కాంతి కాలుష్యం: చీకటిని చంపేస్తున్న క‌ృత్రిమ వెలుగులు!

  • 24 నవంబర్ 2017
2012తో పోల్చితే 2016లో భారత్ మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయింది. Image copyright NASA
చిత్రం శీర్షిక 2012తో పోల్చితే 2016లో భారత్ మరింత ప్రకాశవంతంగా మారింది

ఇన్నాళ్లూ వాయు, నీటి, ధ్వని కాలుష్యాల గురించి విన్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు కాంతి కాలుష్యం కూడా వాటికి తోడైంది. ఇదేంటి కొత్తగా అని ఆశ్చర్యపోతున్నారా?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కృత్రిమ వెలుగులు విస్తరిస్తున్నాయి. దాంతో కాలగమనంలో ఏర్పడే సహజ చీకటి కనుమరుగవుతోంది. ఉపగ్రహాలు చిత్రీకరించిన భూగోళ చిత్రాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది.

2012 - 2016 మధ్య కృత్రిమ కాంతి ఏటా 2 శాతానికి పైగా పెరిగింది.(దిగువ చిత్రంలోని నిలువు గీతను కదపడం ద్వారా ఈ మార్పును గుర్తించొచ్చు)

Interactive 2012-16 మధ్య భారత్‌లో పెరిగిన కృత్రిమ కాంతి

2016

రాత్రి సమయంలో భారత్‌ను చూపే శాటిలైట్ చిత్రం, 2016

2012

రాత్రి సమయంలో భారత్‌ను చూపే శాటిలైట్ చిత్రం, 2012

పలు దేశాల్లోని నగరాల్లో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పోతోంది. ఇలా రాత్రిళ్లు మాయమవ్వడం మనుషులతో పాటు, యావత్ జీవజాతుల మనుగడపైనా దుష్ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి సమయాల్లో వెలుతురు ఎంత ఉందో లెక్కించేందుకు నాసా ఉపగ్రహంలో ప్రత్యేకంగా అమర్చిన పరికరంతో సేకరించిన వివరాలపై ఈ అధ్యయనం చేశారు.

Image copyright NASA
చిత్రం శీర్షిక నైలు నది పరిసర ప్రాంతాలు

కాంతిలో మార్పులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి.

అమెరికా, స్పెయిన్ వంటి దేశాలు ప్రపంచంలోనే "ప్రకాశవంతమైనవి"గా ఉన్నాయి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనూ వెలుతురు పెరిగింది.

యెమెన్, సిరియా వంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్న కొన్ని దేశాల్లో మాత్రం రాత్రి వెలుతురు తగ్గింది.

సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాలు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి. కానీ, ఈ కృత్రిమ వెలుగుతో మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి చేటేనని పరిశోధకులు అంటున్నారు.

ఈ అధ్యయనానికి సంబందించిన వివరాలను "ది జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్"లో ప్రచురించారు.

Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక బ్రిటన్‌లో రాత్రి సమయంలో మెరిసిపోతున్న ప్రాంతాలు

కాంతి కాలుష్యంతో ఎదురయ్యే సమస్యలు

  • కృత్రిమ వెలుతురు ప్రభావం పంటల దిగుబడిపైనా ఉంటుందని తాజాగా 'నేచర్' జర్నల్‌'లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మొక్కల్లో పరపరాగ సంపర్కానికి రాత్రి సమయాల్లో సాయపడే కీటకాల్లో కృత్రిమ కాంతి వల్ల చురుకుదనం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.
  • కృత్రిమ కాంతికి దూరంగా ఉండే చెట్లతో పోల్చితే, అధిక వెలుతురులో ఉండే పూల చెట్ల కాడలు వారం రోజుల ముందుగానే వాడిపోతున్నాయని బ్రిటన్‌లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.
  • రాత్రిళ్లు సంచరించే పక్షుల ప్రవర్తన నగరాల్లో కృత్రిమ వెలుతురు కారణంగా పూర్తిగా మారిపోతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
  • మనుషుల్లో నిద్రను ప్రేరేపించే హార్మోన్ 'మెలటోనిన్' ఉత్పత్తిపై నీలి రంగు కాంతి చెడు ప్రభావం చూపుతుందని అమెరికా వైద్య మండలి హెచ్చరించింది. అందుకే, తక్కువ నీలి కాంతిని వెదజల్లే ఎల్‌ఈడీ బల్బులను వినియోగించాలని సూచించింది.

కృత్రిమ వెలుగును కనిపెట్టడం ద్వారా పర్యావరణంలో అనేక భౌతిక మార్పులకు మానవుడు ఆజ్యం పోశాడని జర్మనీ జియోసైన్స్ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త క్రిస్టఫర్ కైబా అభిప్రాయపడ్డారు.

"బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి ధనిక దేశాల్లో సోడియం లైట్ల వాడకం తగ్గి, ఎల్‌ఈడీ బల్బుల వాడకం పెరుగుతుందని భావించాం. కానీ, అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. అమెరికా అంతే ప్రకాశంవంతంగా ఉంది. బ్రిటన్, జర్మనీలో వెలుగు మరింత పెరిగింది" అని క్రిస్టఫర్ బీబీసీకి చెప్పారు.

Image copyright NASA
చిత్రం శీర్షిక ప్రపంచవ్యాప్తంగా చాలా సముద్ర తీర ప్రాంతాల్లో కృత్రిమ వెలుతురు పెరిగింది

సహజ వెలుతురు కొంచెం తక్కువ ఉన్నా ఫర్వాలేదు కానీ మిరుమిట్లు గొలిపే కాంతి వల్ల జీవుల్లో చూపు మందగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..

ఎల్‌ఈడీ బల్బుల నుంచి వచ్చే నీలి కాంతిని ఉపగ్రహం సెన్సర్లు గుర్తించలేవు, మనుషుల కళ్లు మాత్రం గుర్తిస్తాయి.

అంటే, ఈ ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో చూపించిన దానికంటే భూమి మీద ఎక్కువ వెలుతురే ఉందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ బల్బుల వాడకం బాగా పెరిగిపోయింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచీకటికుండే సహజమైన సౌందర్యాన్ని కూడా కోల్పోతున్నామా?

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)