ముంబయి దాడుల 'మాస్టర్‌మైండ్' హఫీజ్ సయీద్ విడుదల

  • 24 నవంబర్ 2017
హఫీజ్ సయీద్ Image copyright Reuters

2008 ముంబయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారిగా భారత్, అమెరికాలు చెబుతున్న హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి పాకిస్తాన్ విడుదల చేసింది.

ఈ ఏడాది జనవరి నుంచి లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న సయీద్‌ను విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. అతనితో ప్రజల భద్రతకు ముప్పు ఉందన్న పాకిస్తాన్ ప్రభుత్వ వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది.

దాంతో అతణ్ని గురువారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసింది.

2008 నవంబర్ 26న ముంబయిలో ముష్కరులు సృష్టించిన మారణహోమంలో 160 మందికి పైగా చనిపోయారు. ఆ దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీదేనని భారత ప్రభుత్వం చెబుతోంది.

అమెరికా సైతం అతణ్ని 'మోస్ట్ వాంటెడ్' వ్యక్తుల జాబితాలో చేర్చింది. సయీద్‌ను అప్పగిస్తే 10 మిలియన్ డాలర్ల రివార్డు (సుమారు రూ.64 కోట్లు) ఇస్తామని కూడా ప్రకటించింది.

సయీద్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ముంబయి దాడుల్లో 160 మందికిపైగా మరణించారు

ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలతో కఠినంగా వ్యవహరిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో హఫీజ్‌ను ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది.

"నేను ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నానంటూ భారత్ ఎప్పుడూ ఆరోపణలు చేస్తుంటుంది. కానీ, ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని లాహోర్ కోర్టు తీర్పుతో రుజువైంది" అంటూ హఫీజ్ సయీద్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

పాకిస్తాన్ కేంద్రంగా లష్కర్-ఏ-తోయిబా మిలిటెంట్ గ్రూపును 1990లో సయీద్ ఏర్పాటు చేశారు. ఆ సంస్థపై నిషేధం విధించిన తర్వాత, 2002లో జమాత్ ఉద్ దవా అనే మరో సంస్థలో చేరారు.

"జుద్" అనే ఇస్లామిక్ సంక్షేమ సంస్థను నడుపుతున్నారు. అయితే, "అది సంక్షేమ సంస్థ కాదు, ఉగ్రవాద కూటమి" అంటూ అమెరికా ఆరోపించింది.

తమ దేశంలో జరిగిన పలు ఉగ్రవాద దాడులతో సయీద్‌కి ప్రమేయం ఉందంటూ భారత్ చెబుతోంది. పాకిస్తాన్ మాత్రం అతణ్ని దోషిగా నిలబెట్టేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు లేవంటూ బుకాయిస్తూ వచ్చింది.

ముంబయి దాడులతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసిన పాక్, సయీద్ మీద మాత్రం ఎలాంటి అభియోగాలూ నమోదు చేయలేదు.

2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు కూడా సయీద్‌ను 3 నెలల పాటు గృహ నిర్బంధించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు