జింబాబ్వేలో జరుగుతోంది తిరుగుబాటా? కాదా?

జింబాబ్వే సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

జింబాబ్వేఅధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆ దేశ సైన్యం పదవీచ్యుతుడిని చేసింది. అనంతరం ప్రభుత్వ ప్రసార కేంద్రం జెడ్.బీ.సీ.ని కూడా స్వాధీనం చేసుకుంది.

జింబాబ్వే రాజధాని హరారే నగర వీధుల్లో సైనికులు, యుద్ధ వాహనాల దృశ్యాలు కన్పించాయి. తుపాకీ, ఫిరంగులు కాల్పులు కూడా వినిపించాయి. ఇది తిరుగుబాటు కాదని సైన్యం చెబుతోన్నా, దేశంలో నెలకొన్న పరిస్థితులు దానినే సూచిస్తున్నాయి.

దశాబ్దాల కాలంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగిన తిరుగుబాట్లలో సామీప్యత చాలా కనిపిస్తోంది. తిరుగుబాట్ల సందర్భంగా ఎప్పుడెప్పుడు, ఏయే దేశంలో ఎలాంటి పరిణామాలు, ప్రమాదాలు ముందుకొచ్చాయో ఓసారి చూద్దాం.

వీడియో క్యాప్షన్,

ముగాబే హీరోనా, విలనా ?

1. ష్.. ఇది తిరుగుబాటు’

తిరుగుబాటు ప్రాథమిక స్థాయిలో చాలా రహస్యంగా జరుగుతుంది.

జింబాబ్వేలో జరిగింది సైనిక తిరుగుబాటు అనడాన్ని ఆ దేశ రాయబారి ఐజాక్ మోయో ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక చర్యలేవీ జరగడం లేదని కూడా ఆయనన్నారు.

''సామాజిక, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నవారిని నియంత్రించడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి మేం కృషి చేస్తున్నాం. మా లక్ష్యం పూర్తయ్యాక దేశంలోని పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయి'' అని ఐజాక్ మోయో మీడియాతో అన్నారు.

కానీ ఈ సైనిక చర్యలు ఓ వర్గం వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి చర్యలు తిరుగుబాటు సమయాల్లో సర్వసాధారణమే.

వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మడురో కు వ్యతిరేకంగా ఆ దేశ సైన్యం ఆగస్టులో తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమైంది.

అప్పుడు కూడా ''ఇది తిరుగుబాటు కాదు. దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే మేం సైనిక చర్యలు చేపట్టాం'' అని వెనిజులా సైనిక నాయకుడు అన్నారు.

కానీ వెనిజులా అధికార పార్టీ ఈ మాటలను ఖండించింది. ఉపాధ్యక్షుడు కూడా, ఈ చర్యలను 'టెర్రరిస్ట్ దాడులుగా' పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, AFP

2. దేశాధ్యక్షుడు ఎక్కడ?

సాధారణంగా తిరుగుబాటు సమయాల్లో ఆ దేశాధ్యక్షులు ఎక్కడ ఉన్నారో గమనించాలి.

ప్రస్తుతం జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే రాజధాని హరారేలో గృహనిర్బంధంలో ఉన్నారని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. తాను క్షేమంగా ఉన్నానని ఫోన్ ద్వారా తమకు తెలిపినట్టు అధ్యక్ష కార్యాలయం చెప్పింది.

ముగాబే భార్య గ్రేస్ ముగాబే జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. 52 సంవత్సరాల గ్రేస్ తాను ముగాబే వారసురాలినని గతంలోనే ప్రకటించుకున్నారు. అయితే మంగళవారం రాత్రి గ్రేస్ ముగాబే నమీబియా వెళ్లిపోయారని వ్యతిరేక వర్గానికి చెందిన ఎం.పీ. ఎడ్డి క్రాస్ బీబీసీతో అన్నారు.

తిరుగుబాటు సమయాల్లో ఓ నాయకుడిపై గానీ, దేశాధ్యక్షుడిపై గానీ అదుపు సాధించడం కీలకమైన అంశం.

''2016లో జరిగిన టర్కీ తిరుగుబాటులో ఆ దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌ను అదుపులోకి తీసుకోవడంలో తిరుగుబాటుదారులు విఫలమయ్యారు. అందుకే ఆ తిరుగుబాటు విజయం సాధించలేకపోయింది'' అని బీబీసీ ప్రతినిధి జొనాథన్ మార్కస్ అన్నారు.

సాధారణంగా పదవిని, సింహాసనాన్ని కోల్పోయిన వారు విదేశీ రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం పొందుతారు. 1989లో అమెరికా అధ్యక్షుడు సీనియర్ జార్జ్ బుష్ పనామాపై యుద్ధం చేశారు. పనామాలో బలమైన నేతగా పేరుతెచ్చుకున్న జనరల్ మాన్యుఎల్ నోరియెగా పనామాలోని వాటికన్ సిటి రాయబార కార్యాలయంలో తల దాచుకున్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

జనరల్ మాన్యుఎల్ నోరిఎగ పనామాలోని వాటికన్ సిటి రాయబార కార్యాలయంలో తల దాచుకున్నారు

మరికొన్ని సంధర్భాల్లో దేశాధినేతలు విదేశాల్లో కూడా ప్రత్యక్షమవుతారు. 2009లో మధ్య అమెరికాలోని హోండురాస్‌ దేశాధ్యక్షుడిని సైనిక దళాలు బలవంతంగా విమానం ఎక్కించాయి. కోస్టారికా చేరుకున్నాక, తనను కిడ్నాప్‌ చేసినట్టు ఆయన చెప్పారు.

తర్వాత మూడు నెలలకు ఆయన తిరిగివచ్చి, హోండురాస్‌లోని బ్రెజిల్ విదేశీ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు.

