ఉత్తర కొరియా మాజీ సైనికురాలు : ‘నెలసరి రాదు.. అత్యాచారం చేసినా ఎవరూ చెప్పరు’

ఉత్తర కొరియా మహిళా సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర కొరియా సైన్యంలో మహిళలపై అత్యాచారం, సరైన ఆహారంలేక చాలామంది స్త్రీలలో నెలసరి రాకపోవడం వంటివి సాధారణమని ఉత్తర కొరియా మాజీ సైనికురాలు లీ సో యేఆన్ అంటున్నారు.

"నాకు కేటాయించిన గదిలో పన్నెండు మంది ఇతర మహిళలు ఉండేవారు, అక్కడే పడుకునేదాన్ని. ప్రతీ మహిళకు ఓ చిన్న చెక్క డబ్బా ఇచ్చేవారు, అందులోనే బట్టలు పెట్టుకునేవాళ్లం" అని మహిళా ఆర్మీలో పనిచేసిన లీ సో యేఆన్ తెలిపారు.

"ఆ డబ్బా పైభాగంలో రెండు ఫోటోలు ఉండేవి, అందులో ఓ ఫోటో ఉత్తరకొరియా వ్యవస్థాపకులు కిమ్ II సంగ్‌ది, రెండోది ఉత్తరకొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్‌ది. ఆ దేశాన్ని వదిలి దాదాపు పదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి."

"ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు వరి పొట్టుతో తయారు చేసిన బెడ్‌పైనే పడుకునేదాన్ని. చెమట మొత్తం ఆ పడకపై కారడంతో దాన్నుంచి దుర్వాసన వచ్చేది. స్నానం చేసేందుకు కూడా సరైన సదుపాయం ఉండేది కాదు."

"ఒక మహిళ ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో ఒకటి స్నానం చేసేందుకు సరైన సదుపాయం లేకపోవడం. వేడి నీటి సదుపాయం ఉండేది కాదు. పర్వతాల నుంచి ప్రవహించే నీటికి ఓ పైపును అనుసంధానించి, ఆ పైపుతో వచ్చే నీటితోనే స్నానం చేసుకోమనేవారు. కొన్ని సార్లు ఆ నీటిలో కప్పలు, పాములు కూడా వచ్చేవి" అంటూ తాను అనుభవించిన పరిస్థితులను లీ సో వివరించారు.

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

కరవు, ఆకలితోనే ఆర్మీలో చేరిక

41 ఏళ్ల లీ సో యేఆన్ ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమార్తె. ఉత్తరకొరియాలోనే పుట్టి పెరిగారు. ఆమె కుటుంబంలోని చాలా మంది పురుషులు కూడా సైన్యంలో పనిచేసినవారే.

1990 దశాబ్దంలో ఉత్తర కొరియాలో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకు కనీసం ఒక్క పూటైనా భోజనం దొరుకుతుందనే ఆశతో ఆమె సైన్యంలో చేరారు. అప్పట్లో ఎందరో మహిళలు ఆకలి కష్టాల నుంచి తప్పించుకునేందుకు ఇలానే చేశారు.

"ఉత్తర కొరియాలో కరవు వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి మరింత దిగజారింది. ఆడవాళ్లంతా కూలి పని చేయడం మొదలుపెట్టారు. దాంతో వారిపట్ల అసభ్య ప్రవర్తన, శారీరక, లైంగిక వేధింపులు మరింత పెరిగిపోయాయి" అని 'నార్త్ కొరియా హిడెన్ రివల్యూషన్' రచయిత్రి జియోన్ బేక్ అభిప్రాయపడ్డారు.

ఉత్తర కొరియా సైన్యంలో చేరినప్పుడు లీ సో యేఆన్ వయసు 17 ఏళ్లు. "అప్పట్లో సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మొదటిసారి నా కోసం కేటాయించిన హెయిర్ డ్రైయర్ చూసి నా ఆనందం రెట్టింపయ్యింది. అయితే అప్పుడు సరిపడా విద్యుత్తు లేకపోవడంతో వాటిని తక్కువగా వినియోగించేవాళ్లం" అని లీ సో యేఆన్ తెలిపారు.

ఫొటో సోర్స్, SIPA PRESS/REX/SHUTTERSTOCK

పోషకాహారలోపంతోనే నెలసరి సమస్యలు

"మహిళలకు, పురుషులకు దాదాపు ఒకేలా పని ఉండేది. మహిళలకు శారీరక వ్యాయామం కాస్త తక్కువగా ఉండేది. కానీ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, వంట చేయడం వంటి పనులు మాతోనే చేయించేవారు" అని లీసో గుర్తు చేసుకున్నారు.

"ఉత్తర కొరియా పురుషాధిక్య సమాజంగానే ఉండేది. ఇప్పటికీ అలానే కొనసాగుతోంది" అని 'నార్త్ కొరియా ఇన్ 100 క్వశ్చన్స్' పుస్తక రచయిత్రి జూలియెట్ మొరిలాట్ తెలిపారు.

ఇప్పటికీ మహిళలకు కేవలం వంట బాధ్యతలే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఒకవైపు కఠినమైన శిక్షణ, మరోవైపు సరిపడ ఆహారం దొరక్కపోవడంతో లీ సోతోపాటు, ఇతర మహిళల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది.

