జింబాబ్వే సంక్షోభం: ముగాబే పాలనకు ముగింపు పలుకుతున్న ప్రజలు

ముగాబే వైదొలగాలని జింబాబ్వే యువత ఆందోళన చేస్తోంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ముగాబే వైదొలగాలని జింబాబ్వే యువత ఆందోళన చేస్తోంది

జింబాబ్వే రాజధాని హరారే వీధుల్లో వాతావరణం ఆనందోత్సాహాలతో కనిపించింది. అధ్యక్ష పదవికి ముగాబే రాజీనామా చేయాలంటూ మొదలైన ఆందోళన కాస్త ఆయనను అధికారం నుంచి దింపేసిన ఆర్మీని ప్రశంసించే ర్యాలీగా మారింది.

వీధుల్లోకి వస్తున్న ఆందోళనకారులు.. సైనికులను హత్తుకుంటూ వారిని ప్రోత్సహిస్తున్నారని బీబీసీ ప్రతినిధి చెప్పారు.

'కొత్త శకం మొదలైంది' అని ఓ వ్యక్తి బీబీసీతో అన్నారు.

ఈ ర్యాలీకి అధికార జను పీఎఫ్ పార్టీ, సైన్యం కూడా మద్దతిస్తోంది.

గతేడాది వరకు అధ్యక్షుడు ముగాబేకు అనుకూలంగా ఉన్న మాజీ సైనికులు కూడా ఇప్పుడు ఆయన పదవి నుంచి దిగిపోవాలని అంటున్నారు.

'ముగాబే పాలనను పూర్తిగా తుడిచి పెట్టేసే ఉద్యమం ఇది. ఆయన మళ్లీ అధికారంలోకి రాకపోవచ్చు' అని హరారేలోని బీబీసీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

'శాంతియుతంగా సైన్యం జోక్యం చేసుకోవడంపై ఓ జింబాబ్వేయిన్‌గా సైన్యానికి ధన్యవాదాలు చెబుతున్నా' అని ఈ ర్యాలీకి వచ్చిన ఓ వ్యక్తి పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

ప్ల కార్డులు ప్రదర్శిస్తున్న ఆందోళనకారులతో జింబాబ్వేలో ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది

'ముగాబే వైదొలగాలి, ఆయనను ఇక చూడాలనుకోవడం లేదు. మాకైతే ఇది సరికొత్త ప్రారంభం' అని అక్కడి జనసమూహం నినదిస్తోంది. 'దేశంలో అధికార పాలన ముగిసింది, జింబాబ్వేను ఇక పునర్ నిర్మిస్తాం' అని అంటోంది.

గత బుధవారం అధికార పగ్గాలను ఆర్మీ చేజిక్కించుకున్నప్పటి నుంచీ ముగాబే గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే, శుక్రవారం మొదటిసారిగా ఆయన బయటకొచ్చారు. తాను చాన్సెలర్‌గా ఉన్న ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగించారు.

ముగాబేను సైన్యం గృహనిర్బంధం చేసిన సమయంలో ఆయన సతీమణి గ్రేస్ ముగాబే ఆచూకీ తెలియరాలేదు. ఆమె దేశం వదిలి వెళ్లి పోయారని మొదట భావించారు. అయితే, గురువారం ఆమె ముగాబేతో ఇంట్లోనే కనిపించారు.

కాగా, ముగాబే మేనల్లుడు పాట్రిక్ ఝువో మీడియాతో మాట్లాడుతూ.. ముగాబే దంపతులు ‘ఏది సరైనదో దాని కోసం చావడానికైనా సిద్ధం’గా ఉన్నారని, వారు అధికారాన్ని వదులుకోరని తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

శుక్రవారం నిర్వహించిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అధ్యక్షుడు రాబర్డ్ ముగాబే పాల్గొన్నారు

తన భార్యకు అధికార పగ్గాలు అప్పగించేందుకు ఉపాధ్యక్షుడు ఎమర్సన్ నాన్‌గాగ్వాను గతవారమే ముగాబే పదవి నుంచి తొలగించారు. దీంతో దేశంలో సంక్షోభం మొదలైంది.

వారసత్వ పోరు నేపథ్యంలో సైన్యం జోక్యం చేసుకోవడంతో ముగాబే 37 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరపడింది.

అయితే, తాము ముగాబేతోనే ఉన్నామని, ఆయనతో జరిపిన చర్చల ఫలితాలను సాధ్యమైనంత త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తామని ఆర్మీ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ముగాబేను సైన్యం గృహనిర్బంధం చేసిన సమయంలో ఆయన సతీమణి గ్రేస్ ముగాబే కనిపించలేదు

రాత్రికి రాత్రే తొలగిన భయాలు

బీబీసీ ప్రతినిధి ఆండ్రూ హార్డింగ్ విశ్లేషణ

హారారేను చుట్టుముట్టిన ప్రజలు ముగాబేకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఆయన వెంటనే వైదొలగాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ముగాబే తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్ల హారన్‌ కొడుతూ కొందరు, బస్సుల పైకెక్కి జింబాబ్వే జాతీయ జెండాతో మరికొందరు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

సూపర్ మార్కెట్ నుంచి బయటికొచ్చి నేరుగా ఆందోళనకారులతో కలిసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'విప్లవమంటే ఇదే, ఇలాంటి పరిస్థితి రావడానికి చాలా ఏళ్లు పట్టింది' అని అన్నారు.

