జింబాబ్వే సంక్షోభం:పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముగాబే తొలగింపు!

ముగాబే

ఫొటో సోర్స్, Reuters

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేపై అధికార పార్టీ జను-పీఎఫ్‌ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడి హోదా నుంచి తప్పించింది. ఆయన స్థానంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ నాన్‌గాగ్వాను నియమించింది.

రాబర్ట్ ముగాబే రెండు వారాల క్రితం ఎమర్సన్‌ను పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ముగాబే, ఎమర్సన్ నాన్‌గాగ్వాను తప్పించడం అసాధారణ పరిణామాలకు దారి తీసింది. సైన్యం తిరుగుబాటు చేసింది. తన స్థానంలో భార్య గ్రెస్‌కు పగ్గాలు అప్పగించాలని భావించిన ముగాబేను సైన్యం అడ్డుకుంది. ముగాబేను ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం చేసింది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ఎమర్సన్ నాన్‌గాగ్వా

వందలాది మంది జింబాబ్వే ప్రజలు శనివారం వీధుల్లోకి వచ్చి ముగాబేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ముగాబే ఆదివారం సైనిక నాయకులతో సమావేశం కావాల్సి ఉంది. అందుకోసం ఇప్పటికే ఆయన తన కాన్వాయ్‌తో తన సొంత ఇంట్లోంచి బయటికి వెళ్లారు.

జింబాబ్వే అధ్యక్ష పదవి నుంచి కూడా ముగాబేను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా అధికార పార్టీ చర్యలు మొదలు పెట్టిందని 'వార్ వెటరన్స్ అసోషియేషన్' అధ్యక్షుడు క్రిస్ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

మా ఇతర కథనాలు:

ఫొటో సోర్స్, AFP

ముగాబే భార్య గ్రేస్‌ను కూడా పార్టీ నుంచి తప్పించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.

ముగాబేను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించగానే కొందరు జింబాబ్వే ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించి బీబీసీ ప్రతినిధి ఆండ్రూ హార్డింగ్ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఈ నిర్ణయం అధికారికంగా అమల్లోకి రావాల్సి ఉందని ఆండ్రూ చెప్పారు.

గత కొన్ని రోజులుగా ముగాబేపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఆ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఉంటారని భావిస్తున్నారు.

జింబాబ్వేలో అనూహ్య పరిణామాలు

  • రెండు వారాల క్రితం జింబాబ్వే ఉపాధ్యక్షుడు ఎమర్సన్ నాన్‌గాగ్వాను ముగాబే పదవి నుంచి తప్పించారు. దాంతో ఎమర్సన్ దేశం వదిలి పారిపోయారు.
  • సోమవారం ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ చివెంగా, ముగాబే మద్దతుదార్లను హెచ్చరించారు. పార్టీ ప్రక్షాళన ఆపాలని డిమాండ్ చేశారు.
  • బుధవారం ప్రభుత్వ అధికారిక టెలివిజన్ చానల్‌ ప్రధాన కార్యాలయాన్ని సైనికులు సీజ్ చేశారు.
  • అధ్యక్షుడు ముగాబే కొన్నిరోజుల నుంచి గృహ నిర్బందంలోనే ఉన్నారు.
  • శనివారం ముగాబేకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరిగాయి. ముగాబేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
  • ఆదివారం అధ్యక్ష పదవి నుంచి ముగాబేను తప్పిస్తూ జమ పీఎఫ్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)