు ఇచ్చేవారు. కానీ నేను మాత్రం డబ్బుల కోసం దానం చేయలేదు.

ఆ తర్వాత నేను మరో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నా. స్క్రీనింగ్ ప్రక్రియ కోసం పిలుపు వచ్చింది. వారు నన్ను చాలా ప్రశ్నలడిగారు. నిర్వాహకుడు, నర్స్, వైద్యుడు అందరూ అండదానం ఎందుకు చేస్తున్నానో అడిగారు.

నేను మాత్రం 'కుటుంబాలు సంపూర్ణంగా ఉండాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నా' అని చెప్పాను.

నాకు తెలిసినంత వరకు చైనా సంస్కృతిలో అండదానం చేయడం తప్పు అని ఎక్కడా లేదు. కానీ అమ్మకు ఈ విషయం చెప్పడానికి కొంత సమయం పట్టింది. తాను చనిపోతే ఇతరులకు ప్రయోజనం కలిగేలా అవయవదానం చేయాలని ఉందని అమ్మ తరచూ చెప్పేది.

అండదానం కూడా అలాంటిదే. కానీ అండదానంతో పుట్టే పిల్లల శరీరంలో మన జన్యువులుంటాయి. మరి నా తల్లిదండ్రులు తమకు కూడా మనవళ్ళున్నారని ఆనందంగా ఉంటారా?

ఫొటో సోర్స్, Christopher Paul Csiszar

అమ్మతో దీని గురించి చెప్పినప్పుడు 'నాన్నకు ఈ విషయం చెప్పొద్దు' అని వారించింది.

స్క్రీనింగ్ ప్రక్రియ తర్వాత అండదానంపై డాక్టర్లు నాకు సమగ్రంగా వివరించారు. ఒకసారి అండదానం చేసిన తర్వాత మళ్ళీ శరీరంలో అండాలు పెద్దవి కావడానికి సమయం పడుతుందని చెప్పారు. అలా వివరించడం నాకు సమంజసమనిపించింది.

నా వల్ల ఒక జంట తల్లిదండ్రులుగా ఎలా మారబోతున్నారోనని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా ఎత్తు, బరువు, నా కళ్ళ రంగు, మెడికల్ హిస్టరీ అంతా వివరించాను. కానీ అది సరైన పధ్ధతి కాదని నాకు అనిపించింది. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఏ వృత్తిని ఎంచుకుంటాడో, ఎలా మారతాడో, ఆ బిడ్డకేమిష్టమో తల్లిదండ్రులకెలా తెలుస్తుంది?

ఇంకా ఆ క్లినిక్‌లో నా అలవాట్ల గురించి, నేను సంగీతం వింటానా లేదా అని అడిగారు. అప్పుడు ఏదో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నట్లు నాకు అనిపించింది.

ఫొటో క్యాప్షన్,

రక్తం తీసిన తర్వాత ఓ సమోసా ఇచ్చేవారు.

ఆ తర్వాత నాకు ఎన్నో వైద్య పరీక్షలు నిర్వహించారు. నా శరీరం నుంచి రక్తం తీయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నేను అభ్యంతరం చెప్పలేదు. రక్తం తీసిన ప్రతిసారీ నాకో సమోసా ఇచ్చేవారు. నాలో ఉత్సాహం నింపాలనే వారు అలా చేసి ఉంటారేమో!

రోజుకు రెండుసార్లు నాకు నేనే హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చుకునేదాన్ని. అలా చేస్తుంటే నేను కూడా డాక్టర్ అయిపోయినట్లు అనిపించేది. ఆ ఇంజెక్షన్లను నా ఫ్రిజ్‌లోనే పెట్టాను. ఇంట్లో కూడా ఆ సూదుల గురించి ఎవరూ నన్ను అడగలేదు.

ఇంజెక్షన్లు చూస్తే అమ్మకు బాధ కలిగేది. ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు దాన్ని చూడలేక అమ్మ నా గది నుంచి బయటికి వెళ్లిపోయేది.

నా మనసు చాలా సున్నితమైంది. పాటలు వింటున్నప్పుడు, జంతువుల వీడియోలు చూస్తున్నప్పుడు నా కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తాయి.

డాక్టర్ల అపాయింట్‌మెంట్‌‌కు తక్కువ సమయమే పట్టినా వివిధ పరీక్షలకు చాలా సమయం పట్టేది. అదృష్టం బావుండి నేను పార్ట్ టైం ఉద్యోగం మాత్రమే చేసేదాన్ని. అది కూడా సాయంత్రం ఉండేది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పట్టింది.

అండదానానికి సమయం దగ్గర పడిన సమయంలో ఓ నర్సు నుంచి నాకో మెసేజ్ వచ్చింది. క్లినిక్ దగ్గర ఉగ్రవాద దాడి జరిగిందని, ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయన్నది దాని సారాంశం.

ఆ క్లినిక్‌లో పని చేసే ఉద్యోగుల్లో ఎవరినీ అక్కడకు అనుమతించడం లేదని, అత్యవసర కేసులొస్తే వారిని హార్లే స్ట్రీట్ క్లినిక్‌కు పంపిస్తున్నారని ఆమె తెలిపింది. అండదానానికి నా దగ్గర చాలా తక్కువ సమయం ఉంది. అందుకే త్వరగా మరో అపాయింట్‌మెంట్ తీసుకున్నా.

