అభిప్రాయం: ప్రేమ కోసం కన్నవారితోనే తలపడిన మహిళలు

  • 2 డిసెంబర్ 2017
హదియా Image copyright Shafin Jahan/facebook
చిత్రం శీర్షిక హదియా

పిల్లల తరపున నిర్ణయాలు తీసుకోవడం కోసం, వాళ్ల జీవితాలను నియంత్రించేందుకోసం తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళతారు.

ఈ విషయంలో కేరళకు చెందిన 24 ఏళ్ల హదియా కథ అంతకన్నా ప్రత్యేకమేమీ కాదు. హిందూ కుటుంబంలో జన్మించిన ఆమె ఇస్లాంను స్వీకరించి, ఓ ముస్లిం యువకుడిని పెళ్లిచేసుకున్నారు.

దీంతో ఆమె తల్లిదండ్రులకు హదియాను 'గృహనిర్బంధం'లో ఉంచారు.

భారతదేశంలో హిందూ అమ్మాయిలు ముస్లిం యువకులను, ముస్లిం అమ్మాయిలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవడం దశాబ్దాలుగా జరుగుతున్నదే.

ఈ రెండు సందర్భాలలోనూ యువతుల కుటుంబాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కానీ ప్రస్తుతం యువతులు కూడా తమ కుటుంబాలతో పోరాడుతున్నారు. తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు. తమ నిర్ణయంపై చివరి వరకూ నిలబడుతున్నారు.

తమ పట్ల భర్త కుటుంబంలో వ్యతిరేకత ఉన్నా, కొత్త పరిస్థితులలో ఇమడాల్సి వచ్చినా, తాము ప్రేమించిన వారిపై ఉన్న నమ్మకంతో వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికి స్థిరంగా కట్టుబడి ఉంటున్నారు.

Image copyright PTI
చిత్రం శీర్షిక హదియా భర్త

నగరాన్నే వదిలేయాల్సి వచ్చింది!

పేరు బయట పెట్టకూడదనే షరతు మీద నేను ఓ హిందూ యువకుడు, అతన్ని పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం అమ్మాయిని కలిశా. ఆ అమ్మాయి కుటుంబం తమపై దాడి చేస్తుందనే భయంతో వారు తమ నగరాన్ని వదిలేసి పారిపోయారు.

ఇద్దరి కుటుంబాలూ వీరి పెళ్లిని అంగీకరించలేదు. కానీ పెళ్లి చేసుకున్నామని తెలిస్తే అబ్బాయి కుటుంబం ఎలాగోలా తమ బంధాన్ని అంగీకరిస్తుందని వారిద్దరూ భావించారు.

అందువల్ల ప్రమాదం ఉన్నా, వేర్వేరు మతాల వారి మధ్య పెళ్లిని చట్టబద్ధం చేసే 'స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్' ప్రకారం ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు.

"భారతదేశంలో పెళ్లి తర్వాత భార్య తన కుటుంబాన్ని వదిలేసి భర్త కుటుంబంతో కలిసి ఉంటుంది. అందువల్ల పెళ్లయ్యాక అతని ఇంటికి వెళితే వారు మా బంధాన్ని అంగీకరించారు" అని ఆ యువతి తెలిపారు.

చిత్రం శీర్షిక హదియా

అవమానిస్తారేమోననే భయం!

కానీ ఆ తర్వాత మహిళల పరిస్థితి మారిపోతుంది.

"మేము మా నిర్ణయాలను వెల్లడించలేం. మాకు ఏది మంచో మేం తెలుసుకోకూడదు" అని ఆమె నాకు చెప్పారు.

వాళ్లిద్దరూ కలిసి ఉండడాన్ని అడ్డుకునేందుకు యువతి కుటుంబం 'ఎందాకయినా' వెళుతుందనే భయంతో వారు ఆ మరుసటి రోజే నగరాన్ని విడిచి పారిపోయారు.

ఆ తర్వాత ఐదేళ్ల వరకూ ఆమె కుటుంబ సభ్యులు ఆమెతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు.

వాళ్లు ఎంత కఠినంగా వ్యవహరించారంటే, తండ్రి చనిపోయిన తర్వాతే ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నట్లు ఆమెకు చెప్పారు.

''నేను దేనికీ బాధపడడం లేదు. కానీ పెళ్లికి సంబంధించి నేను స్వతంత్ర నిర్ణయం తీసుకున్నపుడు ఎందుకు నా తల్లిదండ్రులు నన్ను నమ్మలేదనేది నాకు ఆవేదన కలిగిస్తుంది. కనీసం మా నాన్న నాకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు" అని ఆమె తెలిపారు.

ఇది వయసుకు లేదా అనుభవలేమికి సంబంధించిన సమస్య కాదు. పిల్లలపై నియంత్రణ కోల్పోయామనే భావన, సమాజంలో తమకు అవమానం కలుగుతుందోనన్న భయానికి సంబంధించిన విషయం.

Image copyright Pti

తనంతట తాను బతుకుతున్నా కష్టాలే!