జింబాబ్వేలో ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ ర్యాలీకి అధికార జను పీఎఫ్ పార్టీ, ఆర్మీ అండదండలున్నాయి.

'దేశంలో తీవ్రమైన ఆర్థిక సమస్యల గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. నిరుద్యోగం తాండవిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు నాయకత్వం మారడం వల్ల ప్రజల జీవితం మారుతుందని అనుకుంటున్నాం. మాకు వెంటనే మార్పు కావాలి' అని హరారేలోని ఓ మహిళ పేర్కొంది.

'ముగాబే, ఆయన భార్య దేశం వదిలి వెళ్లిపోవాలి' అని ఉన్న ప్లకార్డు పట్టుకొని ఒకరు అధికార పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తిరుగుతుండటం కనిపించింది.

అధికార జను పీఎఫ్ పార్టీ ఇప్పుడు అంతర్గత ప్రక్షాళన మొదలు పెట్టింది. జింబాబ్వేపై తమ పట్టును పోగొట్టుకోకూడదని అనుకుంటోంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ఆర్మీ, అధికార పార్టీ అండదండలతోనే ప్రజలు ర్యాలీలు చేస్తున్నారు

హరారేలో ఆందోళన చేస్తున్నది ఎవరు?

వార్ వెటర్సన్ అసోసియేషన్ నేత క్రిస్టోఫర్ ముత్స్వాంగ్వా ఈ వారం మొదట్లోనే భారీ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

'మా వైభవాన్ని పునరుద్దరించాలనుకుంటున్నాం. ఆర్మీ ప్రారంభించిన పనిని మేం ముగిస్తాం' అని ఆయన చెప్పారు.

'ముగాబేకి మళ్లీ అధికారపగ్గాలు అప్పగించే అవకాశమే లేదు. ఆయన వైదొలగాలి' అని అన్నారు.

అలాగే, ముగాబే అధ్యక్ష పదవికి, పార్టీ కార్యదర్శి పదవులకు రాజీనామా చేయాలని జను పీఎఫ్ పార్టీకి చెందిన 10 ప్రాంతీయ శాఖల్లో 8 శాఖలు శుక్రవారం తీర్మానించాయి.

జాతీయ టీవీ చానెల్‌లో నిర్వహించిన చర్చల్లో ముగాబే వైదొలగాలని చాలా మంది నేతలు డిమాండ్ చేశారు.

అంతేకాదు, గ్రేస్ ముగాబే కూడా పార్టీ నుంచి వైదొలగాలని, నాన్‌గాగ్వాకు తిరిగి పార్టీ కేంద్ర కమిటీలో చోటు కల్పించాలని అన్నారు.

వారాంతంలో తలపెట్టిన ర్యాలీకి జనసమీకరణ చేస్తామని అధికార పార్టీ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు, ప్రస్తుత సంక్షోభంపై ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు పార్టీ వ్యూహరచన చేస్తోంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

గతంలో ముగాబేకు మద్దతుగా నిలిచిన మాజీ సైనికులు కూడా ఇప్పుడు ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు

అధికార పార్టీ మద్దతుదారులు, మాజీ సైనికుల సంఘం, ముగాబే వ్యతిరేకులంతా కలిసి ఒక్కతాటిగా ర్యాలీ నిర్వహించడం గతంలో ఎన్నడూ జరగలేదని బీబీసీ ప్రతినిధి అన్నె సోయి చెప్పారు.

ర్యాలీ నిర్వాహకులను తాము కలిశామని జింబాబ్వే రక్షక దళం ( జెడ్‌డీఎఫ్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆందోళనకారులు చేస్తున్న కార్యక్రమాన్ని 'సంఘీభావ ర్యాలీ'గా అభివర్ణించింది.

విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని ప్రజలకు సూచించింది. తాము ర్యాలీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపింది.

ముగాబేను వ్యతిరేకిస్తున్న ఉదారవాద సంఘాలు కూడా ఆందోళనకు మద్దతు పలికాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

'నాయకత్వం మారడం వల్ల ప్రజల జీవితం మారుతుందని అనుకుంటున్నాం. మాకు వెంటనే మార్పు కావాలి'

వివిధ దేశాలు ఎలా స్పందించాయి?

  • జింబాబ్వేలో వెంటనే పౌరపాలనను మొదలుపెట్టాలని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ కోరారు. దేశం కొత్త మార్గంతో ముందుకు వెళ్లడానికి ఈ సంక్షోభం ఒక అవకాశం అవుతుందని అన్నారు.
  • స్థిరమైన పాలన, శాంతియుత వాతావరణం ఏర్పడాలని బీజింగ్ కోరుకుంటోందని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షునాంగ్ చెప్పారు.
  • యూకే విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనకుండా అధికారం హస్తగతం చేసుకోవడం సరికాదని అన్నారు.
  • ముగాబే అధికారంలో ఉండటానికి ప్రాంతీయ నేతలు సైతం మద్దతివ్వడం లేదని బొట్స్‌వానా అధ్యక్షుడు ఇయాన్ ఖామా పేర్కొన్నారు.
  • ఆఫ్రికా యూనియన్ చైర్మన్ అల్ఫా కన్డే మాట్లాడుతూ.. ‘ఇది తిరుగుబాటులానే కనిపిస్తోంది.. రాజ్యాంగం ప్రకారం అధికార బదిలీ జరగాలి’ అని అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)