పదవి వదలను: రాబర్ట్ ముగాబే మొండిపట్టు

ఫొటో సోర్స్, Reuters
పదవి నుంచి దిగిపోవాలని వస్తున్న ఒత్తిళ్లను పక్కనపెడుతూ, జింబాబ్వే నేత రాబర్ట్ ముగాబే తాను అధ్యక్ష పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. రానున్న డిసెంబర్లో జరిగే పార్టీ కాంగ్రెస్‌కు తానే అధ్యక్షత వహిస్తానని టీవీ ద్వారా ప్రకటించారు.
అధికార జను-పీఎఫ్ పార్టీ ఇప్పటికే ఆయనను పార్టీ నేతగా తొలగించింది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని లేదా బలవంతంగా తొలగిస్తామని హెచ్చరించింది.
ఎమర్సన్ నాన్‌గాగ్వాను ముగాబే ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించిన నాటి నుంచి జింబాబ్వేలో సంక్షోభం ముదిరింది.
గత బుధవారం మిలటరీ తిరుగుబాటుతో ప్రభుత్వంపై ముగాబే పట్టు సడలుతోంది. ముగాబే తన భార్య గ్రేస్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నాలను ఆర్మీ వ్యతిరేకిస్తోంది.
ఫొటో సోర్స్, Reuters
ముగాబే, గ్రేస్
ఊహాగానాలకు చెక్
ముగాబే టీవీలో ప్రసంగిస్తుండగా ఆయన రాజీనామా చేస్తాడనే ఊహాగానాలతో ప్రజలు హరారే వీధుల్లో పెద్ద ఎత్తున గుమి కూడారు.
పక్కనే మిలటరీ జనరల్స్ నిలబడి ఉండగా ముగాబే, ''త్వరలో పార్టీ కాంగ్రెస్ సమావేశాలు జరగనున్నాయి. వాటికి నేనే అధ్యక్షత వహిస్తాను'' అని ప్రకటించారు.
ప్రభుత్వం, పార్టీలో వర్గాలు ఉన్న విషయాన్ని, తన వైఫల్యాలను అంగీకరించారు. పార్టీ, ప్రజలు, మిలటరీల ఆందోళనను ప్రస్తావించిన ముగాబే, దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వచ్చే నెల పార్టీ కాంగ్రెస్ సమావేశాలు జరిగే వరకు తానే జింబాబ్వే నేతగా ఉంటానని స్పష్టం చేశారు.
20 నిమిషాల ప్రసంగంలో ముగాబే, తాను రాజీనామా చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్ల గురించి, తన భార్య గ్రేస్ గురించి మాత్రం ప్రస్తావించలేదు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముగాబే, 1980లో స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి 37 ఏళ్లుగా జింబాబ్వేను పాలిస్తున్నారు.
ఫొటో సోర్స్, EPA
ఎమర్సన్ నాన్‌గాగ్వా
కొత్త నేత ఎమర్సన్
ఆదివారం జరిగిన జను-పీఎఫ్ పార్టీ సమావేశంలో ఎమర్సన్ నాన్‌గాగ్వాను కొత్త నేతగా ఎన్నుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనే పార్టీ అభ్యర్థి అని ప్రకటించారు.
ఇదే సమావేశంలో ముగాబే భార్య గ్రేస్‌తో పాటు పలువురు సీనియర్లను పార్టీ నుంచి బహిష్కరించారు.
పార్టీ నుంచి ముగాబేను బహిష్కరించిన నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే పార్టీ కాంగ్రెస్‌కు ఆయన అధ్యక్షత వహించడం సందేహాస్పదమే.
ఫొటో సోర్స్, Getty Images
1960లలో రాబర్ట్ ముగాబే (ఎడమ)
ఈ మొత్తం ఎపిసోడ్లో మొదట ముగాబేను వెనకేసుకొచ్చిన వార్ వెటరన్స్ అసోసియేషన్ ఇప్పుడు ఆయన రాజీనామాకు డిమాండ్ చేసింది.
రాజీనామా చేయకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. పార్లమెంటులో ఆయనను అభిశంసిస్తామని ప్రకటించింది.
జింబాబ్వే పార్లమెంట్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అధ్యక్షుడి అభిశంసన కోసం ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం అవసరం.
గతంలో ప్రతిపక్ష ఎండీసీ-టీ పార్టీ ఆయన అభిశంసన కోసం ప్రయత్నించింది. దీంతో ఈసారి ముగాబే అభిశంసన చాలా తేలికయ్యే అవకాశం ఉంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)