హఫీజ్ విడుదలపై అమెరికా ఆందోళన.. అరెస్ట్ చేయాలని డిమాండ్

  • 24 నవంబర్ 2017
హఫీజ్ సయీద్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ విడుదల చేసింది

గత పది నెలలుగా పాకిస్థాన్‌లో గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్‌ను ఆ దేశం విడుదల చేయడంపై అమెరికా విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేసింది.

వందలాదిమంది అమాయక ప్రజల మరణానికి కారణమైన లష్కర్-ఎ-తోయిబా నేత హఫీజ్ సయీద్‌ను వెంటనే అరెస్టు చేసి అతడు చేసిన నేరాలకు గాను శిక్ష విధించాలని అందులో పేర్కొంది.

అమెరికా విదేశాంగ శాఖ తన ప్రకటనలో ముంబయి దాడులనూ ప్రస్తావించింది.

''ముంబయి దాడుల్లో అమెరికన్లు సహా 166 మంది అమాయక ప్రజలు మరణించారు. ఆ తరువాత 2008 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది'' అని గుర్తుచేసింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక ముంబయిలో ఉగ్రవాద దాడి వల్ల వందలాదిమంది మరణించారు

అమెరికాకు మోస్ట్ వాంటెడ్

కాగా, 2012లో హఫీజ్‌‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన అమెరికా అతడిని పట్టిచ్చినవారికి కోటి డాలర్ల రివార్డు ప్రకటించింది.

మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి హఫీజ్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం నిర్బంధించింది. అయితే, అక్కడి న్యాయస్థానం అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. హఫీజ్‌ను విడుదల చేస్తే ప్రజల భద్రతకు ముప్పు ఉంటుందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ ఈ విడుదల ఆదేశాలిచ్చింది.

దీంతో ఈశాన్య లాహోర్‌లో హఫీజ్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన ఒక వీడియో సందేశంలో ''భారత్ నిత్యం ఉగ్రవాద ఆరోపణలు చేస్తోంది. కానీ అదంతా అసత్యమని న్యాయస్థానం నిర్ణయంతో రుజువైంది. కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతాను'' అని ప్రకటించాడు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)