పాకిస్తాన్: ఇస్లామాబాద్‌లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు

  • 25 నవంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ దృశ్యాలు

పాకిస్తాన్‌లో ముస్లిం ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 200 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశాధికారులు తెలిపారు.

రాజధాని ఇస్లామాబాద్‌ సమీపంలోని ఫైజాబాద్ సమీపంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

Image copyright AFP

ముస్లిం మత సంస్థలు తెహ్రీక్ ఏ లబ్బయిక్ యా రసూల్ అల్లాహ్, సున్ని తెహ్రీక్ ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. గత 20 రోజులుగా ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గాయపడిన వారంతా పాకిస్తాన్ మెడికల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో 57మంది పోలీసులు, 46మంది సామాన్య ప్రజలు ఉన్నారు.

ఈ ఆందోళన ఫైజాబాద్ ఇంటర్ చేంజ్ ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్‌ ఇరు భాగాలనూ కలిపే ప్రాంతం ఇది.

Image copyright Reuters

ధర్నా చేస్తున్న ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు శనివారం ఉదయం పోలీసులు, భద్రతా దళాలు ప్రయత్నించటంతో హింస చెలరేగింది.

ఇస్లామాబాద్‌తో పాటు కరాచీ, లాహోర్, సియాల్ కోట్ తదితర ప్రధాన నగరాల్లో కూడా ఆందోళన ప్రభావం కనిపించింది.

దీంతో అక్కడి ప్రభుత్వం ఈ ఆందోళన కార్యక్రమాలను ప్రసారం చేయవద్దని అన్ని టీవీ చానెళ్లకు నోటీసులు జారీ చేసింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ప్రధాన టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసింది.

న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Image copyright EPA

ఆందోళనకు కారణం ఏంటి?

ఈ ఆందోళన పాకిస్తాన్ ఎన్నికల సంస్కరణ చట్టం 2017లో చేసిన తాజా సవరణకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. ఈ బిల్లులో జరిగిన ఓ సవరణ మొహమ్మద్ ప్రవక్త గౌరవానికి భంగం కలిగించేలా ఉందని, దీనికి న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ రాజీనామా చేయాలని గత 20రోజులుగా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Image copyright EPA

మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం అనుకోకుండా తప్పు జరిగిందని, అది ఉద్దేశపూర్వకంగా జరగలేదని వివరణనిచ్చింది.

Image copyright EPA

అయినా ఆందోళనకారులు వెనక్కితగ్గకపోవడంతో ఇస్లామాబాద్ హైకోర్టు ఆందోళనకారులను చెదరగొట్టాలని ఆదేశించింది. దీంతో ఆందోళనను విరమించాలని కోరుతూ ఆందోళనకారులకు ప్రభుత్వం గడువునిచ్చింది.

Image copyright Getty Images

గడువు పూర్తయినా వారు వెనక్కితగ్గకపోవడంతో ఈరోజు ఉదయం 7గంటల నుంచి భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఈ హింస చెలరేగింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)