ఈజిప్టు: మసీదుపై దాడి, 235 మంది మృతి

  • 24 నవంబర్ 2017
తీవ్రవాదులు దాడికి పాల్పడిన మసీదు Image copyright EPA
చిత్రం శీర్షిక తీవ్రవాదులు దాడికి పాల్పడిన మసీదు

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో తీవ్రవాదులు జరిపిన బాంబు, తుపాకుల దాడిలో 235 మంది మరణించారని ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది.

బిర్ అల్-అబెద్ పట్టణంలోని అల్-రవాడ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దేశంలో 2013లో జరిగిన ఇస్లామిస్ట్ తిరుగుబాటు తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే.

భద్రతా బలగాలకు సహకరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

సంఘటన జరిగిన వెంటనే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి భద్రతా అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ఈ దుర్ఘటన నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు.

బ్రిటన్ ప్రధాని థెరిసా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేర్వేరు ట్వీట్లలో ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

ఏం జరిగింది?

ఆధునిక ఈజిప్టు చరిత్రలో అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి.

నాలుగు వాహనాలలో వచ్చిన దుండగులు ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచాక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో మసీదు కిక్కిరిసి ఉంది.

కనీసం వందమంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. దాడి అనంతరం మసీదులోని చిత్రాల్లో చాలామంది బాధితులు కనిపిస్తున్నారు.

దాడికి పాల్పడింది ఏ వర్గం వారైందీ ఇంకా తెలీలేదు. అయితే, మసీదు నుంచి బయటకు వస్తున్న వారిపైన, అంబులెన్సులపైన కూడా కాల్పులు జరిగాయని బాధితుల బంధువులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది.

నాటి నుంచి జరుగుతున్న దాడుల్లో వందలాది మంది పోలీసులు, సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేక్‌కు అనుబంధంగా ఉన్న ‘సినాయ్ ప్రావిన్స్ గ్రూప్’ ప్రధానంగా ఈ దాడులకు పాల్పడుతోంది.

Image copyright AFP

తీవ్రవాదుల లక్ష్యం ఎవరు?

సూఫీయిజాన్ని ఆచరించేవాళ్లు, ఇస్లామిక్ ఆధ్యాత్మిక వాదులే ఈ మసీదు వద్దకు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సహా చాలా జీహదీ సంస్థలు సూఫీలతో విభేధిస్తున్నాయి.


భీకర దాడి

సల్లీ నబిల్, బీబీసీ న్యూస్, కైరో

ఉత్తర సినాయ్ ప్రావిన్సులో చాలా ఏళ్ల నుంచి ఇస్లామిక్ మిలిటెంట్లు కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. స్థానిక భద్రతా బలగాలనే వాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

అయితే, ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని, దాడికి పాల్పడటం ఇదే మొదటిసారి. ఇలాంటి దాడుల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవటం, బాధితులు కావటం ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

ఉత్తర సినాయ్ ప్రావిన్సు ఎంతో కాలంగా మీడియాకు దూరంగా ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఏ మీడియా సంస్థకూ అనుమతి లేదు. ఆఖరికి ప్రభుత్వ మీడియా సంస్థలు కూడా ఇక్కడికి వెళ్లలేవు.

తరచూ జరుగుతున్న దాడులు ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సినాయ్‌ ప్రాంతంలో విజయం సాధించామంటూ అప్పుడప్పుడూ సైన్యం ప్రకటనలు చేస్తుంటుంది. కానీ, సైన్యానికి, తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న పోరుకు ఇప్పట్లో ముగింపు లేదనిపిస్తోంది.


ఈ దాడి చేసిందెవరు?

ఇస్లామిస్ట్ తీవ్రవాదు గత కొన్నేళ్లుగా సినాయ్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. 2013 జులైలో ఇస్లామిస్ట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీని సైన్యం గద్దె దించిన తర్వాత ఈ దాడులు తీవ్రతరమయ్యాయి. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి.

అప్పటి నుంచి వందలాది మంది పోలీసులు, సైనికులు, సాధారణ పౌరులు మృతిచెందారు. ఐఎస్‌కు అనుబంధ సంస్థ అయిన సినాయ్ ప్రావిన్సు గ్రూప్ ఈ ప్రాంతంలో దాడులు చేస్తోంది.

సెప్టెంబరు నెలలో అల్-అరిష్ సమీపాన ఒక వాహన శ్రేణిపై ఈ గ్రూపు జరిపిన దాడిలో కనీసం 18 మంది పోలీసులు చనిపోయారు.

ఈజిప్టులోని కాప్టిక్ క్రైస్తవ మైనార్టీలపైన కూడా ఈ గ్రూపు దాడులు చేస్తోంది. 2015లో రష్యాకు చెందిన విమానాన్ని కూడా తామే కూల్చేశామని ప్రకటించుకుంది. ఈ దుర్ఘటనలో 224 మంది పర్యాటకకులు మృతి చెందారు.

సినాయ్ ప్రావిన్సుపై ఆధిపత్యం సంపాదించాలని ఈ గ్రూపు ఆశిస్తోంది. తద్వారా ఇస్లామిక్ స్టేట్ పరిపాలనలోకి దీనిని తీసుకురావాలని చూస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)