బీబీసీ ఇన్నోవేటర్స్: చెత్త, అట్టముక్కలు, పీచుతో ఇంటి పైకప్పులు

  • 21 నవంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబీబీసీ ఇన్నోవేటర్స్: చెత్త, అట్టముక్కలు, పీచుతో ఇంటి పైకప్పులు

హసిత్ గణంత్ర అనే ఇంజినీరు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మురికివాడల్లో నివసించే ప్రజల జీవితాలను, వారి ఇబ్బందులను దగ్గరగా పరిశీలించారు.

ఇళ్లు సరిగా లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన అర్థం చేసుకున్నారు.

భారతదేశ వ్యాప్తంగా సుమారు 6.5 కోట్ల మంది మురికివాడల్లో నివసిస్తున్నట్లు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి.

ఇవి కూడా చూడండి

"మనుషులు నివసించడానికి పనికిరాని ఇళ్లు ఉండే నివాస ప్రాంతాలను" మురికి వాడలుగా పరిగణిస్తారు.

"ఒకసారి మీరు మురికివాడల్లోని ఇళ్ల పైకప్పులు చూడండి. లెక్కలేనన్ని చిల్లులు పడి ఉంటాయి. పైకప్పు ఇంత అధ్వానంగా ఎందుకు ఉందని వారిని ప్రశ్నిస్తే, మాకు అంతకన్నా మెరుగైన ఇళ్లు కట్టుకునే స్తోమత లేదని వారు చెబుతారు" అని గణంత్ర అన్నారు.

మురికివాడల్లోని ఇళ్ల పైకప్పులు సాధారణంగా రేకులు లేదా కాంక్రీట్‌తో నిర్మిస్తారు. దీంతో వీటిలో నివసించే వారిపై వాతావరణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.

ఎండా కాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో చలి తీవ్రతను తట్టుకోవాల్సి ఉంటుంది. వానా కాలంలో ఇళ్లు కురుస్తుంటాయి.

చదువు తర్వాత సొంత ఊరికి తిరిగొచ్చిన ఇంజినీరు గణంత్ర, ఇంటి పైకప్పులను మరింత నాణ్యంగా నిర్మించాలని సంకల్పించారు.

ఇవి చౌకగా ఉండాలి. దీర్ఘకాలం మన్నాలి. నివసించే వారికి సౌకర్యంగా ఉండాలన్నది ఆయన తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇవి కూడా చూడండి

సవాళ్లను ఎదుర్కొని..

చివరకు "మడ్‌రూఫ్" అనే సంస్థను గణంత్ర ప్రారంభించారు. నమూనా పైకప్పులను తయారు చేయడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. 300 పైచిలుకు ప్రయత్నాలు చేశారు.

చెత్త, పనికిరాని అట్టముక్కల గుజ్జు, పీచు వంటి వాటితో పైకప్పులు తయారు చేశారు. ఇవి గట్టిగా ఉండటంతోపాటు తడిసినా నానకుండా, చెమ్మపట్టకుండా ఉంటాయి.

"చాలా మంది నిపుణులు ఇది సాధ్యం కాదని వదిలెయ్యమని నాకు చెప్పారు" అని గణంత్ర తెలిపారు.

"మురికివాడల్లో సమస్యను చూసినప్పుడు వారి కోసం మనం ఏదైనా చేయాలి" అని నాకనిపించింది అని ఆయన చెప్పారు.

Image copyright Hasit Ganatra
చిత్రం శీర్షిక భవిష్యత్తులో పైకప్పులకు సౌరశక్తి పలకలను కూడా అమర్చుతామని హసిత్ గణంత్ర చెబుతున్నారు

మడ్‌రూఫ్ సంస్థ అమ్మకాల బృందంలో అందరూ మహిళలే. వీరిలో చాలా మంది ఆ సంస్థ వినియోగదారులే.

ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఈ మహిళలు మడ్‌రూఫ్ నిర్మించే కొత్తరకం పైకప్పులు ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో తోటివారికి చెబుతున్నారు.

మురికివాడల వాసులకు ఈ పైకప్పులు మెరుగ్గా ఉన్నాయని సేల్స్ ఉమన్ కౌసల్య షామ్ర చెప్పారు.

"ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారు ఎంతో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది" అని ఆమె అన్నారు.

"అటువంటి వారికి ఈ పైకప్పుల నిర్వహణ ఎంత సులభమో వివరిస్తాం. వీరిలో ఎక్కువ మంది పేదలే కాబట్టి రుణాలు లభించేలా సాయం చేస్తాం" అని ఆమె వివరించారు.

ఇవి కూడా చూడండి

చదరపు అడుగుకు రూ.260

సగటున 250 చదరపు అడుగుల పైకప్పుకు సుమారు రూ. 65,000 ఖర్చు అవుతుంది. రేకులతో చేసే పైకప్పుతో పోలిస్తే ఇది ఖరీదైనది. కాంక్రీటుతో పోలిస్తే చౌక.

అయితే మడ్‌రూఫ్ వినియోగదారుల్లో సగం మందికి సూక్ష్మ రుణాలు లభించాయి. నెలకు సుమారు రూ. 3,000 చొప్పున రెండు సంవత్సరాలు చెల్లిస్తారు.

"మా ఇంట్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పైకప్పు వల్ల ఎండా కాలంలో వేడి చాలా తీవ్రంగా ఉంటోంది. ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది." అని సకీనా చెబుతున్నారు. తమ ఇంటికి మెరుగైన పైకప్పును ఏర్పాటు చేసుకునేందుకు ఆమె సాధ్యమైనంత త్వరగా మడ్‌రూఫ్ కుటుంబంలో చేరాలని భావిస్తున్నారు.


దక్షిణాసియాలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలను 'బీబీసీ ఇన్నోవేటర్స్' సిరీస్ వెలుగులోకి తెస్తుంది.

సమస్యలకు పరిష్కారాలు చూపే గొప్ప ఆవిష్కరణలు మీకు ఎక్కడ కనిపించినా, మీరే అలాంటి పరిష్కారాలు కనుగొన్నా ఆ ఫొటోలను మాతో పంచుకోండి. yourpics@bbc.co.uk కి ఈమెయిల్ చేయొచ్చు. #Jugaad, #BBCInnovators హ్యాష్‌ట్యాగ్‌లతో @BBCWorldService కి షేర్ చేయండి. లేదా ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు..

BBC Innovators గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నీడనిచ్చే వస్తువు మాత్రమే

మురికివాడలను నిర్మూలిస్తానని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు.

2020 నాటికి పట్టణాల్లో అందుబాటు ధరలకే 2 కోట్ల గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది.

ఈలోపు మురికివాడల్లోని పరిస్థితులను మెరుగుపర్చేందుకు సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రీజియనల్ ఎక్సలెన్స్ (క్యూర్) వంటి సంస్థలు పని చేస్తున్నాయి.

"ఇంటి నిర్మాణంలో పైకప్పు ఎంతో కీలకం. ప్రజలకు మంచి ఇంటిని అందుబాటులోకి తీసుకు రావాలంటే పైకప్పు విషయంలో వినూత్నంగా ఆలోచించాలి" అని క్యూర్ డైరక్టర్ రేణు చోస్లా అభిప్రాయపడ్డారు.

Image copyright Hasit Ganatra

అహ్మదాబాద్‌ మురికివాడల్లో చాలా మంది పైకప్పును కేవలం నీడనిచ్చే వస్తువుగా మాత్రమే చూస్తారు.

తాను నడిపే పాఠశాలలో కొత్తరకం పైకప్పులను వినియోగించడం ద్వారా విద్యార్థులకు మరింత ఎక్కువసేపు బడిలో గడిపే అవకాశం లభించినట్లు సంజయ్ పటేల్ అనే వ్యక్తి చెప్పారు.

"పాఠశాల భవనంపైకి పిల్లలు ఎక్కుతారు. గాలి పటాలు ఎగుర వేస్తారు. అవసరమైతే అక్కడే నిద్రపోతారు. ఇంతకు ముందు రేకుల కప్పు ఉండేది. అది ఎందుకూ పనికొచ్చేది కాదు. దీనిపైకి పిల్లలను ఎక్కించడం ఎంతో ప్రమాదకరం" అని పటేల్ వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి

"మేము రూపొందించిన పైకప్పు ప్యానెళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వీటి గురించి విదేశీయులు అడుగుతున్నారు. ఎందుకంటే మురికివాడల్లో జీవనం అనేది అంతర్జాతీయ సమస్య." అని గణంత్ర అంటున్నారు.

20 ఏళ్లపాటు మన్నేలా పైకప్పు ప్యానెళ్లను మడ్‌రూఫ్ రూపొందించింది. త్వరలోనే మురికివాడల్లోని చాలా ఇళ్లకు తమ పైకప్పులను వినియోగించుకోవచ్చని గణంత్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)