"ఒత్తిడి వాతావరణం, సరైన పోషకాహారం లేకపోవడంతో మాకు ఆరు నెలల నుంచి ఏడాది వరకూ నెలసరి ఆగిపోయేది" అని లీ సో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నెలసరి రాకపోవడంతో మేము ఆనందంగా ఉన్నామని, నెలసరి వస్తే ఆ పరిస్థితిని ఇంకా తట్టుకోలేమని ఇతర మహిళలు తనతో అనేవారని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

శానిటరీ ప్యాడ్స్ కొరత

"ఇప్పటికీ మహిళలు శానిటరీ ప్యాడ్స్‌కి బదులు కాటన్ వస్త్రాన్ని వాడతారు. పురుషులు ఎక్కడ చూస్తారోననే భయంతో రాత్రిపూట ఆ వస్త్రాన్ని శుభ్రం చేసుకుంటారు" అని జూలియెట్ మొరిలాట్ తెలిపారు.

ఎందరో మహిళా సైనికులతో మాట్లాడిన తర్వాతే మహిళలకు నెలసరి ఆగిపోయే సమస్యలున్నాయని జూలియెట్ మొరిలాట్ ధ్రువీకరించారు.

"కఠినమైన శిక్షణతో రెండేళ్లుగా పీరియడ్స్ రావడంలేదని, 20 ఏళ్ల ఓ మహిళా సైనికురాలు తెలిపింది" అని జూలియెట్ మొరిలాట్ వెల్లడించారు.

లీ సో స్వచ్ఛందంగానే ఆర్మీలో చేరారు. కానీ 2015 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ సైన్యంలో చేరటాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

అదే ఏడాది అక్కడి ప్రభుత్వం ఆర్మీలో పనిచేసే ప్రతి మహిళకూ శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం గతంలో ఆర్మీలో పనిచేసిన మహిళల దుస్థితిని వివరిస్తుందని జూలియెట్ మొరిలాట్ తెలిపారు.

శానిటరీ ప్యాడ్స్‌ను ఇటీవలే అక్కడ పంపిణీ చేశారు. అయినా ఇప్పటికీ దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే మహిళా సైనికుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల సదుపాయం లేదు.

తాము కొన్నిసార్లు పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేదని కొందరు మహిళా సైనికులు తనతో అన్నారని జూలియెట్‌ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అత్యాచార ఘటనలు

ఆర్మీలో లైంగిక వేధింపుల గురించి మహిళా సైనికులను జూలియెట్ మొరిలాట్ ఆరా తీశారు. ఆర్మీలో అత్యాచారాలు జరుగుతాయని చాలామంది మహిళా సైనికులు అన్నారు. కానీ తమపై మాత్రం ఎలాంటి అఘాయిత్యం జరగలేదని జూలియెట్ కలిసిన కొందరు సైనికులు చెప్పారు.

1992 - 2001 మధ్యలో తాను ఆర్మీలో ఉన్నప్పుడు ఎవరూ తనను వేధింపులకు గురి చేయలేదని లీ సో యేఆన్ తెలిపారు. కానీ ఇతర మహిళా సైనికులపై అత్యాచారం జరిగిందని ఆమె వెల్లడించారు.

"కంపెనీ కమాండర్లు తమ గదుల్లో గంటలపాటు ఉంటూ మహిళా కమాండర్లను పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడేవారు. అలా ఎన్నో సార్లు జరిగింది" అని ఆమె తెలిపారు.

ఉత్తరకొరియా ఆర్మీ మాత్రం లైంగిక వేధింపులను ఉపేక్షించబోమని, అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అత్యాచార ఆరోపణలు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని కూడా తెలిపింది.

"కానీ చాలా సందర్భాలలో సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు తప్పించుకుంటున్నారు" అని జూలియెట్ మొరిలాట్ తెలిపారు.

పేద కుటుంబాల నుంచి వచ్చిన మహిళలను నిర్మాణ బ్రిగేడ్లలో నియమించి చిన్నచిన్న శిబిరాల్లో, గుడిసెల్లో ఉంచుతారు. ఈ పని వారికి అంత సురక్షితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఇప్పటికీ గృహ హింస విస్తృతంగా సమాజంలో అంగీకరించబడి ఉంది, కానీ వాటి గురించి ఎవరూ బయటికొచ్చి చెప్పడం లేదు. ఇప్పుడు ఉత్తర కొరియా ఆర్మీ పరిస్థితి కూడా ఇలానే ఉంది." అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Reuters

నదిలో దూకి అక్కడి నుంచి పరారై!

దక్షిణకొరియా సరిహద్దుకు దగ్గరలో సిగ్నలింగ్ యూనిట్‌లో రక్షక దళాధికారిగా లీ సో ఉండేవారు. 28 ఏళ్ల వయసులో ఆమె సైన్యం నుంచి బయటికొచ్చేశారు.

2008లో ఆమె దక్షిణకొరియా వైపు వెళ్లిపోవాలని ప్రయత్నించారు. మొదటి ప్రయత్నంలో చైనా వద్ద మోహరించి ఉన్న ఆర్మీ ఆమెను పట్టుకొని ఏడాదిపాటు జైలులో పెట్టింది.

జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె రెండో ప్రయత్నం చేశారు. ఈ సారి నదిలో దూకి అక్కడి నుంచి ఈదుకుంటూ చైనా ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఆమె ఓ దళారి సహాయంతో దక్షిణ కొరియా చేరుకున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)