3. వీధుల్లో ఆందోళనలు - తుపాకీ చప్పుళ్లు

తీవ్రస్థాయి ఆందోళనలు తిరుగుబాటుకు సంకేతాలు. ప్రజాస్వామ్యాన్ని కోరుతూ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు తరచూ సైనిక పాలనకు కారణమవుతాయి.

2010-11 లో జరిగిన ఈజిప్ట్ తిరుగుబాటు కూడా ఇలాంటిదే. దేశాధ్యక్షుడు హొస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రజలపై సైనిక చర్యలు ఉండవని ఆ దేశ సైన్యం ప్రకటించింది. దీంతో ప్రజల మద్దతుతో సైన్యం అధికారం చేపట్టింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images

2016లో విఫలమైన టర్కీ సైనిక తిరుగుబాటు సమయంలో, అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌‌కు మద్దతునిచ్చే సైనిక దళాలతో ప్రజలు జతకలిశారు. అధ్యక్షుడికి అనుకూలంగా ఉద్యమించారు.

జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే తన భార్య కోసం ఉపాధ్యక్షుడిని పదవి నుండి తొలగించారు. ఇలాంటి సమయాల్లో కూడా ప్రజల నుండి ఎటువంటి ఆందోళనలూ లేవు. సైనికులు మాత్రం, రాజధాని హరారేలో కవాతు చేశారు.

4. పౌరుల్లారా జాగ్రత్త

ఇటువంటి సమయాల్లో విదేశీ రాయబార కార్యాలయాలు తమ దేశ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. అది వారి కర్తవ్యం కూడా.

జింబాబ్వేలో ఇంగ్లాండ్ రాయబార కార్యాలయం హరారేలో ఉన్న తమ దేశ పౌరులు తమ ఇళ్లకే పరిమితం కావాలని, పరిస్థితులు చక్కబడేవరకూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ రాయబార కార్యాలయాన్ని బుధవారం నాడు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

అతి కొద్ది మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని ట్వీట్ చేసింది.

5. ప్రభుత్వ మీడియా సంస్థల స్వాధీనం

ఇలాంటి సమయాల్లో తిరుగుబాటుదారులు తమ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు ప్రసార మాధ్యమాలపై దృష్టి సారిస్తారు. జింబాబ్వేలో ప్రభుత్వ టీవీ ప్రసార కేంద్రం జెడ్.బీ.సీ.ని సైన్యం స్వాధీనం చేసుకుంది.

2016లో టర్కీలో జరిగిన తిరుగుబాటులో కూడా ప్రభుత్వ టెలివిజన్ ప్రసార కేంద్రాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్టు సైన్యం టీవీ ద్వారా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters

1997లో కూడా ఓసారి జింబాబ్వేలో తిరుగుబాటు జరిగింది. కానీ అది 3 గంటలలోనే ముగిసింది.

ఆరోజు ఉదయం 6 గంటలకు, ఓ వ్యక్తి జాతీయ రేడియో ఛానెల్‌లో మాట్లాడాడు. తన పేరు 'కెప్టెన్ సోలొ' అని, జింబాబ్వేను తాను స్వాధీనం చేసుకున్నానని ప్రకటించాడు.

సైనికాధికారులు, పోలీస్ అధికారులు అందర్నీ వారివారి పదవుల నుండి తొలగించినట్టు కూడా ప్రకటించాడు. అప్పటి అధ్యక్షుడు ఛిలుబా ఉదయం 9 గంటల్లోగా లొంగిపోకపోతే చంపేస్తామని హెచ్చరించాడు.

కానీ ఉదయం 10 గటలకు అధ్యక్షుడు ఛిలుబా రేడియోలో ప్రసంగించారు. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. తర్వాత దేశ సైన్యాన్ని కూడా అభినందించారు.

6. సరిహద్దులు, విమానాశ్రయాల మూసివేత

దేశం మీద కానీ, దేశ రాజధాని మీద కానీ పట్టు సాధించడానికి తొలుత సరిహద్దులను కట్టుదిట్టం చేస్తారు. ఎవ్వరూ దేశం వదిలి పోవడానికి వీలు లేకుండా కట్టడి చేస్తారు.

2015 సెప్టెంబర్‌లో బుర్కినా ఫాసోలో తిరుగుబాటుదారులు సరిహద్దులు, విమానాశ్రయాలను స్తంభింపచేశారు. రాత్రి సమయాల్లో కూడా కర్ఫ్యూ విధించారు.

1999లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, సైనికాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషర్రఫ్‌ను పదవి నుండి తొలగించేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో పర్వేజ్ ముషర్రఫ్ శ్రీలంకలో ఉన్నారు. పదవి నుండి తొలగించేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ కుట్రపన్నుతున్నారన్న సమాచారం పర్వేజ్‌కు అందింది.

దీంతో హుటాహుటిన ఆయన కరాచీ బయల్దేరారు. కానీ, పర్వేజ్ ప్రయాణిస్తున్న విమానం కరాచిలో దించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు నిరాకరించారు.

ఈ విమానాన్ని మొదట ఒమన్, ఆ తర్వాత ఇండియాకు మళ్లించాలని పైలట్‌ను ఆదేశించారు. కానీ విమానం కరాచీ వదిలి వెళ్లొద్దని, కరాచీ గగనతలంలోనే ఉండాలని పర్వేజ్ పైలట్‌ను ఆదేశించారు.

ఈలోగా పర్వేజ్ అనుకూల సైన్యం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను చుట్టుముట్టింది. విమానం ఎయిర్‌పోర్టులో దిగేలా ఏర్పాటు చేశారు.

దీంతో జనరల్ ముషార్రఫ్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తాన్ అధికార పగ్గాలను మళ్లీ దక్కించుకున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)