ముద్దు ద్వారా ప్రియుని నోట్లోకి డ్రగ్స్ పంపిన ప్రియురాలు

  • 25 నవంబర్ 2017
మెలిస్సా అన్ బ్లెయిర్ Image copyright Clackamas County Sheriff's office
చిత్రం శీర్షిక యాంథొని బలవంతం మీదే మెలిస్సా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఆమె న్యాయవాది చెప్పారు

ముద్దు పెట్టుకుంటే ప్రాణం పోతుందా?

ఓ ప్రియురాలి గాఢచుంబనం ఆమె ప్రియుడి ప్రాణాలు తీసింది. ఆమెకు రెండేళ్లు జైలు శిక్ష పడేందుకు కారణమైంది.

కేవలం ముద్దు పెట్టుకుంటేనే చనిపోతారా? అని ఆశ్చర్యంగా చూడకండి! ఆ ముద్దు వెనుక ఓ మత్తు పదార్థం (డ్రగ్) దాగి ఉంది.

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రానికి చెందిన మెలిస్సా అన్ బ్లెయిర్ ప్రియుడు యాంథొని పౌల్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ప్రియుడు హంతకుడు

కోర్టు రికార్డుల ప్రకారం తన అత్తను కత్తితో పొడిచి చంపినందుకు 41 ఏళ్ల యాంథొనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

2016 జూన్ 2న 46 ఏళ్ల మెలిస్సా తన ప్రియుడు యాంథొనిని కలుసుకునేందుకు ఒరెగాన్ రాష్ట్ర కారాగారానికి వెళ్లారు.

ఆ సందర్భంగా యాంథొనికి ఆమె రహస్యంగా నోటి ద్వారా "మెతాంఫెటమైన్" అనే మత్తు పదార్థాన్ని అందించేందుకు ప్రయత్నించారు.

చిన్నచిన్న పరిమాణంలో ఉండే ఏడు డ్రగ్ బెలూన్స్‌ను అధర చుంబనం ద్వారా తన నోటిలో నుంచి అతని నోటిలోకి మెలిస్సా పంపించారు.

అవి అన్నవాహిక ద్వారా మెల్లగా జీర్ణాశయంలోకి చేరుకున్నాయి. ఈ విధంగా కడుపులోకి చేరుకున్న డ్రగ్ బెలూన్స్‌లో రెండు పగిలి పోవడంతో అది విషపూరితంగా మారి యాంథొని మరణించినట్లు విచారణ జరిపిన అధికారులు వెల్లడించారు.

ఇద్దరూ బాధ్యులే

ఇందుకు యాంథొని, మెలిస్సా ఇద్దరూ బాధ్యులేనని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

"ఇది ఎంతో బాధాకరం. దీనికి వారిద్దరూ బాధ్యత వహించాల్సిందే"నని అమెరికాలోని జిల్లా న్యాయమూర్తి మార్కో హెర్నాండెజ్ అన్నారు.

యాంథొని బలవంతం చేయడం వల్లే మెలిస్సా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఆమె తరపున వాదించిన న్యాయవాది తెలిపారు.

"మెలిస్సా జీవితం ఆమె చేతుల్లో లేదు. యాంథొని చేతిలో ఆమె కీలు బొమ్మగా మారిపోయింది. అతను చెప్పినట్లు ఆమె ఆడాల్సిందే"నని జాన్ ర్యాన్సమ్ వివరించారు.

మత్తు పదార్థాల రవాణా చేసినందుకు ఆమెకు న్యాయమూర్తి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. శిక్ష అయిపోయిన తరువాత మరో మూడేళ్లు ఆమె మానసిక స్థితిని, మత్తు పదార్థాల అలవాటును అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షిస్తారు.

మెలిస్సాని యాంథొనికి తానే పరిచయం చేసినట్లు అతని స్నేహితురాలు బ్రాండీ పొకొవిచ్ అసోసియేటెడ్ ప్రెస్‌ వార్తా సంస్థకు చెప్పారు.

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న యాంథొని, తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకునేందుకు సహాయం చేసినట్లు బ్రాండీ తెలిపారు.

ఈ కేసులో మరో నలుగురు దోషులుగా తేలారు. వారికి కొద్ది రోజుల్లో శిక్ష విధించే అవకాశం ఉంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)