ఫొటో సోర్స్, Getty Images

మరుసటి రోజు క్లినిక్‌కు వెళుతున్నప్పుడు, ఎలాగైనా అండదానం చేయాలని గట్టిగా అనుకున్నా. ఎందుకంటే కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి. అండదానం చేసిన తర్వాత ఉగ్రవాద దాడిలో నేను చనిపోయినా ఫర్లేదు అని అనుకున్నా. క్లినిక్‌కి వెళుతున్నంత సేపూ నా మది నిండా ఈ ఆలోచనలే.

ఎలాగోలా చివరికి హార్లే స్ట్రీట్ క్లినిక్ చేరుకున్నా. వెయిటింగ్ రూమ్ అందంగా అలంకరించి ఉంది. అక్కడ కొన్ని ప్యాషన్ మ్యాగజైన్లు ఉన్నాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూపించే బదులు వారు గోడపై ఉన్న పెద్ద ప్లాస్మా స్క్రీన్‌పై రిపోర్టులు చూపించారు.

ఆ తర్వాత అండాల సంఖ్య లెక్కపెట్టడం మొదలుపెట్టారు. అండాల సంఖ్య సరిపడా ఉంది. ఆ తర్వాత అండాలను తీసేందుకు వారు నిర్ణయించారు. మొత్తం ప్రక్రియను వివరించారు. అండదానానికి ముందు ఒకరోజు రాత్రి నుంచే ఏమీ తినకూడదని చెప్పారు.

మరుసటి రోజు పొద్దున్నే రావాలని అన్నారు. నేను మంచి బట్టలు వేసుకొని వెళ్లాలని అనుకున్నా. ఎందుకంటే నేను ఓ రోగినని అనుకోలేదు. అందులోనూ అది హార్లే స్ట్రీట్. అంటే మనం ఇంకా ఎలా ఉండాలి!

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అండదానం చేసే రోజు రానే వచ్చింది. మరుసటి రోజు క్లినిక్‌కి వచ్చి వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్నా. అక్కణ్ణుంచి నాకు ఇతర మహిళల అరుపులు వినిపిస్తున్నాయి. వారు కూడా నాలాగే అండదానానికి వచ్చారని తెలిసింది. వాళ్ళు నాకు కనబడలేదు. అప్పుడే ఎవరో 'చైనా మహిళ' అని చెబుతుంటే నా వంతు వచ్చేసిందని అర్థమైంది.

నా జీవితంలో నాకెప్పుడూ మత్తుమందు ఇవ్వలేదు. నేనెప్పుడూ హాస్పిటల్ గౌను కూడా తొడుక్కోలేదు. హాస్పిటల్ గౌనులో బాత్రూంలో సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు బహుశా అక్కడున్న నర్సులు నా గురించి ఏమనుకున్నారో.

వీల్ చైర్‌లో ఆపరేషన్ థియేటర్ వైపు వెళుతున్నప్పుడు పరిసరాలను నిశితంగా గమనించా. ఎందుకంటే ప్రతి విషయం నాకు గుర్తుండాలి అనుకున్నా. సర్జరీ 15 నిముషాల పాటు సాగింది.

అప్పుడు నేను నిద్రమత్తులో పడుకుంటూనే ఉన్నా. ఓ నర్సు వచ్చి బిస్కెట్లు కావాలా అని అడిగినప్పుడు అంతగా స్పృహలో లేకున్నా కావాలని అన్నా.

అప్పుడే 'మీ దానానికి ధన్యవాదాలు' అని రాసి ఉన్న ఓ చాక్లెట్ల బాక్సు ఇచ్చారు.

నా శరీరం నుంచి మొత్తం 11 అండాలు తీసుకున్నామని చెప్పారు. నాకు ఎంతో ఆనందం కలిగింది.

సంతాన కోరికను సాకారం చేసుకుంటున్న తల్లిదండ్రుల్లో సౌహార్ద స్ఫూర్తి నింపే లేఖ రాయమని అన్నారు. ఎందుకంటే ఆ లేఖ ద్వారానే వారు నన్ను సంప్రదించొచ్చు.

క్లినిక్ నుంచి వచ్చిన వెంటనే నా ఫోన్‌లో ఓ లేఖ రాశాను. పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తూ భావోద్వేగానికి గురయ్యాను. కన్నీళ్లు వచ్చేశాయి.

మీ ప్రేమ, ప్రణాళికతోనే పిల్లలు పుడుతున్నారని, వారి గురించే అందరూ ఆలోచించడం చాలా సంతోషాన్నిస్తుందని ఆ లేఖలో వివరించాను.

నా గురించి, సామాజిక న్యాయం కోసం నా ఆశ, అభిలాష గురించి కూడా వివరించా.

18 ఏళ్ల వయసులోనే ఇదంతా జరగడం సంతోషంగా అనిపిస్తుంది.

నేను మరోసారి దానం చేస్తానా? బహుశా చేయొచ్చేమో. అది నేననుకున్నంత కష్టమైన పనేమీ కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాననే సంతృప్తి నాకెప్పుడూ ఉంటుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)