ఇలాంటి మరో సంఘటనలో, ఓ హిందూ అమ్మాయి తాను ప్రేమించిన ముస్లిం యువకుణ్ని పెళ్ళి చేసుకోవడానికి పదేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది.

వారిద్దరికి పరిచయమైనప్పటికే ఆమె ఉద్యోగం చేస్తూ, మంచి జీతం సంపాదిస్తుండేది. అయినా ఆమె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదు.

ఇదంతా ఓ కుట్ర అని, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మతాన్ని మార్చుకోవాల్సి వస్తుందని వారు ఆమెతో అన్నారు.

కానీ వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడెప్పుడూ ఆ అబ్బాయి అలాంటి షరతు పెట్టలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతను తన మాటకు కట్టుబడే ఉన్నాడు.

"ఇది లవ్ జిహాద్ కాదు. నాకెవరూ బ్రెయిన్ వాష్ చేయలేదు. ఇతర అమ్మాయిల్లా నేనూ ప్రేమించాను" అని ఆమె తెలిపారు.

అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు అర్థమయ్యేందుకు పదేళ్లు పట్టింది.

అది కూడా తాము పూర్తిగా కూతురిపైనే ఆధారపడడం వల్ల వాళ్లు ఈ బంధాన్ని అంగీకరించారు. వయసు పెరిగి, రోగాల బారిన పడిన పరిస్థితుల్లో, వారిద్దరికీ కూతురే దిక్కైంది.

ఒక దశ దాటాక వారు ఆమెను నియంత్రించలేకపోయారు. ప్రేమించిన దశాబ్ద కాలం తర్వాత ఆమె తాను ప్రేమించిన యువకుణ్ని పెళ్లి చేసుకోగలిగింది.

"నాకు నా ఇష్టాయిష్టాలపై పూర్తి స్పష్టత ఉంది. నా తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకుంటారని వేచి చూసే బదులు ఓ ముస్లిం అమ్మాయినే పెళ్లిచేసుకోమని కూడా నేను అతనితో అన్నా. కానీ అతను దానికి నిరాకరించాడు. వేచి చూస్తాననే అన్నాడు. కాపలా కాసేందుకు అమ్మాయిలు గొర్రెలు కాదని అతను భావించాడు" అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

లవ్ జిహాద్ ఆరోపణలు

హదియాది మరింత చేదు అనుభవం.

ఆమె పెళ్లయ్యాక కుటుంబ సభ్యులు ఆమెను ఎన్నో నెలల పాటు ఇంట్లో బలవంతంగా నిర్బంధించారు. ఆమె భర్త సుప్రీంకోర్టుకి వెళ్ళకపోయి ఉంటే ఆమెకు విముక్తి లభించి ఉండేదే కాదు.

అయినా హదియా పెళ్లిపై ఇప్పటికీ చర్చలు నడుస్తున్నాయి.

అది 'లవ్ జిహాద్' అనీ, ఆమెను సిరియాకు తీసుకెళ్లి ఇస్లామిక్ స్టేట్‌లో చేర్చేందుకే ఇలా చేస్తున్నారని హదియా తండ్రి కేరళ హైకోర్టులో పిటిషన్ వేయడంతో, కోర్టు వారి పెళ్లిని రద్దు చేసింది.

సుప్రీంకోర్టు దీనిపై జనవరిలో తీర్పు వెల్లడించనుంది.

Image copyright Reuters

వ్యక్తిగత స్వాతంత్రం ఎక్కడ?

హదియా మాత్రం కోర్టు లోపలా, బయటా తన స్వరాన్ని బిగ్గరగా వినిపిస్తూ వచ్చారు.

"నేను ముస్లింను. నేను నా ఇష్టపూర్వకంగా ఇస్లాంను స్వీకరించాను. ముస్లింగా మారాలని నన్నెవరూ బలవంత పెట్టలేదు. నాకు న్యాయం కావాలి. నేను నా భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నా" అని ఆమె మీడియా కెమెరాల ముందు స్పష్టంగా ప్రకటించారు.

ధైర్యవంతులైన ఇతర మహిళల్లాగే, ఆమెకూ తన ఇష్టాయిష్టాలపై పూర్తి స్పష్టత ఉంది.

ఆ ఇష్టం భవిష్యత్తులో తప్పని తేలినా సరే, ఆ తప్పును తానే గ్రహించి అందులోంచి పాఠం నేర్చుకోవాలనేది ఆమె అభిమతం. పురుషులు ఎలా తప్పులు చేస్తూ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారో, సరిగ్గా అలాంటి స్వేచ్ఛే ఆమెకూ కావాలి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌ ఫ్యాక్టరీ సీజ్.. ఐబీ అధికారి మృతి కేసులో AAP నాయకుడి పాత్రపై అనుమానాలు

యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు

దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...

దిల్లీలో హింస: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్లకు మించి ఏమైనా చేయగలరా?

కరోనావైరస్: ఇటలీలో 400కు పెరిగిన కేసులు

అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...