ఉత్తర కొరియా – టార్గెట్ అమెరికా

  • 29 నవంబర్ 2017
క్షిపణి ప్రయోగం, ఉత్తర కొరియా Image copyright Reuters

అమెరికా మొత్తంలో ఎక్కడికైనా చేరుకోగల కొత్త తరహా ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది.

తాము ప్రయోగించిన హ్వాసాంగ్-15 క్షిపణి అత్యంత శక్తివంతమైనదని ఆ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. ఈ క్షిపణి సుమారు 4,475 కి.మీ (2,780 మైళ్లు) ఎత్తు వెళ్లి, 950 కి.మీ. దూరం ప్రయాణించినట్లు వెల్లడించింది.

ఈ క్షిపణి ప్రయోగంతో 'అణురాజ్యం' కావాలన్న తమ లక్ష్యం నెరవేరినట్లు పేర్కొంది.

క్షిపణి ప్రయోగం గురించి తెలిసిన వెంటనే అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్షిపణి ప్రయోగం గురించి వివరించారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లోకెల్లా ఈ క్షిపణి అత్యంత ఎత్తుకు చేరినట్లు మాటిస్ తెలిపారు.

దక్షిణ కొరియా ప్రధాని మూన్ జేయిన్ కూడా ప్రయోగం జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు. అనంతరం అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉత్తరకొరియా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. క్షిపణి ప్రయోగం అమెరికాకే కాకుండా మొత్తం ప్రపంచానికే ప్రమాదకరమని పేర్కొంది.

Image copyright Reuters

క్షిపణి ప్రయోగంపై ఎవరేమన్నారు:

  • క్షిపణి ప్రయోగం జరిగిన వెంటనే జపాన్ ప్రభుత్వం ఉత్తర కొరియా రెచ్చగొట్టే ధోరణిని సహించేది లేదని ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబె.. వెంటనే భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితిని కోరారు.
  • ఉత్తరకొరియాపై ఆంక్షలు మరింత తీవ్రతరం చేయాలని దక్షిణ కొరియా ప్రధాని మూన్ జేయిన్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
  • ఉత్తరకొరియా మరోసారి అంతర్జాతీయ నిబందనలను ఉల్లంఘించిందని యూరోపియన్ యూనియన్ పేర్కొంది.
Image copyright Getty Images

గత జులైలో పరీక్షించిన దీర్ఘ శ్రేణి క్షిపణులు 'ప్రపంచంలోని ఏ ప్రాంతానికి' అయినా చేరగలవని ఉత్తరకొరియా అధికారులు తెలుపగా, అది కేవలం మధ్యంతర శ్రేణి క్షిపణి అని అమెరికా కొట్టిపారేసింది.

ఉత్తర కొరియా చివరిగా నిర్వహించిన అణుపరీక్షలో, దీర్ఘశ్రేణి క్షిపణిలో ఉపయోగించే హైడ్రోజన్ బాంబును పరీక్షంచడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

క్షిపణి, అణు కార్యక్రమాల కారణంగా ట్రంప్ ఇటీవలే ఉత్తర కొరియాను 'ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశం'గా ప్రకటించారు.

Image copyright Getty Images

2017లో ఉత్తర కొరియా నిర్వహించిన ముఖ్యమైన క్షిపణి పరీక్షలు

ఉత్తర కొరియా ఈ ఏడాది అనేక క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వాటిలో కొన్ని ప్రయోగించిన కొద్ది సేపటికే పేలిపోయాయి. మరికొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిపోయాయి.

  • 12 ఫిబ్రవరి - పశ్చిమ తీరంలోని బాంగ్యోన్ ఎయిర్ బేస్ నుంచి మధ్యంతరశ్రేణి క్షిపణి ప్రయోగం. అది జపాన్ సముద్రానికి తూర్పు వైపుగా సుమారు 500 కి.మీ. దూరం ప్రయాణించింది.
  • 4 ఏప్రిల్ - తూర్పు తీరం సింపో నుంచి జపాన్ సముద్రంలోకి మధ్యంతరశ్రేణి క్షిపణి ప్రయోగం. ఈ క్షిపణి సుమారు 60 కి.మీ. ప్రయాణించినట్లు దక్షిణ కొరియా తెలిపింది.
  • 4 జులై - మొట్టమొదటసారిగా ఖండాంతర గతిశీల క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. సుమారు 39 నిమిషాల పాటు ప్రయాణించిన ఈ క్షిపణి 2,802 కి.మీ. ఎత్తుకు చేరింది.
  • 29 ఆగస్టు - అణ్వాయుధాలను అమర్చేగలిగే సామర్థ్యమున్న క్షిపణిగా భావిస్తున్న మొదటి క్షిపణిని జపాన్ మీదుగా ప్రయోగించింది. ప్యాంగ్ యాంగ్ సమీపం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి ప్రయోగం సందర్భంగా సుమారు 550 కి.మీ. ఎత్తుకు చేరింది.
  • 15 సెప్టెంబర్ - ఉత్తరకొరియా రెండోసారి జపాన్ మీదుగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. 770 కి.మీ. ఎత్తుకు వెళ్లిన ఆ క్షిపణి దాదాపు 3,700 కి.మీ. దూరం ప్రయాణించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

‘టార్జాన్’ భార్యను పొడిచి చంపిన కొడుకు.. అతడిని కాల్చిచంపిన పోలీసులు

యుద్ధభూమిలో అమ్మానాన్న మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా

ఎరిత్రియా: ఇక్కడ సిమ్‌ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించే వారికి తెలియదు

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా

‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్’ - ప్రెస్ రివ్యూ

సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్‌'

ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్