అధ్యయనం: రోజుకు 3 కప్పుల కాఫీతో ’ఆరోగ్యానికి మేలు జరగొచ్చు’
- ఫిలిపా రాక్స్బై
- బీబీసీ న్యూస్
ఫొటో సోర్స్, Getty Images
కెఫీన్ ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది
పరిమితంగా కాఫీ సేవించడం సురక్షితమే అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక తెలిపింది. రోజుకు 3-4 కప్పుల కాఫీ వల్ల కొన్ని ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయని ఈ నివేదిక పేర్కొంది.
కాఫీ తాగే వాళ్లకు కాలేయ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని ఈ నివేదిక తెలిపింది. అయితే దానికి కాఫీయే కారణమని మాత్రం నిరూపణ కాలేదు.
గర్భంతో ఉన్నవారు కాఫీ ఎక్కువగా తాగడం హానికరమని కూడా నివేదిక తేల్చింది.
యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సైంటిస్టులు మానవ శరీరంలోని అన్ని అంశాలపై కాఫీ ప్రభావం గురించి పరిశోధన చేపట్టారు. దానిలో భాగంగా, 200కు పైగా పరిశోధనల నుంచి గణాంకాలు సేకరించారు.
కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం కానీ, దాని వల్ల మరణించే అవకాశం కానీ తక్కువని ఈ గణాంకాల వల్ల తెలుస్తోంది.
మా ఇతర కథనాలు:
అయితే కాఫీ తాగడం వల్ల ఎక్కువ లాభం మాత్రం వేరే ఉంది - క్యాన్సర్‌తో పాటు కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయి.
అయితే, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన ప్రొఫెసర్ పాల్ రోడెరిక్ మాట్లాడుతూ.. కాఫీ తాగడం వల్లనే ఇలా జరిగిందని ఈ పరిశోధన వెల్లడించలేదన్నారు.
''కాఫీ తాగే వారి వయసు, వారు పొగ తాగుతారా లేదా, వారు ఎంతసేపు వ్యాయామం చేసేవారు.. ఇవన్నీ కూడా ప్రభావం చూపి ఉండవచ్చు'' అని అన్నారు.
కాఫీ తాగడం మేలు చేస్తుందని ఇటీవల చాలా పరిశోధనలు తేల్చాయి.
అయితే యూకే 'జాతీయ ఆరోగ్య పథకం' (ఎన్హెచ్ఎస్) ప్రకారం.. గర్భిణులు రోజుకు 200 మిల్లీ గ్రాము కన్నా ఎక్కువగా, అంటే రెండు మగ్గుల ఇన్స్టెంట్ కాఫీ కన్నా ఎక్కువ తీసుకుంటే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
కాఫీపై జరిపిన పరిశోధనల్లో రోజుకు 400 మి.గ్రా. లేదా అంతకన్నా తక్కువ కెఫీన్ - లేదా 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగితే ఎలాంటి ముప్పూ లేదని తేలింది.
మా ఇతర కథనాలు:
ఫొటో సోర్స్, Getty Images
పరిమితంగా కాఫీ తాగితే ప్రమాదం లేదు
ఎంత కెఫీన్ ఉంది?
- ఒక మగ్ ఫిలర్ట్ కాఫీలో : 140 మి.గ్రా.
- ఒక మగ్ ఇన్స్టెంట్ కాఫీలో : 100 మి.గ్రా.
- ఒక మగ్ టీ లో : 75 మి.గ్రా.
- ఒక కోలా క్యాన్‌లో : 40 మి.గ్రా.
- ఒక 250 మిల్లీలీటర్ల ఎనర్జీ డ్రింక్‌లో : 80 మి.గ్రా. వరకు
- ఒక ప్లెయిన్ చాకొలెట్ బార్లో : 25 మి.గ్రా. కన్నా తక్కువ
- ఒక మిల్క్ చాకొలెట్ బార్లో : 10 మి.గ్రా. కన్నా తక్కువ
మా ఇతర కథనాలు:
ఫొటో సోర్స్, Getty Images
గర్భవతులు అధికంగా కాఫీ తాగితే ప్రమాదమని అధ్యయనాలు చెబుతున్నాయి
అయితే కొందరు సైంటిస్టులు కాఫీ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలపై మరింత కచ్చితమైన క్లినికల్ ట్రయల్స్ జరగాలని కోరుతున్నారు.
కాఫీ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది అన్నది కచ్చితంగా గుర్తించలేకున్నా, శరీరంలోని కణాలకు తక్కువ హాని చేసే, లేదా హాని కలగకుండా చేసే యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఫైబ్రోటిక్స్ వల్ల ఇది జరుగుతూ ఉండవచ్చని భావిస్తున్నారు.
కాఫీ తాగేవారు సహజంగానే ఆరోగ్యవంతులై ఉండవచ్చని, అది ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ టామ్ సాండర్స్ అభిప్రాయపడ్డారు.
''కాఫీ వల్ల కొందరికి తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా అది టాయిలెట్‌కు వెళ్లాలనే కోరికను కూడా పెంచుతుంది. కొంతమంది ఈ కారణం వల్లనే కాఫీ తాగరు.''
''గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నవాళ్లకు కొన్నిసార్లు కెఫీన్ లేని కాఫీని తాగమని సలహా ఇస్తారు. కెఫీన్ తాత్కాలికంగా అయినా, రక్తపోటును చాలా పెంచుతుంది'' అని సాండర్స్ తెలిపారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)