జర్మనీ సంక్షోభం: ఏంగెలా మెర్కెల్‌ శకం ఇక ముగిసినట్లేనా?

  • 20 నవంబర్ 2017
జర్మనీ ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ Image copyright AFP/ Getty Images

సంప్రదాయ కన్జర్వేటివ్‌లు, గ్రీన్‌లు, ఉదారవాద ఫ్రీ డెమొక్రాట్స్ (ఎఫ్‌డీపీ) పార్టీల మధ్య కూటమి ఏర్పాటు చేయటంలో జర్మనీ ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ విఫలమయ్యారు.

ఈ పార్టీలతో కూటమి ఏర్పాటు ఆలోచనకు ‘జమైకా’ అని ముద్దు పేరు పెట్టారు కొందరు. ఈ మూడు పార్టీల రంగులు.. నలుపు, పచ్చ, పసుపులు జమైకా దేశ జాతీయ జెండాలోని రంగులు కావటమే ఇందుకు కారణం.

కూటమి ఏర్పాటుకు జరుగుతున్న చర్చలు విఫలం కావటంతో.. గత 12 ఏళ్ల నుంచి ఛాన్స్‌లర్‌గా దేశాన్ని పాలిస్తున్న ఏంగెలా చాలా పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు.

గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. పైగా మెర్కెల్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) గతంలో ఎన్నడూ లేనంతగా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దీనికి తోడు సీడీయూ భాగస్వామి అయిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌పీడీ)కి కూడా తక్కువ స్థానాలే వచ్చాయి. మొన్నటి వరకూ ప్రభుత్వంలో ఉన్న ఎస్‌పీడీ ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పింది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చే పార్టీలతో కలసి కూటమి ఏర్పాటు చేయాలని గత నాలుగు వారాలుగా మెర్కెల్ చర్చలు జరుపుతున్నారు.

స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు పలికే ఫ్రీ డెమొక్రాట్లు(ఎఫ్‌డీపీ), గ్రీన్స్‌తో కలిసి సీడీయూ-సీఎస్‌యూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆమె భావించారు.

కానీ, ‘భాగస్వామ్య పక్షాల మధ్య నమ్మకానికి పునాది లేదు’ అంటూ ఎఫ్‌డీపీ నాయకుడు క్రిస్టియన్ లియాండర్ ఈ చర్చల నుంచి తప్పుకున్నారు.

Image copyright AFP/ Getty Images
చిత్రం శీర్షిక చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు క్రిస్టియన్ లియాండర్ స్పష్టం చేశారు

అన్ని పార్టీలతో చర్చిస్తానన్న దేశాధ్యక్షుడు

మునుపెన్నడూ లేని పరిస్థితిని జర్మనీ ఇప్పుడు ఎదుర్కొంటోందని దేశాధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్‌మీర్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ తాను చర్చలు జరుపుతానని ఆయన ప్రకటించారు.

ఇప్పటి వరకూ చర్చల్లో పాల్గొనని పార్టీలను కూడా తాను చర్చలకు ఆహ్వానిస్తానని చెప్పారు. దేశ సంక్షమం కోసం రాజీ పడాలని, కలసికట్టుగా పనిచేయాలని రాజకీయ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.

జర్మనీ పార్లమెంటులో మొత్తం 709 స్థానాలుండగా.. సెప్టెంబర్ ఎన్నికల్లో సీడీయూ-సీఎస్‌యూ కూటమికి 246 సీట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే 60 తగ్గాయి. ఎస్‌పీడీకి 40 తగ్గి 153 వచ్చాయి. లెఫ్ట్ పార్టీకి ఐదు పెరిగి 69 రాగా, గ్రీన్ పార్టీకి నాలుగు పెరిగి 67 దక్కాయి. ఎఫ్‌డీపీ 80 స్థానాల్లో, ఏఎఫ్‌డీ 90 స్థానాల్లో గెలిచాయి. ఈ రెండింటికి గతంలో ఒక్క సీటు కూడా లేదు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సెప్టెంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర్నుంచి మెర్కెల్ ప్రభ తగ్గుతోంది

విచారం వ్యక్తం చేసిన మెర్కెల్

కాగా, కూటమి ఏర్పాటుకు జరుపుతున్న చర్చలు విఫలం కావటం పట్ల మెర్కెల్ విచారం వ్యక్తం చేశారు.

కష్టకాలంలో దేశానికి సరైన పాలన అందించేందుకు ఒక ఛాన్స్‌లర్‌గా తాను చేయగలిగినదంతా చేస్తానని ఆమె చెప్పారు.

మెర్కెల్‌కు పార్టీ నాయకత్వం మద్దతు కొనసాగుతోందని సీడీయూ ఉపాధ్యక్షుడు అర్మిన్ లస్చెట్ జర్నలిస్టులతో అన్నారు.

ఇదిలా ఉండగా.. మెర్కెల్ నేతృత్వం వహించే మహా కూటమిలో చేరేది లేదని సోషల్ డెమొక్రటిక్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న మార్టిన్ స్కుల్జ్ స్పష్టం చేశారు.


మళ్లీ ఎన్నికలే శరణ్యమా?

బీబీసీ బెర్లిన్ ప్రతినిధి జెన్నీ హిల్ విశ్లేషణ

యుద్ధానంతర జర్మనీలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం మెర్కెల్ శకానికి ముగింపు పలికే అవకాశముంది.

సెప్టెంబర్ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనతో డీలాపడ్డ మెర్కెల్‌కు మహా కూటమి ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జర్మనీ తిరిగి ఎన్నికలకు వెళుతుంది. అయితే, తాజాగా ఎన్నికలకు కూడా మెర్కెలే నేత‌ృత్వం వహించాలని ఆ పార్టీ ఆశించకపోవచ్చు.

ప్రస్తుత సంక్షోభానికి కారణాలు జర్మనీ అంతర్గత వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాలేదు.

మెర్కెల్ ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కోసం పోరాడాల్సి ఉంది. యూరప్‌లో స్థిరత్వానికి మారుపేరుగా నిలిచిన నాయకులంతా ఇప్పుడు సంక్షోభానికి చిరునామాలవుతున్నారు.


మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)