సోషల్‌ మీడియాలో ఇవాంకా ట్రంప్ హోరు

  • 21 నవంబర్ 2017
Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వస్తున్నారు.

ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఇవాంకా ట్రంప్ దర్శనమిస్తోంది. బంగారు రంగు జుత్తుతో.. సినీకవుల వర్ణనలో చెప్పాలంటే 'కోటేరులాంటి ముక్కు, కోల కళ్లు'తో తెలుగు ప్రజల ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో తెగ కనిపిస్తోంది.

ఆమెను ఆహ్వానిస్తూ కొందరు, రుసరుసలాడుతూ మరికొందరు, ఆరాధనతో కవితలల్లుతూ ఇంకొందరు తమ ఫేస్‌బుక్ వాల్‌లను నింపేస్తున్నారు.

ఇవాంకా రాక సందర్భంగా తెలంగాణ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) కోసం వస్తున్న ఆమె బస చేసే హోటల్, సదస్సు జరిగే ప్రాంతం, తెలంగాణ ప్రభుత్వం ఆమెకు విందు ఇచ్చే ఫలక్‌నుమా ప్యాలస్ ప్రాంతాల్లో రోడ్ల రూపురేఖలను మార్చేస్తున్నారు.

ఆమె వచ్చే మార్గంలో ఫ్లైఓవర్లకు ముస్తాబులు చేస్తున్నారు. ఆమె తిరిగేచోట చుట్టుపక్కల ఎక్కడా దోమ కూడా కనిపించకుండా పిచికారీలు చేస్తున్నారు.

ఇవాంకా వెళ్లే వరకూ బిచ్చగాళ్ల తరలింపు వాయిదా

నారీ నారీ నడుమ వైట్‌హౌస్

Image copyright facebook
చిత్రం శీర్షిక ఇవాంకా తమ గ్రామానికి రావాలని కోరుకుంటూ ఫేస్‌బుక్ యూజర్ పెట్టిన పోస్టింగ్

ఇదంతా ఒకెత్తయితే, భద్రత పేరుతో ఆంక్షలూ పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడ్రోజుల ముందు నుంచే ఇల్లు దాటి రావద్దని చెబుతున్నారంటున్నారు. అడుగు తీసి అడుగేయాలంటే అనుమతి ఉండాల్సిందేనని ఆదేశిస్తున్నారంటున్నారు. తమ వ్యాపారాలపై ఆంక్షలు పెడుతున్నారని చిరువ్యాపారులు రుసరుసలాడుతున్నారు.

ఇవాంకా కోసం చేస్తున్న ఈ హడావుడి అంతా చూస్తున్న ప్రజలు సోషల్ మీడియాలో సెటైర్లేస్తున్నారు. ఇవాంకా తమ ఊరికీ రావాలని కోరుకుంటున్నారు. ఆమె వస్తే, ఆమె కోసమైనా రోడ్లేస్తారని, దోమల బాధ తప్పిస్తారని ఆశ పడుతూ పోస్టులు పెడుతున్నారు.

''ఇవాంకా రాక.. మావూరి పక్కపొంటన్నా గాకపోయే'' అంటూ మహబూబ్ పాషా అనే ఫేస్‌బుక్ యూజర్ బురద నిండిన రోడ్ల ఫొటోలు పెట్టి తన నిరాశను వ్యక్తం చేశాడు.

''ఇవాంకా! మా ఊరికి కూడా రావమ్మా!! నువ్వొస్తేగానీ మా ఊరు బాగుచెయ్యరంట గవర్నమెంటోళ్లు'' అంటూ మురళీకృష్ణ ఆకురాతి అనే పెద్దాయన కూడా స్పందించారు.

Image copyright facebook
చిత్రం శీర్షిక బురదతో నిండిన రహదారుల చిత్రాలతో ఫేస్‌బుక్ పోస్టింగ్

కిరణ్ కుమార్ కుమార్ అనే యూజర్ అయితే ''ఇవాంకా ట్రంప్ మేడం.. మా రోడ్డు మీద మీ పవిత్ర పాదం మోపండి'' అని వేడుకుంటూ ఓ ఇమేజ్‌ను షేర్ చేశారు.

సుధాకర్‌రెడ్డి అనే నెటిజన్ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలతో ఓ వినతిపత్రాన్ని రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఇవాంకా అందాన్ని పొగుడుతూ ఓ నెటిజన్ కవిత ఒకటి షేర్ చేశారు.

...ఇలా సోషల్‌ మీడియాలో ఇవాంకా జపం చేస్తున్నారు తెలుగు నెటిజన్లు.

Image copyright facebook
చిత్రం శీర్షిక ఇవాంకాపై కవిత

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం