ఈజిప్టు మసీదు దాడి: దోషులను వదిలేది లేదని అధ్యక్షుడు అల్-సిసి హెచ్చరిక

  • 25 నవంబర్ 2017
24న బాంబు దాడి తర్వాత అంబులెన్సుల చుట్టూ మూగిన జనం Image copyright AFP/GETTY
చిత్రం శీర్షిక 24న బాంబు దాడి తర్వాత అంబులెన్సుల చుట్టూ మూగిన జనం

ఈజిప్టులోని ఓ మసీదుపై జరిగిన దాడి సంఘటనపై ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి తీవ్రంగా స్పందించారు. 235 మందిని పొట్టనపెట్టుకున్న తీవ్రవాదులపై చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

బిర్ అల్-అబెద్ పట్టణంలోని అల్-రవాడ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడులో 235 మంది చనిపోయారు.

దాడుల అనంతరం బిర్ అల్-అబెద్ పట్టణానికి సమీపంలోని తీవ్రవాద స్థావరాలపై ఈజిప్టు సైన్యం వైమానిక దాడులు చేసినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు చేరుకున్నాయి

ఈ దాడులు తమ చర్యేనంటూ ఇంతవరకూ ఏ తీవ్రవాద సంస్థా ప్రకటించలేదు.

ఈజిప్టు భద్రతా బలగాలు గత కొన్నేళ్లుగా సినాయ్ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో పోరాడున్నాయి. ఈ దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల హస్తం ఉందని భావిస్తున్నారు.

సాధారణంగా వీరు భద్రతా బలగాలపైనా, చర్చిలపైనా దాడులు చేస్తూవచ్చారు. కానీ సూఫీ ముస్లింలు ప్రార్థనలు చేసే మసీదుపై జరిగిన దాడి ఈజిప్టును కలవరపాటుకు గురిచేసింది.

Image copyright Reuters

దాడి జరిగిన తర్వాత దేశాధ్యక్షుడు అల్-సిసి మీడియాతో మాట్లాడారు -

''ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం చేస్తోన్న పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, సాయుధ బలగాలు ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాయి. వీలయినంత త్వరగా దేశంలో పరిస్థితులు చక్కబడతాయి.''

అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి గతంలో ఈజిప్టు సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అధ్యక్షుడిగా ఈజిప్టు దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

ఆధునిక ఈజిప్టు చరిత్రలో అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. 2013లో జరిగిన ఇస్లామిస్ట్ తిరుగుబాటు తర్వాత జరిగిన అతి పెద్ద దాడి ఇదే.

నాలుగు వాహనాలలో వచ్చిన తీవ్రవాదులు ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచాక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో మసీదు కిక్కిరిసి ఉంది.

మసీదుకు వెళ్లే దారిలోని వాహనాలకు తీవ్రవాదులు నిప్పు పెట్టారు. దీంతో మసీదును చేరుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.

మసీదు నుంచి బయటకు వస్తున్న వారిపైనా, అంబులెన్సులపై కూడా కాల్పులు జరిగాయని బాధితుల బంధువులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది.

Image copyright EPA

గత పరిణామాలివీ..

ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఇస్లామిస్ట్ అయిన మొహమ్మద్ మోర్సీని 2013లో అధ్యక్ష పదవిలోంచి తొలగించారు.

అప్పటి నుండీ ఐ.ఎస్.కు అనుబంధంగా పనిచేస్తోన్న సినాయ్ ప్రొవిన్స్ గ్రూపు వరుస దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో వందలాది మంది పోలీసులు, సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ తీవ్రవాదులు ఈజిప్టులోని క్రిస్టియన్ మైనార్టీల మీద దాడులు చేస్తూ వచ్చారు. 2015లో సినాయ్‌లో రష్యన్ విమానంపై జరిగిన బాంబుదాడి కూడా తమ చర్యేనని సినాయ్ ప్రొవిన్స్ గ్రూపు ప్రకటించుకుంది. ఆ దాడిలో 224 మంది మరణించారు.

సినాయ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి తీవ్రవాదులు వరుస దాడులు చేస్తున్నారు. వీరి కార్యకలాపాలు ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో జరిగేవి.

2014 నుండి ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రభుత్వ వార్తా సంస్థలకు చెందిన రిపోర్టర్లు కూడా ఆ ప్రాంతానికి వెళ్లడాన్ని నిషేధించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)